ఆంధ్రప్రదేశ్‌

మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణ అకాడమి ఏర్పాటు యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణకు అకాడమీ ఏర్పాటు చేసే యోచన ఉందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఆ శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆపద సందర్భాల్లో తమను తాము రక్షించుకునేందుకు వీలుగా శిక్షణ ఉంటుందన్నారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న యువజన పాలసీపై భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సచిన్ టెండూల్కర్, సింధూ, కిడాంబి శ్రీకాంత్ వంటి యూత్ ఐకాన్‌లను ఆహ్వానిస్తామన్నారు. యువజన పాలసీపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. నిబంధనలు అనుమతిస్తే, శాసనసభలో యూత్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. యువత కోసం ప్రత్యేక యాప్ తయారు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పలు చోట్ల శాశ్వత ఆర్మీ శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తామని, ఇందుకు పదవీ విరమణ చేసిన ఆర్మీ సిబ్బంది సేవలు వినియోగంపై అధ్యయనం చేస్తామన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలు నిర్మిస్తున్నామని, నిర్మాణంలో జాప్యం జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ, విశాఖ, విజయనగరం, కాకినాడ, మచిలీపట్నంలో స్టేడియాలకు స్థల సేకరణ వేగవంతం చేయాలన్నారు. క్రీడా, యువజన శాఖల్లో నిధులున్నా, ఖర్చు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

స్వయం సహాయ సభ్యులకు ‘సెర్ప్’ ఆధ్వర్యంలో నేటి నుంచి శిక్షణా తరగతులు

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలోని స్వయం సహాయ బృందాలకు ‘సెర్ప్’ శుక్రవారం నుంచి విస్తృతస్థాయిలో శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నది. గ్రామస్థాయిలో ఉన్న గ్రూపు సభ్యుల నుంచి గ్రామ సంఘ సభ్యులు, మండల సమాఖ్య సభ్యులు, జిల్లా సమాఖ్య సభ్యులు ఇలా అన్ని స్థాయిల్లో ఈ శిక్షణా తరగతులు 2018 మార్చి చివరి వరకు నిర్వహించడానికి ‘సెర్ప్’ కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,10,937 స్వయం సహాయ బృందాల్లో 92.19 లక్షల మంది సభ్యులు వున్నారు. వీరిలో 72 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో, 20 లక్షల మంది పట్టణ ప్రాంతాల్లో వున్నారు. వీటి పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వ చర్యలు చేపట్టినట్లు సంస్థ సీఈవో డా.పి.కృష్ణమోహన్ తెలిపారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక మారిన పరిస్థితుల్లో తిరిగి పాటవ నిర్మాణానికి మరో విడత శిక్షణను సెర్ప్ చేపట్టింది. ఇటీవలి కాలంలో అన్ని చోట్ల పనితీరుకు గ్రేడింగ్ విధానం అమలులోకి రావడంతో ఈ గ్రూపుల పనితీరుకు కూడా కొంతకాలంగా సెర్ప్ గ్రేడింగ్ విధానాన్ని అవలంబిస్తున్నది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం వివిధ వర్గాలకు అమలు చేస్తున్న అభివృద్ధి - సంక్షేమ పథకాల గురించిన ప్రాథమిక సమాచారం కూడా ఈ తరగతుల్లో వుంటుంది. 92 లక్షల మంది పైగా, సభ్యత్వంతో విస్తృతమైన నెట్‌వర్క్‌తో గ్రామీణ ప్రజలతో నేరుగా సంబంధం వుండటంతో, రాష్టస్థ్రాయిలో సెర్ప్ జిల్లాల్లో వెలుగు ప్రాజెక్టులకు ప్రభుత్వం సామాజిక పెన్షన్లు, అసంఘటిత రంగ కార్మికుల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు చెల్లింపు అప్పగించింది. ఇందుకు జిల్లాలో కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇవి కాక బీమా మిత్ర, బ్యాంకు మిత్ర, డిజిటల్ సాధి వంటి కొత్త విధులు గౌరవ వేతనంపై పనిచేస్తున్నారు. ఇవి కాక స్ర్తినిధి బ్యాంకు అప్పులు, చెల్లింపులు పండ్ల మొక్కల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణం, వంటి గ్రామీణ అభివృద్ధి శాఖ పథకాల అమలు ఇప్పుడు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిజిటల్ ప్లాట్‌ఫాంల మీద పనిచేస్తున్నాయి. సాగుబడితో పాటు రూరల్ రిటైల్ చెయిన్ గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల కోసం వన్‌స్టాప్ షాప్ వంటి కొత్త కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటి అమలు, పర్యవేక్షణ కొరకు బ్యాంకు ప్రతినిధి ఒకరు స్వయంగా సెర్ప్ కార్యాలయం నుంచి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం గ్రామీణ మహిళల పాటవ నిర్మాణానికి ప్రయోజనకరం కానుంది.

