ఆంధ్రప్రదేశ్‌

తలసరి ఆదాయం పెరిగేలా ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 17: ఆర్థిక వృద్ధిరేటుకు అనుగుణంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు సూచించారు. శనివారం 2017-18కు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే తయారీపై ప్రణాళిక శాఖ అధికారులతో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు బాగుందని, పరిశ్రమల వృద్ధిరేటు దేశవ్యాప్తంగా మందగించిందని, రాష్ట్రంలో కూడా ఆశించిన స్థాయిలో వృద్ధిరేటు సాధించలేకపోయామని అధికారులు మంత్రికి తెలిపారు. సర్వీస్ సెక్టార్‌లో వృద్ధిరేటు ఆశాజనకంగా ఉందని తెలిపారు. భారీ, మధ్యతరహా పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు. ఈ తరహా పరిశ్రమల వల్ల ఎక్కువ ఉద్యోగ, ఉపాధి కల్పనకు అవకాశాలు ఉన్నాయన్నారు. వీటిపై దృష్టి సారించాలని, తయారీ రంగంలో వృద్ధి పెరగడానికి కావాల్సిన వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సర్వీస్ సెక్టార్ వృద్ధికి టూరిజం, ఐటీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన బాగుందన్నారు. ఆర్గనైజేషన్ పెరిగితే ఐటీ సెక్టార్ వృద్ధి చెందుతుందన్నారు. పట్టణాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పక్కా గృహం కట్టించాలనే ఉద్దేశంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనివల్ల నిర్మాణ రంగానికి చెందిన పరిశ్రమలు అభివృద్ధి చెంది తద్వారా సేవా రంగాల్లో గ్రోత్ రేటు పెరుగుతుందని వివరించారు. గ్రామీణ తలసరి ఆదాయానికి, పట్టణ తలసరి ఆదాయానికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజల తలసరి ఆదాయాన్ని ప్రత్యేకంగా గణించి వారి ఆదాయం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రజల ఆరోగ్యం, సంపద, సౌకర్యాలు పెరిగే విధంగా చర్యలు ఉండాలి. ప్రజలు ఆరోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం భారీ స్థాయిలో ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజలను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోలేకపోతున్నాం. ప్రజల ఆరోగ్య ఖర్చులు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు మెరుగుపడే విధంగా కృషి చేయాలి. మున్సిపల్ స్కూల్స్ అభివృద్ధి చేసినట్లే గ్రామీణ ప్రాంత స్కూల్స్ అభివృద్ధి చేయాలి. వసతి గృహాలను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మారుస్తున్నాం. పిల్లల మెస్ ఛార్జీలను పెంచుతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఉన్న యువతను పారిశ్రామిక రంగంలో ఎలా అభివృద్ధి చెందాలో సామాజిక ఆర్థిక సర్వేలో తెలియజేయాలని’ అధికారులకు మంత్రి యనలమల సూచించారు. సంక్షేమానికి కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో వినియోగించుకుని గ్రామీణ ప్రజల సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శులు సంజయ్ గుప్తా, చలపతిరావు, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, ప్రణాళిక సంచాలకులు సుదర్శన్, ఆర్ధిక గణాంక శాఖ సంచాలకులు యోగేశ్వర శాస్ర్తీ, ప్రభుత్వ సలహాదారులు దక్షిణామూర్తి, తదితరులు పాల్గొన్నారు.