ఆంధ్రప్రదేశ్‌

ఐలయ్య సన్మాన సభకు .. వైశ్య, బ్రాహ్మణ సదస్సుకు ఎవరికీ అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 26: సంచలన రచయిత కంచె ఐలయ్యకు విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్‌లో దళిత సంఘాల జెఏసి తలపెట్టిన సన్మాన సభకు, అదే రోజు అక్కడే ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక తలపెట్టిన ఆత్మీయ సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జింఖానా గ్రౌండ్స్‌లో దళిత సంఘాల జెఏసి ఆధ్వర్యాన కోమటోళ్లు స్మగ్లర్లు పుస్తక రచయిత కంచె ఐలయ్యకు సన్మానం జరపాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఆర్య వైశ్య, బ్రాహ్మణ ఐక్య వేదిక అదేరోజు ఇక్కడే ఆత్మీయ సదస్సు జరిపేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్య మొదలైన వివాదం రోజురోజుకు శృతి మించుతోంది. ఒకరిపై ఒకరు తరచూ ప్రకటనలు చేసుకుంటూ ఎవరు అడ్డువచ్చినా.. ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నించినా.. తమ సభలు నిర్వహించి తీరుతామంటూ ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తూ వస్తున్నారు. ఇటు కంచె ఐలయ్య కూడా ఎవరు అడ్డుకున్నా సన్మాన సభకు హాజరై తీరుతానని ఇప్పటికే ప్రకటించారు. ఇదిలావుండగా.. తాజాగా ఆర్యవైశ్య బ్రాహ్మణ ఐక్య వేదిక గురువారం నగరంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆత్మీయ సదస్సుపై చర్చించింది. 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యే బ్రాహ్మణ, ఆర్యవైశ్యుల మనోభావాలపై చర్చించే ఆత్మీయ సదస్సుకు మరో అడుగు ముందుకేసి అన్ని సామాజిక వర్గాల పెద్దలను కూడా సదస్సుకు ఆహ్వానించింది. ముస్లిం మైనార్టీ, దళిత, బిసి, కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, గిరిజన సామాజిక వర్గాలకు చెందిన పెద్దలు హాజరుకానున్నారని, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి శిరిపురపు శ్రీ్ధర్ శర్మ ప్రకటించారు. దీంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. రెండు వర్గాల బాహాబాహీతో 28వ తేదీన నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావిస్తున్న నగర పోలీసుశాఖ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగా ఆరోజు ఇరువర్గాలకూ కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. ఐలయ్య సన్మాన సభకు పర్మిషన్ ఇచ్చేందుకు నో చెప్పేసింది. బ్రహ్మణ, వైశ్య సంఘాల ఆత్మీయ సదస్సు కూడా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వమని తేల్చేసింది. ఇప్పటికే అనుమతి కోసం ఇరువర్గాలు పోలీసులను సంప్రదించారు. అయితే ఉన్నతాధికారులు పరిశీలించిన మీదట నిఘా వర్గాల నివేదిక అధారంగా అనుమతికి పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ అనుమతికి నిరాకరించారు. ఇదే విషయాన్ని లా అండ్ ఆర్డర్ డిసిపి కాంతి రానా టాటా గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. కుల, మతాలకు సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని డిసిపి రానా హెచ్చరించారు. విజయవాడలో 28వ తేదీన ఛలో విజయవాడ కంచె ఐలయ్య ప్రతిఘటనా సంఘీభావ సభకు అనుమతి నిరాకరించామన్నారు. ఆర్య వైశ్య, బ్రహ్మాణ వేదిక అత్మీయ సదస్సుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని, నగరంలో 45రోజుల పాటు డిసెంబర్ 6వరకు సెక్షన్ 144 ఐపిసి, సెక్షన్ 30పోలీసు యాక్టు అమల్లో ఉన్నందున ఎవరూ సమావేశాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈమేరకు ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశారు. అంతకుముందు ఉన్నతాధికారులు ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు కూడా చేశారు.