ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ సంస్థల న్యాయపోరాటంతో ప్రజలపై తప్పిన రూ. 4వేల కోట్ల భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన చెల్లింపులపై ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కొనసాగించిన న్యాయపోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రజలపై దాదాపు రూ.4వేల కోట్ల విద్యుత్ ఛార్జీల అదనపు భారం తప్పినట్లయింది. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఆర్‌ఎల్‌ఎన్‌జీ వినియోగంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆగస్టు 8, 2013 ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు ఖరారు చేసింది. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో సహజ వాయువు రీ గ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఆర్‌ఎల్‌ఎన్‌జీ) ప్రత్యామ్నాయం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని ప్రకారం గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలైన జీఎంఆర్ కోరుతున్న దాదాపు రూ.1200 కోట్లు, కోనసీమ, జీవీకే రెండోదశ, జీవీకే గౌతమికి భవిష్యత్తులో చెల్లించవలసిన దాదాపు రూ.2800 కోట్లను చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో విద్యుత్ సంస్థలకు దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు తీర్పు విద్యుత్ వినియోగదారులకు మేలు చేకూర్చినట్లయింది. జీఎంఆర్ వేమగిరి, జీవీకే, గౌతమి, కోనసీమ వంటి ప్రైవేట్ గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మొత్తంగా 1500 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామంటూ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయగా 2003లో డిస్కంలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ నిర్మాణ పనులు 2006-2009లోనే పూర్తయ్యాయి. 2013 దాకా వీటికి కేంద్రం సహజ వాయువును సరఫరా చేసి తరువాత ఆపేసింది. డిస్కంలతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చేసుకున్న ఒప్పందం మేరకు సహజ వాయువుతోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ అందుకు 5రెట్లు ఖరీదైన ఆర్‌ఎల్‌ఎన్‌జీతో ఈ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడానికి విద్యుత్ సంస్థలను సంప్రదించాయి. ఈ భారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా రాబట్టుకోవాలని చూశాయి. దీంతో ఇలాంటి విద్యుత్ కొనుగోలు చేస్తే భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందని, పైగా విద్యుత్ చార్జీలను కూడా పెంచాల్సి వస్తుందని డిస్కంలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. డిస్కంల వాదనలతో ఇంధన, ఐ అండ్ ఐ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్, ట్రాన్స్‌కో జెఎండీ దినేష్ పరుచూరి ఏకీభవించి వీటిని చట్ట ప్రకారం ఏ విధంగా అధిగమించాలనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి ఆ దిశగా చర్యలు చేపట్టారు. సహజ వాయువుకు ఆర్‌ఎల్‌ఎన్‌జీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని, ఏపీ ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ కూడా వాదిస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిలో డిస్కంల తరఫున ఏపీపీసీసీ కేసు దాఖలు చేసింది. సహజ వాయువుకు ఆర్‌ఎల్‌ఎన్‌జీ ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాదని ఏపీఈఆర్‌సి 2013 ఆగస్టు 8వ తేదీన తీర్పు వెల్లడించింది. ఆర్‌ఎల్‌ఎన్‌జీ వినియోగించి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ఏపీఈఆర్‌సీ తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ముఖ్యంగా జీఎమ్మార్ వ్యతిరేకిస్తూ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. అప్పిలేట్ ట్రిబ్యునల్ సహజ వాయువుకు ఆర్‌ఎల్‌ఎన్‌జీ ప్రత్యామ్నాయంగా జూన్ 30, 2014న పేర్కొంటూ, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన నిధులు ఇచ్చేయాలని ఆదేశించింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పుతో విభేదించిన ఏపీ ట్రాన్స్‌కో సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ వాదనలను బలంగా వినిపించి ఎట్టకేలకు విజయం సాధించింది.