పనిచేయని అధికారులను ఉపేక్షించేది లేదు

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ కార్యకమాల్లో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని అధికారులు, సిబ్బందిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమంపై బుధవారం వెలగపూడి సచివాలయంలో ఆ శాఖ ఇంజనీర్లు, అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ రూరల్, ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకాల కింద గృహ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం వద్ద నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకునేందుకు వీలుగా ఆయా పథకాల కింద మంజూరైన గృహాలను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖలో పనులు సక్రమంగా జరగకుంటే ఎంతమాత్రం ప్రేక్షకపాత్ర వహించవద్దని, సరిగా పనిచేయని ఒకరిద్దరు అధికారులు లేదా ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాంతిలాల్ దండేకు సీఎస్ స్పష్టం చేశారు. సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని పెద్దఎత్తున అమలు చేస్తున్న నేపథ్యంలో వివిధ పథకాల కింద మంజూరైన ఇళ్లన్నిటినీ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలను మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖపై రానున్న మూడు మాసాల్లో నెలకొకసారి జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షిస్తామన్నారు. హుద్‌హుద్ తుపాను గృహ నిర్మాణాలపై ఆయన సమీక్షిస్తూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 9 వేల 170 ఇళ్లను మంజూరు చేసి మూడేళ్లు దాటినా వాటిని ఇంకా పూర్తి చేయలేకపోవడమేమిటని ప్రశ్నించారు. వెంటనే పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడి సకాలంలో ఆ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి ముందు చేపట్టిన ఐఏవై గృహ నిర్మాణాలను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని చెప్పారు. ఈ పథకం కింద మొత్తం లక్షా 48 వేల గృహాలను నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే లక్షా 37 వరకూ ఇళ్లు నిర్మించగా మరో 11 వేల వరకు నిర్మించాల్సి ఉందని వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శాంతిలాల్ దండే గృహ నిర్మాణ పథకాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద ఇప్పటికే లక్షా 82 వేల ఇళ్లను గ్రౌండ్ చేసి లక్షా 8 వేల గృహాలను పూర్తి చేశామని వివరించారు. గృహ నిర్మాణాలను వేగవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అందరు ప్రాజెక్టు డైరెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఎండి కాంతిలాల్ దండే సీఎస్‌కు వివరించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ ఎస్‌ఇలు ఆర్.శ్రీరాములు, మల్లికార్జునరావు, వెంకటరెడ్డి, ఈఈలు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువగా వస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప తెలిపారు. విజయవాడలో ఒక హోటల్‌లో సిఐఐ దక్షిణాది ప్రాంతీయ సదస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు తరువాత భారీగా రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో 2022 నాటికి దేశంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. ఏపీలో విస్తృతంగా ఉన్న వ్యాపార అవకాశాలను విశ్వవ్యాప్తంగా సీఎం చాటి చెబుతున్నారన్నారు.
ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి హెల్త్‌కార్డులు, పదోన్నతులు కల్పించాలి

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలోని ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి తక్షణం హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రత్యేక సర్వీస్ నిబంధనలు రూపొందించి పదోన్నతులు కల్పించాలని ఎపిజెఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన జెఏసీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిడెడ్ సిబ్బంది కోసం ప్రభుత్వం గత నవంబర్ 27వ తేదీ జారీ చేసిన 186 ఉత్తర్వుల ప్రకారం ఆర్జిత, అర్ధవేతన సెలవులను నగదుగా మార్చుకునే విధానాన్ని 2010 మే 4వ తేదీ నుంచి అమలయ్యేలా జీవోను సవరించాలన్నారు. జీవో 35ను సవరించి ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు జరుపుకునే అనుమతినివ్వాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లైబ్రేరియన్లకు అదే శాఖలో పదోన్నతులు కల్పించాలని మహిళా లైబ్రేరియన్స్‌కు మహిళా అధ్యాపకులతో సమానంగా ఐదు రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లైబ్రేరియన్ అససియేషన్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్లు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీ లైబ్రేరియన్స్, అసోసియేట్స్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అమరావతి జేఏసీలో విలీనం అయ్యాయి.
తెలుగుదేశంతోనే బీసీల అభివృద్ధి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే అనగాని

విజయవాడ, డిసెంబర్ 6: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, అసలు తెలుగుదేశం పార్టీకి బీసీలే వెనె్నముక అని వారి అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేవం ప్రభుత్వానిదేనన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల కోసం ప్రభుత్వం సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. 2015-16 సంవత్సరానికి 21 శాఖలకు రూ.6,640 కోట్లు, 2016-17లో 33 శాఖలకు సంబంధించి రూ.8,832 కోట్లు, 2017-18కు 37 శాఖల కింద రూ.10 వేల కోట్లు కేటాయించారన్నారు. ఇవే కాకుండా చంద్రన్న పెళ్లికానుక కింద బీసీ కుటుంబాలకు రూ.30 వేలుఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కేటాయించారన్నారు.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం ఈ ఏడాది 274.50 కోట్లు కేటాయించామని, 3,77,781 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందన్నారు. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 1042 కోట్లు కేటాయించగా 4,84,714 మంది విద్యార్థులు, ఈబీసీ విద్యార్థులకు రూ.432.75 కోట్లు కేటాయించగా 1,24,595 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారన్నారు. 788 ప్రీమెట్రిక్ వసతి గృహాల కోసం రూ.143.56 కోట్లు కేటాయించగా 89,429 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఈ ఏడాది రూ.208.88 కోట్లు కేటాయించగా 14,452 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందన్నారు. దశలవారీగా హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చడం జరుగుతోందన్నారు. 62 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా 65 నూతన బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు.

