ఆంధ్రప్రదేశ్‌

పత్తి రైతు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, నవంబర్ 2: పత్తిరైతు మరోసారి నష్టాలను మూటగట్టుకుంటున్నాడు. కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పంట మొత్తం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన అరకొర పంటను కోసి మార్కెట్‌కు తరలించగా అక్కడ గిట్టుబాటు ధర లభించలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో పత్తిరైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సిసిఐ సంస్థ రంగంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించని పరిస్థితి. ఫలితంగా పత్తి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆదుకునే వారు లేక అయినకాడికి పత్తిని అమ్ముకుంటున్నారు. నాణ్యత పేరుతో వ్యాపారులు అతి తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గిట్టుబాటు ధరకు పత్తి కొనుగోలు చేస్తామని సిసిఐ సంస్థ ప్రకటించినా ఆదోనిలోని పత్తిమార్కెట్‌లో వ్యాపారులు ముందుకురావడం లేదు.
సిసిఐ సంస్థ పెట్టిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. దీంతో చేసేదిలేక రైతులు పంటను వ్యాపారులకే అమ్మేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, దలారీలు, ఏజెంట్లు పత్తి రైతులను పీల్చి పిప్పిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధరను రూ.4,320గా ప్రకటించి చేతులు దులుపుకుంది. సీమలోనే అతిపెద్దదైన ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు జిల్లా నలుమూలల నుంచే గాక తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని శాంతినగర్, వడ్డేపల్లి, గద్వాల, కర్నాటకలోని సింధనూరు, కాటికి, మాన్వి, శిరుగుప్ప, బళ్ళారి, అనంతపురం జిల్లా రైతులు పత్తి అమ్మకానికి తీసుకువస్తుంటారు. రోజుకు 5 వేల పత్తి చెక్కులు అమ్మకానికి వస్తున్నాయి. అయితే ధర మాత్రం గిట్టుబాటుకావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాల్ రూ.2,800 నుంచి రూ.3,900 మాత్రమే పలుకుతోంది. రూ.3,900కు మంచి నాణ్యమైన పత్తిని ఒకటి, రెండు లాట్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన సరుకుకు తక్కువ ధర చెల్లిస్తున్నారు. అంతేకాకుండా పత్తి తూకాలు వేసిన తరువాత బాదు పేరుతో క్వింటాల్‌కు 5 కిలోలు చొప్పున కోత విధిస్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ చట్టం ప్రకారం రైతు తన సరుకు అమ్మిన వెంటనే సొమ్ము చెల్లించాలి. అయితే ఆదోని మార్కెట్‌లో నెల రోజుల తరువాత సొమ్ము చెల్లిస్తున్నారు. వెంటనే డబ్బు కావాలంటే రూ.2 వడ్డీ చొప్పున పట్టుకుని సొమ్ము చెల్లిస్తున్నారు. అధికారులకు ఈ విషయం మిన్నకుండిపోతున్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ముక్తసరిగా చెబుతున్నారు. ఎకరా పత్తి పంటసాగుకు రైతులు రూ. 60 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పంట కోత, కూలీల ఖర్చులు అదనం. కనీస గిట్టుబాటు ధర లభించకపోవడంతో అప్పులపాలవుతున్నామని పత్తిరైతులు వాపోతున్నారు. సిసిఐ సంస్థ రంగంలోకి దిగి నిబంధనలను సడలించి గిట్టుబాటు ధరకు పత్తి కొనుగోలు చేస్తే తాము నష్టాలబాట నుంచి గట్టెక్కుతామని పత్తిరైతులు కోరుతున్నారు.