డైలీ సీరియల్

బంగారుకల 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రామలింగనాయకులేదో రాచకార్యం నిర్వర్తించడానికి వచ్చినట్లున్నారే’’ వెటకారంగా ప్రశ్నించాడు.
రామలింగ నాయకుడు అతనికేసి తీక్షణంగా చూశాడు.
‘‘మా సైన్యంలోకి దూరిన నక్కల్ని ఏరిపారేయటానికి’’ విసురుగా జవాబిచ్చాడు.
‘‘నక్కలకీ తెలివి వుంటుంది మిత్రమా!’’ వీరేంద్రుడు వ్యంగ్యంగా అన్నాడు.
‘‘సింహాలముందు ఆ తెలివి పనిచేయదులెండి’’ అంటూ రామలింగ నాయకుడు బయలుదేరాడు.
వీరేంద్రుడు పళ్లు పటపట కొరికాడు.
‘‘సింహమా! ఎవరో అదీ తేలుస్తానురా! నేనిక్కడ అడుగుపెట్టిందే ఈ విజయనగరాన్ని మట్టి చేయటానికి. మీరెంత సైన్యపాలన చేసినా ఈ వీరేంద్రుని తెలివితేటల ముందు చిల్లపెంకులే.
మా అమ్మాయినిచ్చి పెళ్లి చేశామని లోకువయ్యామేమో! అది పెళ్లా? శ్మశానానికి దారి. అన్నపూర్ణ వట్టి పిచ్చి పతివ్రత. భర్తే దైవం, జగన్నాథం అనుకుంటున్నది. ఆమెకెంత చెప్పినా తిమ్మరుసుని తండ్రిలా భావిస్తున్నది. తిమ్మరుసుకు రాజుకు మధ్య దూరం పెంచనిదే, స్పర్థ రేకెత్తించనిదే నా పని సులభం కాదు. మహాభారతంలో శకునే నాకు ఆదర్శం’’ అనుకుంటూ కళ్ళెగరేశాడు క్రూరంగా.
స్వపక్షంలోనే ఉంటూ స్వపక్ష వినాశనం ఎలా చేయాలో నేర్పిన గురువు శకునే కదా!
‘రాయలు పోర్చుగీసువారితో స్నేహం చేసి పరాయి పాలనకు బీజం వేస్తున్నాడు. ముస్లిం రాజుల ఐక్యతకు దోహదపడ్తున్నాడు. ఇవన్నీ నాకే లాభిస్తాయి. నా లక్ష్యం ఒకటే! విజయనగర పతనం. అంతే! దీనికోసం అన్నపూర్ణ ప్రాణం తీయాల్సి వచ్చినా వెనుకాడే ప్రసక్తి లేదు. జగన్నాథ’’
లోపలికి వెళ్తున్న వీరేంద్రుని రహస్యంగా అనుసరిస్తూ పొంచి ఉండి అంతా విన్న చంద్రప్ప కర్తవ్య స్ఫురణతో మెరుపులా తిమ్మరుసు మందిరం వైపు కదిలాడు.

8
కాషాయాంబరాల స్వామి వౌనంగా ధ్యానంలో వున్నాడు. దూరం నించి వేణుగానం విన్పిస్తోంది. స్వామి ఆలాగే వింటూ కూర్చుండిపోయాడు. ఆ గానంలోని ఆర్తి స్వామి మనస్సును ఆకట్టుకున్నది.
కొంతసేపటికి చంద్రప్ప అక్కడికి వచ్చాడు. అతని చేతిలో వేణువు చూశాడు స్వామి. ఇప్పటిదాకా సంగీత తరంగాలలో నిమగ్నమైన వ్యక్తి ఇతనే అని గ్రహించాడు. చంద్రప్ప స్వామికి నమస్కరించాడు.
‘‘ఎవరు నాయనా నీవు? వికల మనస్కుడిగా వున్నావు?’’
‘‘అవును స్వామీ! దారి తోచక అల్లాడుతున్నాను’’ నిట్టూర్చాడు చంద్రప్ప.
‘‘నీ ఆవేదన అర్థమయింది నాయనా! నీవు వలచిన కన్యకూ నీకు వివాహ యోగం లేదు’’ నిట్టూర్చాడు.
