ఆంధ్రప్రదేశ్‌

మీ ఇష్టం.. ఆపమంటే ఆపేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 30: విభజన హామీల్లో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుపై ఎంత మంది ఎన్ని వివాదాలు సృష్టించినా... ఎన్ని అవాంతరాలు ఎదురైనా... నిధుల సమస్య ఎదురౌతున్నా... ఆపకుండా పనులను పరుగులు తీయిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ శాసన సభ సమావేశాల్లో భాగంగా గురువారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు, కేంద్ర ఆర్థిక సహాయంపై జరిగిన లఘు చర్చలో సిఎం చంద్రబాబు తన మనసులోని మాటను వెలిబుచ్చారు.
ఒకవైపు ప్రతిపక్షాలు వివాదాలు సృష్టిస్తుంటే తాజాగా టెండర్ల విషయంలో కేంద్రం కొర్రీలు విధించడంతో విసిగిపోతున్నామని, అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేకుండా పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ప్రాజెక్టు పూర్తి చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి.. తక్షణం ప్రాజెక్టు నిర్మాణాన్ని అపేస్తామని హెచ్చరించారు. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకే కేంద్ర ప్రాజెక్టు పూర్తి బాధ్యతలను రాష్ట్రానికి అప్పచెప్పిందన్న ఆయన, అన్నివైపుల నుండి మూకుమ్మడి దాడి జరుగుతున్న పరిస్థితుల్లో ఎవరు ముందుకు వచ్చి ప్రాజెక్టును తాము పూర్తి చేస్తామంటే వారికి తక్షణమే అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నాడు ముందు చూపుతోనే పట్టిసీమను పూర్తి చేశామని, అందువల్లే నేడు పంటలకు, తాగటానికి నీరు లభిస్తోందన్నారు. ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందన్న మాటల్లో వాస్తవముందన్న ఆయన దానికి యుపీఏ హయాంలో చేసిన చట్టాలు, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఆలస్యమే కారణమన్నారు. పరిహారం చెల్లింపు మూడు వేల కోట్ల రూపాయల నుండి 32 వేల కోట్లకు పెరగటానికి అప్పట్లో యుపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన భూసమీకరణ చట్టమే కారణమన్నారు. విభజన తథ్యం అని భావించిన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, బిజెపితో పోత్తు పెట్టుకోవడంతో పాటు పోలవరం ఆవశ్యకతను గుర్తించి నాడు ప్రాజెక్టు కోసం పట్టుబట్టినట్లు గుర్తు చేశారు. కేంద్రం ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించడంలో ఆలస్యం జరుగుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులను ఖర్చు చేస్తూ నిర్మాణానికి ఆటంకం కలుగకుండా చూస్తున్నామన్నారు. కొన్ని పార్టీలు కోర్టుల్లో కేసులు వేస్తూంటే వాటిని పరిష్కరించుకుంటూ, పరిహారం చెల్లింపులు చేస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపిన ఆయన తాజాగా కేంద్రం స్పిల్ వే పనులను అపాలంటూ లేఖ రాసిందని తెలిపారు. అయితే ఈ సమయంలో నిర్మాణం నిలిపి వేస్తే రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు వస్తాయని, నిర్మాణ సంస్థలు తిరిగి వెళ్లిపోవడంతో పాటు తరువాత వచ్చినా వ్యయం పెరుగుతుందని దీనికి తోడు న్యాయ పరమైన చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఉందని భావించి కేంద్రం అపమన్నా నిర్మాణాన్ని మాత్రం అపకుండా, అనుకున్న ప్రకారం ముందుకు సాగమని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి 66 వేల ఎకరాలకు పరిహారం ఇంకా అందిచాల్సి ఉందని, వీటితో పాటు రెండు లక్షల మందికి ఉపాధి, పరిహారంతో పాటు భూపంపిణీ చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు నిలుపుదల లేఖ విషయంపై కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడేందుకు ప్రయత్నించించామని మంత్రి లండన్ పర్యటనలో ఉన్నందున వచ్చాక చర్చించనున్నట్లు చెప్పారు. వీటితో పాటు విభజన కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, ఇప్పటి వరకు వచ్చిన అంశాలు, పోలవరం ప్రాజెక్టు సమగ్ర వివరాలు పూర్తి నివేదికతో రలో ప్రధాని మంత్రి మోదీని కలిసి వివరించనున్నట్లు ప్రకటించారు. మిత్రపక్షమైన బిజెపి నేతలు కూడా ఢిల్లీ వెళ్లి పెద్దకు వాస్తవాలను వివరించాలని సూచించారు. నాడు యుపిఏ ప్రభుత్వం చేసిన తప్పిదాలు నేడు ఏపికి శాపంగా మారాయని, పోలవరం ముంపు మండలాలను నాడు విభజన చట్టంలో ఎందుకు ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ఇప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఒక్కోక్కటిగా నెమ్మదిగా వస్తున్నాయని, పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సి ఉందన్నారు. చట్టంలో పేర్కొన్న సంస్థలతో పాటు అదనంగా కొన్ని సంస్థలను కేంద్రం మంజూరు చేసిందని, వీటి ఫలాలు అందేందుకు మాత్రం కాస్త సమయం పడుతుందన్నారు. అలాగే విభజన చట్టంలో ఎదురౌతున్న కొన్ని అడ్డంకులను పరిష్కరించేందుకు తెలంగాణకు, ఏపికి కేంద్రం మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.
కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడకుండా స్వరం వినిపించి సమన్వయం పాటిస్తూ కేంద్రం నుండి సహాయన్ని అభ్యర్థిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ విమర్శించడం, ఆందోళలు చేయడం మాని ఢిల్లీ వెళ్ళి వారి స్వరం వినిపించాలని కోరారు. ప్రత్యేకహోదా కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తున్నామని చెప్పిన బాబు ప్యాకేజీ అమలు కోసం పట్టుబడుతున్నట్లు తెలిపారు. హోదా విషయంలో రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష వైకాపా ఎంపీల రాజీనామా హెచ్చరిక ఏమయిందని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రాజెక్టు నిలుపుదల కోసం ప్రయత్నాలు చేసినా ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి తీరుతామని ధీమాగా చెప్పారు.