ఆర్టీసీలో ప్రమాదాల రేటు తగ్గింపుపై దృష్టి

విజయవాడ, డిసెంబర్ 6: దశాబ్దాలుగా వస్తున్న నష్టాల నుంచి కాస్తంత బైటపడేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.మాలకొండయ్య తీసుకువస్తున్న సంస్కరణల్లో భాగంగా అధికారులు ప్రమాదాల రేటు తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ప్రమాద రహిత డ్రైవింగ్‌ను ప్రోత్సహించే నిమిత్తం గత కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్న భద్రత డ్రైవింగ్ అలవెన్స్ ‘సేఫ్టీ డ్రైవింగ్ అలవెన్స్’ను ఒకేసారి రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఎలాంటి ప్రమాదాలు, డ్యామేజీలు లేకుండా డ్రైవింగ్ చేసేవారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.600 అలెవెన్స్‌ను రూ.1200కు పెంచారు. ఐదు నుంచి 9 ఏళ్ల కాలంలో అయితే ప్రస్తుతం ఇచ్చిన రూ.1200లకు రూ.2400లకు, 10 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు అయితే రూ.1800 నుంచి రూ.3,600లకు, చివరగా 15ఏళ్లకు పైగా ఎలాంటి ప్రమాదాలు కనీసం డ్యామేజీ లేకుండా చేస్తే ప్రస్తుతం రూ.2,400లను రూ.4,800లకు పెంచారు. అర్హులైన వారికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అలవెన్సులు ఇవ్వటమే కాకుండా ప్రతి ఏటా జరిగే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో వారికి డిపో, జిల్లా, రాష్టస్థ్రాయిల్లో సత్కారాలు, అవార్డులు కూడా ఉంటాయి. అయితే సంబంధిత కాల వ్యవధిలో ఎలాంటి సస్పెన్షన్లు ఉండరాదు. పైగా ప్రయాణికుల నుంచి కూడా ఏ విధమైన ఫిర్యాదులు ఉండరాదు. డెప్యూటీ సీటీఎం ఆధ్వర్యంలో డిపో మేనేజర్ , అకౌంట్స్ ఆఫీసర్స్‌లతో కూడిన కమిటీ అన్ని రకాల రికార్డులను పరిశీలించి అర్హత కల్గిన డ్రైవర్లను ఎంపిక చేస్తుంది. ప్రతి ఏటా జూలై మాసంలో నిర్వహించే జీరో ఆక్సిడెంట్ కార్యక్రమంలో ఈ ఎంపికైన డ్రైవర్లకు ఈ అలవెన్సులు అందిస్తారు.
కార్మికులు, ఉద్యోగులకు రేమాండ్ యూనిఫాం
ఇప్పటివరకు, సంస్థ అందించే యూనిఫాం పట్ల అన్నీ స్థాయిల్లోనూ పెదవి విరుపు ఉండేది. దీన్ని గుర్తించిన ఎండీ మాలకొండయ్య కార్మికుల, ఉద్యోగులందరికీ ఏకంగా రేమాండ్ కంపెనీ యూనిఫాం అందించారు. దీనిపై ఇటీవల ఓ సర్క్యులర్ జారీ అందజేశారు. బస్ స్టేషన్‌లలో పనిచేసే ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్‌లకు వైట్ యూనిఫాం, కంట్రోలర్లు, ఎడిసి, సూపరింటెండెట్లకు వైట్ యూనిఫాం, డ్రైవర్లు, కండక్టర్లకు ఖాకీ యూనిఫాం, ఏసీ బస్సు డ్రైవర్లకు బ్లాక్ ప్యాంట్, గ్రేకలర్ షర్ట్, గ్యారేజీ సిబ్బందికి డార్క్ బ్లూ యూనిఫాం, మెకానికల్ సూపర్ వైజర్లకు, సూపరింటెండెంట్లకు గ్రేకలర్ యూనిఫాం, మెడికల్ ఆఫీసర్‌లకు వైట్, సిబ్బందికి గ్రేకలర్, ల్యాబ్ అసిస్టెంట్లకు వైట్ ప్యాంట్, బ్లూ షర్ట్, మహిళా కండక్టర్లకు రామా కలర్ కస్తూరి, క్రేప్ ఖాకీ యాప్రాన్ ఇచ్చేందుకు సంస్థ నిర్ణయించింది. ఈ మేర ఇప్పటికే పంపిణీ ప్రారంభమైంది.