‘‘ఎందుకు లేదు స్వామీ, త్వరలోనే మా వివాహం జరుగుతుందనే నమ్మకంతోనే బతుకుతున్నాను’’
‘‘‘అనుకుంటున్నావు, కానీ గండముంది. ఓర్మి వహించు. దేశానికి యుద్ధ సమయం వచ్చింది’’ అని మళ్లీ కళ్లు మూసుకున్నాడు స్వామి.
చంద్రప్ప కలవరపడ్డాడు. శాంతియుతమైన వాతావరణం నెలకొన్నది అనే పరిస్థితిలో యుద్ధమేమిటి? బహ్మనీలు మళ్లీ దండెత్తుతున్నారా ఏమిటి? ఆలోచిస్తూనే మంజరి మందిరం కేసి నడిచాడు.
***
నిండు పున్నమి వేళ. సుధాకరుడు అమృత కిరణాలతో ప్రకృతిని తన్మయమొనర్చుతున్నాడు. చలిగాలి మెత్తని సూదుల్లా తాకుతున్నది. అలసిపోయిన రాయల సైన్యం కూడా ప్రశాంతంగా సేద తీరి నిద్రపోతున్నది. అద్భుత కళాసౌధంలో కృష్ణరాయప్రభువు ప్రకాశిస్తున్నారు. ఎదుట ఆసీనులైన అప్పాజీ కేసి ప్రసన్నంగా చూస్తూ చిరునవ్వులు చిందించారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన వైఖరి చూస్తే ఆ రోజేదో ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకోదల్చినట్లే కన్పిస్తున్నది.
చిన్నతనం నుంచి రాయల మనసెరిగిన మహామాత్యులు రాయలకేసి ప్రేమతో చూస్తూ వింటున్నారు.
రాయలు మేఘగంభీర స్వరంతో ఇలా అన్నారు. ‘‘అప్పాజీ! మీరు గమనిస్తున్నారు గదా! నా ధైర్య సాహసాలు మీ బుద్ధిబలంతోనే ఈ విజయనగర మహాసామ్రాజ్యం ఈ విధంగా కుదురుకుంది. ఈ రెండు కలబోసుకున్న సాహసప్రజ్ఞావంతుడయిన ఆ యువకుడు పదే పదే మా స్మృతిపథంలో మెదులుతున్నాడు. అతని ధైర్యసాహసాలవల్లనే మనం ఉదయగిరి దుర్గంపై విజయం సాధించగలిగాం’’.
అప్పాజీకి రాయల మాటలు చెవిలో అమృతము నింపినట్లున్నాయి. ఆ యువకుని పట్ల అప్పాజీకి కూడా అంతటి మెప్పుదల భావం కలిగింది.
‘‘రాయా! మీరన్నది ముమ్మాటికీ నిజం. నా మనస్సుకు కూడా తోచని అనేక విషయాలలో అతడు నిష్ణాతుడనటంలో సందేహం లేదు. శత్రు వ్యూహాలకు సరియైన ప్రతి వ్యూహాలు పన్నగల దక్షుడతను. అతనికి....’’
‘‘అతనికి గొప్ప బహుమానమివ్వాలి’’ మంత్రిగారి మాట పూర్తికాక ముందే రాయలు వాక్యాన్ని పూర్తిచేశారు.
‘‘నా అభిప్రాయమూ అదే! మీరూ అలాగే అనుకుంటున్నారంటే అంతకంటే ఉత్తమం ఏముంటుంది? ప్రభువిచ్చే బహుమానం గొప్పగా ఉండాలి’’ తిమ్మరుసు సాభిప్రాయంగా అన్నారు.
‘‘గొప్పది అంటే?’’ రెట్టించారు రాయలు.
‘‘మీ మనసులో ఉన్నదే’’ చిరునవ్వుతో అన్నారు తిమ్మరుసు.
‘‘అది గొప్పదవుతుందా! అందరూ ఆలోచించే పద్ధతే కదా!’’
‘‘కాదు ప్రభూ! రాజాధిరాజ రాజ పరమేశ శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల పుత్రికారత్నం తిరుమలాంబికను బహుమానంగా పొందటమంటే సామాన్యుల కలివిగాని పని’’.
రాయలు మందహాసం చేశాడు. ఆలోచన అంతర్ముఖం అయింది.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి