ఆంధ్రప్రదేశ్‌

మాతృభాషలోనే ప్రాథమిక విద్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ప్రాథమిక విద్య దేశమంతటా మాతృభాషలోనే కొనసాగాలని, వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలన్నీ ‘నీట్’ తరహాలో ఆంగ్లంతో పాటు భారతీయ భాషల్లో నిర్వహించాలని, పాలనా వ్యవహారాలన్నీ మాతృభాషలోనే కొనసాగాలని, న్యాయ వ్యవహారాలు, వాదనలు, తీర్పులు సైతం మాతృభాషలోనే ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అభిప్రాయపడింది. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్, జాతీయ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ నేతృత్వంలో మహారాష్ట్ర, నాగపూర్‌లో ఇటీవల మూడురోజులు జరిగిన కీలక సమావేశాలు ఈమేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అరుదుగా జరిగే ఇలాంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశాలకు హాజరైన ఆంధ్ర ప్రాంత సంఘ్‌చాలక్ భూపతిరాజు శ్రీనివాసరాజు ఆంధ్రభూమి ప్రతినిధికి వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల సదస్సుల్లో ఆంగ్లానికి ప్రాధాన్యం తగ్గించి ఆయా స్థానిక భాషలకు ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. ప్రధానంగా ఆంగ్లానికి బదులుగా ప్రతి స్థాయిలో భారతీయ భాషలను ఆదరించడం, వాడుక పెంచడం జరగాలన్నారు. మాతృభాషలోనే దైనందిన వ్యవహారాలన్నీ జరగాలని, ముందుగా స్వయం సేవక్‌లు ఎక్కడికక్కడ మాతృభాషలోనే కుటుంబ సభ్యులు, ఇతరులతో మాట్లాడాలని నిర్ణయించామన్నారు. మాతృభాషలో లభిస్తున్న సాహిత్య అధ్యయనం, సాహిత్య కృషిని ప్రోత్సహిస్తూ స్థానిక కళారీతులు, జానపద కళలు, సంగీతం, సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాల్సి ఉందన్నారు. సమాజాన్ని కలిపి ఉంచేది భాష ఒక్కటేనని, భారతదేశం అఖండతకు భాషే మూలమన్నారు. ఎవరికి వారు మాతృభాషను గౌరవిస్తూనే ఇతర ప్రాంతీయ భాషలను కూడా గౌరవించి నేర్చుకోవాలన్నారు. తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని అన్ని భారతీయ భాషలను, మాండలికాలను, లిపులను, లిపి లేని భాషలను ప్రత్యేక పథకం ద్వారా పోషించాలని కూడా ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని అన్ని భాషలను జ్ఞాన సముపార్జన కోసం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్
దేశవ్యాప్తంగా రోజురోజుకూ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు మాత్రం విస్తరిస్తున్నాయని శ్రీనివాసరాజు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37వేల 248 స్థలాల్లో 58,962 దైనందిక శాఖలు జరుగుతున్నాయని, అలాగే వారానికి ఒకసారి జరిగే శాఖలు 16,405, నెలకోసారి జరిగే శాఖలు 7,973 ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రంలో 1127 దైనందిక శాఖలు, వారానికోసారి జరిగే శాఖలు 399, నెలకోసారి జరిగే శాఖలు 246 ఉన్నాయని తెలిపారు. యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, సమయపాలన కోసం విద్యార్థుల శిబిరాలు నిర్వహిస్తున్నామని కూడా శ్రీనివాసరాజు వివరించారు.

చిత్రం..భూపతిరాజు శ్రీనివాసరాజు