ఆంధ్రప్రదేశ్‌

ఇకపై ‘అణువు’ కదలదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 30: ఇక అణువు కదలదు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత-అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో కొవ్వాడలో పది వేల మెగావాట్ల సామర్థ్యంలో నిర్మించనున్న అణుపార్కు నిర్మాణానికి అన్ని రకాల సన్నాహాలు తుది దశకు చేరుకున్న సమయంలో నిధుల సమస్య తలెత్తింది. అత్యంత కీలకమైన భద్రత వలయానికి 60 కిలోమీటర్లు ఏయే గ్రామాలు ఖాళీ చేయాలి? అణుకేంద్ర రక్షణ పరిధిలోకి ఏయే గ్రామాలు వస్తాయి? ఎంత భూమి అవసరం..అన్నీ సమగ్రంగా..అత్యున్నతస్థాయిలో వివరాలు విశే్లషించిన తర్వాత అమెరికా నుంచి అందాల్సిన నిధులకు నిబంధనలు తాజాగా మోకాలడ్డుతున్నట్టు తెలిసింది. సుమారుగా 8-10 బిలియన్ డాలర్లు నిధులు సమీకరించేలా ఒప్పందాలు భారత్-అమెరికా మధ్య ఉన్నప్పటికీ, కేవలం 10 మిలియన్ డాలర్లు కంటే అధికంగా ఆర్థిక సాయం అందించేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా పదవీకాలం ముగియడం, ట్రంప్ అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు స్వీకరించి, ఆ సయుంక్తరాష్ట్రాలను పరిరక్షించే పనిలో తీవ్ర కృషి జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎగుమతి-దిగుమతుల బ్యాంకు నుంచి అందాల్సిన రుణాలు సైతం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రస్తుతం కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు డబ్బులు రావన్న సమాచారం ఆ ప్రాజెక్టు ఉన్నతాధికారులకు తెలిసినా...ప్రజలకు మభ్యపెడుతూ అణుపార్కు నిర్మాణానికి ముందడుగు వేస్తున్నట్టు జిల్లా యంత్రాంగం నమ్మబలుకుతుండడం గమనార్హం. కొవ్వాడ సమీపంలో ఆరు రియాక్టర్లు సామర్థ్యం కలిగిన అణుపార్కు నిర్మాణానికి భారత్ ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అణుపార్కు నిర్మాణానికి అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్ కంపెనీతో భారతప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు తొమ్మిది బిలియన్ డాలర్లు నిధులు ఈ ప్రాజెక్టు పూర్తిచేసేందుకు అవసరమని నిపుణుల బృందం అంచనాలు రూపొందించింది. అయితే, అమెరికా మాత్రం పది మిలియన్ డాలర్లే ఆర్థిక సాయం అందించేందుకు అక్కడ బ్యాంకుకు సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.
ఎగుమతి-దిగుమతి బ్యాంకు(అమెరికా) బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసేందుకు నిబంధనలు ప్రతికూలంగా నిలవడం, ఇదే సమయంలో ట్రంప్ నియంతపోకడలు, నిర్ణయాలు-ఒప్పందం కుదుర్చుకున్న ఒబామా పదవీ కాలం ముగియడం వంటి పరిణామాలు కొవ్వాడ అణుపార్కుకు ప్రతీకూలంగా నిలుస్తాయని భారత ప్రభుత్వ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తమైన మోదీ సర్కార్ మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని పూర్తిచేసేలా జపాన్, దక్షిణకొరియా దేశాల ఆర్థిక సాయం కోసం పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అమెరికా విడుదల చేసే పది మిలియన్ డాలర్లు మొత్తం కేవలం ఈ ప్రాజెక్టు పునరావాసం, వౌలిక సదుపాయాలు, రక్షణ వలయాల నిర్మాణాలకే నిధులు సరిపడతాయని, ప్రాజెక్టు, రియాక్టర్ల ఏర్పాటు, ముడిసరుకు దిగుమతికి డబ్బులు లేనిపరిస్థితి ఏర్పడినట్టు నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇదే జరిగితే, జిల్లాకు మరింత నష్టం ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. గ్రామాలను ఖాళీ చేయించి, ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయకుంటే అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని మరోవాదన వినిపిస్తోంది. ఏడేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేయాల్సివున్నప్పటికీ ఇప్పటివరకూ ఎటువంటి పనులు ప్రారంభించకపోవడం దీనికితోడు కేవలం మొదటి విడతగా 395 కోట్లు రూపాయలు నిధులు విడుదల చేయడంతో పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రాథమికంగా అణుపార్కు నిర్మాణానికి రూ.1000 కోట్లు అవసరమని నివేదికలు కేంద్రప్రభుత్వానికి నిపుణులు సమర్పించారు. ఆ స్థాయిలో నిధులు విడుదలకాకపోవడం పునరావాసం తొలుత కల్పించాల్సివున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా అడుగులు వేయలేకపోవడం అణుపార్కు నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. తమిళనాడులో కుడన్‌కులంలో ఏర్పాటు చేస్తున్న మూడు రియాక్టర్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుకు 30 కిలోమీటర్లు పునరావాసం కల్పించగా, ఆరు రియాక్టర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 కిలోమీటర్లు అంటే కొవ్వాడ నుంచి నరసన్నపేట వరకూ భద్రతా జోన్‌గా ప్రకటించాల్సివుంది. దీనిబట్టి పునరావాసం, భూసేకరణకే అమెరికా ఆర్థిక సాయం సరిపోదన్న అంచనాలు తాజాగా ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇదే వాస్తవానికి దగ్గరైతే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ‘అణువు’ కూడా కదలదన్నది అధికారులు దాచిపెట్టిన బహిరంగ రహస్యం!

చిత్రం..అణుపార్కు నిర్మించాల్సిన కొవ్వాడ గ్రామం