ఆంధ్రప్రదేశ్‌

మద్దతు వద్దంటున్న ఎంపీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 3: కేంద్రంలో కొనసాగడం వల్ల అవమానాలు కొనసాగడమే తప్ప, నయాపైసా ఉపయోగం లేదని టీడీపీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. అదే వైఖరిని తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎదుట వ్యక్తీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం బాబుతో జరగనున్న ఎంపీల భేటీలో కేంద్రం తీరుపై గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులలో ఏపీకి అన్యాయం జరిగిన వైనంపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీలతో భేటీ అయి వారి మనోగతం తెలుసుకున్న బాబు.. ఆదివారం పార్లమెంటు సభ్యులతో భేటీ కానున్నారు. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాత కార్యాచరణపై ఒక నిర్ణయానికి వద్దామని ఇటీవల జరిగిన సమన్వయ కమిటీ భేటీలో బాబు చెప్పారు. అయితే, వయసు-అనుభవంలో తన కంటే చిన్న అయిన ప్రధాని నరేంద్ర మోదీని.. బాబు తన స్ధాయి కూడా మరచి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక మెట్టు దిగి విధేయత ప్రదర్శించినా కేంద్రప్రభుత్వం కించిత్తు విలువ ఇవ్వడం లేదని ఎంపీలు చాలాకాలం నుంచీ అసహనంతో ఉన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత ఆయన రాజీనామా చేయాలని అప్పట్లో బాబు చేసిన డిమాండ్‌ను మోదీ ఇంకా దృష్టిలో ఉంచుకునే ఇదంతా చేస్తున్నట్లుగా ఉందంటున్నారు. దానిపై మోదీకి బాబు మొదట్లోనే వివరణ ఇచ్చినా ఆయన ధోరణి మారలేదని విశే్లషిస్తున్నారు. తమ మీద ఫిర్యాదులు చేసేందుకు వస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ సులభంగా లభిస్తోందని, అదే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తమ అధినేత చంద్రబాబుకు మాత్రం దాదాపు ఏడాదిన్నర వరకూ అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించినా, సర్దుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం, దేశవ్యాప్తంగా బీజేపీకి వచ్చే ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు తగ్గుతాయన్న సర్వే నివేదికల తర్వాత, మిత్రపక్షాలను వదులుకోకూడదనే ఉద్దేశంతోనే మోదీ, బాబుకు తాజాగా అపాయింట్‌మెంట్ ఇచ్చారే తప్ప, తమపై ప్రేమతో కాదంటున్నారు. అసలు ఢిల్లీలో తమ పార్టీకి ఎలాంటి విలువ లేదని, తమను మిత్రపక్షంగా కూడా గుర్తించేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్న ఆగ్రహం తరచూ వ్యక్తమవుతూనే ఉంది. హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందన్న ప్రజల ఆగ్రహం తమ పార్టీపైనే ఎక్కువ ప్రభావం చూపిందని, అప్పుడు ఏదో ఎదురుదాడి చేసి తప్పించుకున్నామని ఎంపీలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ బడ్జెట్‌లోనూ అన్యాయం జరిగిన తర్వాత జనాగ్రహం మరీ ఎక్కువగా కనిపిస్తుంటే దీనికి ఏమి సమాధానం చెప్పి వారిని సముదాయించాలని ప్రశ్నిస్తున్నారు. తాజా పరిణామాలతో తాము నియోజకవర్గాలకు వెళ్లేందుకు ముఖం చెల్లకుండా చేశారని బీజేపీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ‘మేం రాష్ట్రంలో బీజేపీతో కలసి ఉన్నందున కేంద్ర వైఫల్యాలూ మా పార్టీ ఖాతాలోనే ఎక్కువ పడటం సహజం. వాళ్లకు ఈ రాష్ట్రంలో ఏం బలం ఉంది? మేము కాకపోతే మరొకరితో కలసి పోటీ చేస్తుంది. కానీ మాకు అలా కాదు కదా? మేం నిరంతరం ప్రజల్లో ఉండాల్సిన వాళ్లం. పైగా ఇక్కడ అధికారంలో ఉన్నాం. బడ్జెట్‌లో నిధులు ఇవ్వకపోతే బయటకు ఎందుకు రారన్న ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాం. కేంద్రం ఏమీ ఇవ్వనప్పుడు, రాష్ట్రాన్ని పట్టించుకోనప్పుడు అక్కడ ఉండటం కన్నా బయటకు వచ్చి పోరాడితే, మేం కూడా మద్దతిస్తామంటున్న ప్రజలకు మేమేం జవాబు ఇవ్వాలో అర్థం కావడం లేదు. మిగిలిన వారితో పోలిస్తే మా దగ్గర జనాల్లో రాజకీయ చైతన్యం మరీ ఎక్కువ’ అని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. బడ్జెట్ తర్వాత తమపై ఒత్తిళ్లు మరీ ఎక్కువగా ఉన్నాయని, దీనిపై ఆదివారం జరిగే సమావేశంలో చర్చిస్తామని ఎంపీలు చెబుతున్నారు. ఇప్పటికే టీజీ వెంకటేష్ బడ్జెట్‌లో మొండి చేయిపై బీజేపీని పరుషపదజాలంతో దునుమాడారు. బీజేపీకి అహంకారం పెరిగిందని మండిపడ్డారు. రాయపాటి రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. సీనియర్ నేత బుచ్చయ్యచౌదరి తాజాగా కేంద్రం నుంచి బయటకు వస్తేనే పార్టీకి మనుగడ అన్నారు. బీజేపీ కేవలం తమ పార్టీని భయపెట్టి, మద్దతు కొనసాగించుకోవాలని చూస్తోందని, ఏమీ ఇవ్వని కేంద్రంలో కొనసాగి రాష్ట్రంలో రాజకీయంగా మునిగిపోయే బదులు, బయటకు వచ్చి పోరాడితే ప్రజలు తమ వెంట ఉంటారని, ఇదే విషయాన్ని అధినేతకు స్పష్టం చేస్తామంటున్నారు.