ఆంధ్రప్రదేశ్‌

మాతృ భాషను బతికించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (ఆరిలోవ), జనవరి 20: కన్నతల్లి వంటి మాతృభాషను బతికించుకునే బాధ్యత మనందరిపై ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ప్రఖ్యాత కవి, రచయిత మీగడ రామలింగస్వామికి లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవం విశాఖలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకు తెరువు కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని, అయితే మాతృభాష బతికి ఉండాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలు తెలుగులో మాట్లాడేలా చూడాలన్నారు. ప్రపంచంలో అనేక భాషలు మరుగున పడిపోతున్నాయని, 2001 లెక్కల ప్రకారం తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య ఏడు కోట్లు కాగా, ఇప్పుడా సంఖ్య పెరిగిందన్నారు. మాతృభాష కోసం అవిరళ కృషి చేస్తున్న మీగడ రామలింగస్వామి పూర్వ జన్మ సుకృతం వల్ల ఇంతటి గౌరవం దక్కించుకోగలిగారన్నారు. వృత్తి రీత్యా సాధ్యం కాని పరిస్థితులున్నప్పటికీ ఇటీవల కాలంలో తెలుగులో రామాయణ మహాకావ్యాన్ని చదువుతున్నానని సగర్వంగా చెప్పుకొచ్చారు. తెలుగులో చదువుతున్నప్పుడు మనసుకు కలిగిన ఆహ్లాదాన్ని చెప్పనలవి కాదన్నారు. పురస్కార గ్రహీత మీగడ రామలింగ స్వామి మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు వివరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషను విశేష సేవలందించిన మీగడ రామలింగస్వామి అసాధారణ ప్రతిభావంతులని అన్నారు. అవార్డుకింద రూ.లక్షన్నర నగదు, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు, విజ్ఞాన్ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్ ఎల్ రత్తయ్య, ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల అధ్యక్షుడు ముక్కామల అప్పారావు, కెఎల్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, ఫౌండేషన్ కార్యదర్శి ఎన్ బాబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన లక్ష్మణ్, భద్రత అధికారి కృష్ణారావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్‌లను సత్కరించారు.

చిత్రం..మీగడ రామలింగస్వామి దంపతులను సత్కరిస్తున్న దృశ్యం