ఆంధ్రప్రదేశ్‌

కానరాని ‘నగదు రహితం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలో రేషన్ పంపిణీలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఆశయం కలగానే మిగలనుంది. గణనీయంగా తగ్గిన నగదు రహిత లావాదేవీలతో అది కేవలం ప్రచార ఆర్భాటంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేశాక, ప్రత్యామ్నాయంగా నగదు రహిత లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా నగదు సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం భావించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దీనిపై విస్తృత ప్రచారం చేసింది. రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలను ఒకదశలో దాదాపు తప్పనిసరి చేసింది. నగదు రహిత లావాదేవీలు చేసిన వారికి మూడు నెలల పాటు ప్రోత్సాహకాలను కూడా అందజేసింది. అయినప్పటికీ కొంతమేర నగదు రహిత లావాదేవీలు జరిగినప్పటికీ ప్రస్తుతం నామామాత్రంగా అమలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 4.02 శాతం మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి ఇది దాదాపు తగ్గుతూ వస్తోంది.
ఈ ఏడాది జూన్‌లో కృష్ణా జిల్లా 68.64 శాతం నగదు రహిత లావాదేవీలతో మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో 52.57 శాతంతో శ్రీకాకుళం, 26.4 శాతంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండేవి. డిసెంబర్ నెలకు సంబంధించి కృష్ణా జిల్లా 22 శాతం, శ్రీకాకుళం 20.59 శాతం, పశ్చిమ గోదావరి జిల్లా 3.4 శాతం, తూర్పు గోదావరి జిల్లా 2.61, గుంటూరు 1.69 శాతం, విశాఖపట్నం 0.85 శాతం, కర్నూలు, నెల్లూరులో సున్నా శాతం నగదు రహిత లావాదేవీలు జరిగాయి. నెట్‌వర్క్ సమస్య వల్ల కొన్నిచోట్ల నగదు చెల్లించి, రేషన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. తొలినాళ్లలో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి కేంద్రీకరించినా, తరువాత వదిలేయడంతో రేషన్ దుకాణాల్లో మళ్లీ నగదు లావాదేవీలు సాగుతున్నాయి. దీంతో గతంలో ప్రభుత్వం చేసిన హడావుడి కేవల ప్రచార ఆర్భాటంగా మిగిలిపోనుంది. లోపాలు ఉన్నచోట వాటిని సరిచేసి, నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలను మళ్లించాల్సి ఉంది. కానీ ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కానరావటం లేదు.