ఆంధ్రప్రదేశ్‌

ఎట్టకేలకు అమ్మ ఒడికి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 26: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అపహరణకు గురైన పసికందు ఎట్టకేలకు తిరిగి అమ్మ ఒడికి చేరింది. శిశువును అపహరించిన మహిళా కిడ్నాపర్ పోలీసుల వలకు చిక్కి ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతోంది. తీవ్ర కలకలం రేపిన పసికందు కిడ్నాప్ మిస్టరీ తుదకు సుఖాంతం కావడంతో బంధువులు, అధికార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. తల్లిదండ్రులు దుఃఖసాగరం నుండి తేరుకుని పసిగుడ్డును గుండెలకు హత్తుకున్నారు.
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఈ నెల 23వ తేదీ ఉదయం గంటా లక్ష్మి ఆసుపత్రిలో ఆడపిల్లను ప్రసవించింది. అయితే సాయంత్రం ఇంజక్షన్ వేయించాలని తీసుకెళ్లిన యువతి పసికందుతో పరారయ్యింది. ఈ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పోలీసు యంత్రాంగం వెనువెంటనే అప్రమత్తమయ్యింది. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ అపహరణకు గురైన శిశువు గాలింపునకు పది బృందాలను ఏర్పాటుచేశారు. బృందాలు రాష్ట్రంతోపాటు, తెలంగాణ, ఒడిసా, తమిళనాడు రాష్ట్రాల్లో గాలింపు ప్రారంభించాయి. ఆసుపత్రిలో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా శిశువును అపహరించిన యువతి ఆచూకీ పోలీసులకు లభ్యమయింది. ఈమేరకు కిడ్నాప్ చేసిన యువతి జిల్లాలోని ఐ పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన పండు రమణ(28)గా గుర్తించారు. కిడ్నాపర్ వద్ద శిశువు క్షేమంగా ఉన్నట్టు తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, కాకినాడ డిఎస్పీ వర్మ, ప్రత్యేక బృందాలకు నేతృత్వం వహిస్తున్న కాకినాడ వన్‌టౌన్ సిఐ ఎఎస్ రావు తదితరులు తమ సిబ్బందితో ఆదివారం ఉదయం ఐ పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఓ ఇంట్లో సురక్షితంగా ఉన్న శిశువును ప్రత్యేక అంబులెన్సులో మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువును అపహరించిన రమణను అదుపులోకి తీసుకున్నారు. ఎంతో ఆత్రంగా బిడ్డకోసం ఎదురుచూస్తున్న తల్లి లక్ష్మికి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లా ఎస్పీ విశాల్ గున్ని బిడ్డను అప్పగించారు.
బిడ్డలు లేరన్న బాధతో...
తనకు బిడ్డలు లేరనే బాధతో నిందితురాలు పండు లక్ష్మి ఆసుపత్రి నుండి పసికందును అపహరించినట్టు పోలీసుల విచారణలో అంగీకరించింది. ఎస్పీ విశాల్‌గున్నీ దీనిపై మాట్లాడుతూ ఐ పోలవరానికి చెందిన పండు రమణ (28) ఇప్పటికే రెండుసార్లు అబార్షన్లు అయ్యాయని, ఆరు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో సైతం గర్భస్రావం కావడంతో ఆమె మానసికంగా కుంగిపోయిందన్నారు.
తనకు బిడ్డ పుట్టిందని కుటుంబ సభ్యులను నమ్మించడానికి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వివరించారు. నిందితురాలు రమణ కాకినాడ నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోందని, ఆరు నెలలుగా ఇక్కడే నివాసం ఉంటోందని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ ఎఆర్ దామోదర్, కాకినాడ డిఎస్పీ వర్మ, వన్‌టౌన్ సిఐ ఎఎస్ రావు కృషి ఫలితంగా శిశువు ఆచూకీ కనుగొని తల్లిచెంతకు చేర్చామని ఎస్పీ తెలియజేశారు.

చిత్రం..అపహరణకు గురైన శిశువును తల్లి లక్ష్మికి అప్పగిస్తున్న
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని