బాల భూమి
తగిన వరుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అవంతీ రాజ్యాన్ని చంద్రసేనుడు పాలించేవాడు. అతని భార్య అన్నపూర్ణాదేవి. వారికి లేకలేక పుట్టిన సంతానమే వైష్ణవి. రాకుమారి చక్కని చుక్క. రాజదంపతులు తమ కూతుర్ని ఎంతో గారాబంగా పెంచారు. వైష్ణవికి యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు మంచి యోగ్యుడైన వరుడితో వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రుల ఆలోచన. అయితే రాకుమారి వివాహ విషయంలో రాజదంపతులు ఏకీభవించలేక పోయారు. రాకుమారిని తన చెల్లెలు కొడుకైన విజయుడికిచ్చి చేయాలని మహారాజు.. కాదు తన అన్న కొడుకు భాస్కరుడికివ్వాలని మహారాణి పంతం పట్టారు. ఇదంతా గమనిస్తూనే వున్న రాజ పురోహితుడు వల్లభాచార్యునికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే వల్లభాచార్యుడు రాజదంపతులను కలుసుకుని రాజకుమారి జాతకాన్ని పరిశీలించాను. కానీ ఆమె వివాహ విషయంలో.. అని ఆగాడు. అప్పుడు మహారాజు ఆశ్చర్యంగా, ఆత్రంగా ‘ఏమిటి వల్లభాచార్యా! ఎందుకు సందేహిస్తున్నారు? రాకుమారి జాతకాన్ని మాకు చెప్పండి’ అని అడిగాడు.
వల్లభాచార్యుడు సందేహిస్తూనే విషయాన్ని వివరించాడు.
‘రాకుమారికి వివాహ గండం ఉంది. ఆమెను పెళ్లాడిన వరుడు మూడు మాసాలలో మరణించడం ఖాయం. దీనికి తిరుగు లేదు. అయితే ఇందుకు ఒకే ఒక మార్గం ఉంది. ముందుగా ఎవరైనా రాకుమారిని వివాహం చేసుకుంటే, అతను మూడు మాసాలలో చనిపోతాడు. అప్పుడు రాకుమారి మరొకర్ని పెళ్లి చేసుకొని హాయిగా ఉండొచ్చు’ అని చెప్పాడు వల్లభాచార్యుడు.
వెంటనే మహారాజు కబురు పంపి విజయుడ్ని, భాస్కరుడ్ని పిలిపించి, పురోహితుడు చెప్పిన విషయాన్ని వివరించాడు. అది విని భాస్కరుడు, ‘అలాగైతే వెంటనే ఎవరైనా యువకుడితో గుట్టుగా రాకుమారికి పెళ్లి జరిపించి, ఆ తర్వాత నాకిచ్చి చేయండి’ అన్నాడు. అయితే విజయుడు మాత్రం రాకుమారి వివాహ గండానికి విచారపడుతూ, ‘మహారాజా! నేను రాకుమారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ముందుగా నేనే ఆమెను వివాహం చేసుకుంటాను. నాకేమైనా ఫర్వాలేదు. రాకుమారి ఎప్పుడూ సుఖంగా వుండాలన్నదే నా కోరిక’ అన్నాడు వినమ్రంగా. వెంటనే విజయుడితో వైష్ణవికి వివాహం జరిపించారు రాజ దంపతులు.
మూడు మాసాలు గడిచాయి. అయినా విజయుడు క్షేమంగానే ఉన్నాడు. ఇదంతా అయోమయంగా తోచిన భాస్కరుడు పురోహితుడిని నిందించాడు.
‘చూడండి మహారాజా! ఈ పురోహితుడు చెప్పిన జాతకం తారుమారైంది. ఇతను చెప్పింది నిజం కాలేదు. విజయుడు మూడు మాసాలైనా బతికే వున్నాడు.’ అంటూ భాస్కరుడు మహారాజుతో మొరపెట్టుకున్నాడు. మహారాజు ప్రశ్నార్థకంగా వల్లభాచార్యునికేసి చూశాడు. అది గమనించిన వల్లభాచార్యుడు చిన్నగా నవ్వి ఇలా అన్నాడు.
‘ప్రభూ! నన్ను క్షమించాలి. మీరూ, మహారాణి రాకుమారి వివాహ విషయంలో వాదించుకుంటుంటే నేను విన్నాను. విజయుడు, భాస్కరుడులలో ఎవరు రాకుమారికి తగిన వాడో తెలుసుకోవడానికే నేను రాకుమారికి వివాహ గండం ఉందని నాటకం ఆడాను. అందులో రాకుమారి కొరకు తన ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడిన విజయుడే నెగ్గాడు. విజయుడు తన త్యాగంతో రాకుమారిపై అతనికి గల ప్రేమను నిరూపించుకున్నాడు. విజయుడికి ఏ హానీ జరగలేదు. రాకుమారి వివాహ విషయంలో చొరవ తీసుకున్నందుకు మన్నించండి మహారాజా’ అంటూ తన నాటకాన్ని వివరించాడు వల్లభాచార్యుడు. అది విని భాస్కరుడు సిగ్గుతో తలదించుకున్నాడు.
మహారాజు వల్లభాచార్యుని వైపు మెచ్చుకోలుగా చూస్తూ ‘శభాష్ వల్లభాచార్యా! మీరు ఎంతో మంచి పని చేశారు. మాక్కూడా అంతుచిక్కని రాకుమారి వివాహ సమస్యని పరిష్కరించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా అమ్మాయిని ప్రాణంగా చూసుకొనే విజయుడిని మాకు అల్లుడిగా చేసినందుకు కృతజ్ఞుడ్ని’ అంటూ రాజ పురోహితుడు వల్లభాచార్యుణ్ని ఘనంగా సత్కరించాడు.