ఆంధ్రప్రదేశ్‌

అమరావతి ఔటర్‌లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 3: రాజధాని బాహ్య వలయ రహదారి మార్గంలో రెండు, మూడు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో, నీటి వనరులు పుష్కలంగా ఉన్న చోట్ల ఈ టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతం వాణిజ్యపరంగా త్వరత్వరగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై 30 రోజులలోపు ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. బుధవారం రాత్రి విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అమరావతిలో చేపట్టిన వివిధ రహదారి ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించారు. బాహ్య, అంతర్ వలయ రహదారుల్లో శీఘ్రగతిన అభివృద్ధి ఎలా జరపాలన్న అంశంపై ఇప్పటి నుంచే తగిన వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే మార్గంలో కూడా పలు జిల్లాల పరిధిలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయాలని, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతోందంటే సంబంధిత భూముల యజమానులు భూ సమీకరణకు ముందుకు వస్తారని అన్నారు. 3, 4 ఏళ్లలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే భూ సమీకరణకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 30 గ్రామాల మీదుగా సాగే అమరావతి అంతర్ వలయ రహదారిని మొదటి విడతగా 97.5 కి.మీటర్ల మేర నిర్మిస్తున్నట్టు అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో తాటికొండ, రావెల తదితర 5 గ్రామాల రైతాంగం భూసమీకరణ విధానంలో తమ భూములను అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ గ్రామాలతో పాటు బాహ్య, అంతర వలయ రహదారుల పరిధిలోని ఇతర గ్రామాల్లో కూడా భూ సమీకరణకు ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. హైబ్రిడ్ నమూనాలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని అధికారులను కోరారు. బాహ్య వలయ రహదారిని మొత్తం 189 కి.మీటర్ల మేర నిర్మితం కానున్నదని, ఎన్‌హెచ్‌ఏఐ దీనికి అవసరమైన అనుమతులను మంజూరు చేసిందని అధికారులు చెప్పారు. మొత్తం రూ. 17,761 కోట్ల వ్యయం అంచనాతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు వివరించారు. 150 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల రహదారిగా ఇది ఏర్పాటవుతుందని తెలిపారు. దీని కోసం మొత్తం 3,404 హెక్టార్ల మేర భూమి అవసరం పడుతుందని చెప్పారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 87 గ్రామాల్లో ప్రధాన జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులను కలుపుకుంటూ బాహ్య వలయ రహదారి ఏర్పాటు కానున్నదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ రహదారి పూర్తయితే 13 జిల్లాల మధ్య ప్రయాణ భారం తగ్గిపోతుందని, ముఖ్యంగా రాయలసీమ రాజధానికి బాగా దగ్గర అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 200 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ రహదారికి సమాంతరంగా రైల్వే లైన్ కూడా రానుండటంతో దారి పొడవునా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రహదారికి భూ సేకరణ నిమిత్తం ఈ బడ్జెట్ తొలి త్రైమాసికంలోనే రూ. 2500 కోట్లు కేటాయిచాలని అధికారులు ముఖ్యమంత్రిని కోరారు. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా సాగే 393.6 కి.మీటర్ల గ్రీన్‌ఫిల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కానున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించాల్సిన ఈ రహదారి రాష్ట్రంలో ముఖ్యమైన ఇండస్ట్రియల్ కారిడార్ అవుతుందని చెప్పారు. అనంతపురం జిల్లా పరిధిలో 75కి.మీ మేర నిర్మించే నాలుగు వరసల రహదారికి పెగ్ మార్కింగ్, ఫీల్డ్ మెజర్‌మెంట్ తీసుకోవడం పూర్తయిందని అధికారులు చెప్పారు. కర్నూలు జిల్లాలో నిర్మించే 4 లేన్ల రహదారికి సంబంధించి 80.8 కి.మీ మేర ప్రతిపాదిత రహదారిలో అటవీ ప్రాంతం మినహా 67.25 కి. మీటర్ల మేర పెగ్ మార్కింగ్, ఫీల్డు మెజర్‌మెంట్ పూర్తి చేశారు. ప్రకాశం జిల్లాలో నిర్మించే 6 వరుసల రహదారికి 146.5 కి. మీటర్ల పరిధిలో మొత్తం పెగ్ మార్కింగ్ నూరుశాతం, ఫీల్డు మెజర్‌మెంట్ 85 శాతం పూర్తయ్యింది. గుంటూరు జిల్లాలో ఆరు వరుసల రహదారికి సంబంధించి 91.2 కి.మీ మేర పనుల్లో 42 శాతం పెగ్ మార్కింగ్, 24 శాతం ఫీల్డు మెజర్‌మెంట్ పనులు పూర్తి చేశారు. కృష్ణానదిపై నిర్మించబోయే వారధుల కోసం ప్రపంచంలోని అత్యుత్తమ నిర్మాణాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు సూచించారు. ఐకానిక్ వారధులతో కూడిన నగరంగా అమరావతి భాసిల్లాలని ముఖ్యమంత్రి అభిలషించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కనకదుర్గమ్మ, ప్లయ్‌వోవర్ నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. సమావేశంలో పురపాలక మంత్రి పీ నారాయణ, రవాణా, రహదారుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేటా, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ శ్రీ్ధర్ చెరుకూరి, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీపార్థసారథి పాల్గొన్నారు.