బాల భూమి

గొప్పదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లేశ్వర పురంలో అరవై ఏళ్ల వయసున్న మల్లవ్వ మారు బేరానికి ఏక కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తెచ్చుకుని, అమ్ముకుంటూ జీవించేది. తన పెట్టుబడి వచ్చాక తనకు ఆ రోజుకు తిండికి సరిపోయే సొమ్ము కూడాక, మిగతా పండ్లను అమ్మేది కాదు.
ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి అక్కడ వైద్యం కోసం వచ్చి చేరి ఉన్న నిరుపేద రోగులకు ఆ పండ్లను ఉచితంగా ఇచ్చేది. మల్లవ్వ ప్రేమగా పలకరిస్తూ ‘ఎలా ఉన్నావ్ బాబూ? నిన్నటికంటే ఆరోగ్యంగా కనిపిస్తున్నావమ్మా! ఈ రోజు నీ ముఖం ప్రశాంతంగా ఉంది పాపా! వచ్చే వారానికి నీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరి ఇంటికెళ్తావులే మనవడా!’ అంటూ అందరినీ పలకరిస్తూ తన దగ్గరున్న పండ్లను ఒక్కోటీ అందరికీ పంచి వెళ్లేది. ప్రతి రోగీ రోజూ మల్లవ్వ కోసం కాచుకు నుండేవారు. ఆమె ఇచ్చే పండు కంటే ఆమె పలకరింపు వారికి సంతోషాన్ని కలిగించేది.
ప్రతి ఆదివారం ఆ ఊర్లో ఉండే ఒక ధనిక మహిళ ఆ వైద్యశాలకు వచ్చి దూరంగా నిల్చుని తాను తెచ్చిన స్వీట్లూ, పండ్లు, రొట్టెలు ఉన్న బుట్టల వద్ద ఫొటో తీయించుకుని, తన డ్రైవర్ చేత రోగులందరికీ అవి పంచి పెట్టించేది. అతడు ఆమె చెప్పినట్లే వాటిని ఒక్కోరి ఒళ్లో విసిరేసేవాడు. ఒక ఆదివారం ఆమె వచ్చినపుడే మల్లవ్వ కూడా వచ్చింది.
ఆ రోజున దీపావళి పండుగ అవటాన అవ్వ పండ్లతోపాటుగా ఒక్కోరికీ మతాబాలు కూడా పట్టుకొచ్చింది. సాయంకాలం బదులుగా ఉదయం వచ్చింది మల్లవ్వ. మల్లవ్వను చూడగానే అంతా ఆనందంగా ‘మల్లవ్వొచ్చింది మల్లవ్వొచ్చింది’ అంటూ అరవసాగారు.
మల్లవ్వ అందరినీ పలకరిస్తూ నవ్వుతూ చిన్న పిల్లలు, ముసలివారూ ఉంటే వారి వీపు తట్టి మాట్లాడుతూ తన బుట్టలో ఉన్న పండ్లు, మతాబాలు పంచింది. అంతా మల్లవ్వను చూసి నవ్వుతూ ఆమె ఇచ్చే పండు తీసుకుని కొందరు అవ్వ చేయి పట్టుకుని ప్రేమగా నొక్కుతూ, చిన్న పిల్లలు మల్లవ్వను ఆలింగనం చేసుకుంటూ, మతాబాల వైపు సంతోషంగా చూస్తూ మాట్లాడటం ఆ ధనిక వనితకు ఆశ్చర్యం, అసూయ కూడా కలిగించాయి. ఆ ధనిక స్ర్తి ఇచ్చిన స్వీట్ పాకెట్స్ పక్కన పెట్టి మల్లవ్వ ఇచ్చిన చిన్న సపోటా పండు తినడం ఆ మహిళకు అసలు నచ్చలేదు. ఎంతో ఖరీదైన స్వీట్స్ ఆ రోజు తన పుట్టిన రోజని తెచ్చిస్తే ఆ పాకెట్ పక్కన పెట్టేసి, ఆ అవ్వ ఇచ్చిన అంత చిన్న పండు తినడం, అవ్వను పొగడటం ఆమెకు అసలు నచ్చలేదు.
ఆమెతోపాటుగా వచ్చిన ఆ వైద్యశాల డాక్టర్‌ను చూస్తూ అడిగింది ఆమె. ‘అమ్మా! నేను ఇంత ఖరీదైన స్వీట్స్ ఇస్తే అవి పక్కన పెట్టేసి ఆ పేదరాలు ఇచ్చిన ముష్టి సపోటా పండ్లు తినడమేంటీ! నాకు థాంక్స్ అన్నా చెప్పకుండా ఆ అవ్వతో సంతోషంగా మాట్లాడటం ఏంటీ? దిక్కులేని వారికి అలాంటి వారితోనే స్నేహమా! నేను అనవసరంగా డబ్బు వృథా చేస్తున్నానా?’ అంది.
ఆ డాక్టర్ ‘వృథా ఏముందమ్మా! నీవు ఫొటోలు దిగి పేపర్లలో వేయించుకుంటున్నావుగా! అసలు వారితో ఏనాడైనా మాట్లాడావా? వారికున్న జబ్బేంటో అడిగావా? నీవిచ్చే స్వీట్లు వారు తినవచ్చో లేదో తెలుసుకున్నావా? నిర్లక్ష్యంతో ఇస్తున్నావ్? నీ గొప్ప చాటుకోను ఇస్తున్నావ్. ఆ అవ్వ మంచి మనసుతో వారికి అవసరమైనది ఇస్తున్నది. అంతేకాదు, నోరారా వారితో మాట్లాడి ధైర్యం చెప్తున్నది. అందుకే ఆ అవ్వంటే వారికి ఇష్టం. ఆమె రాకే వారిలో ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ముందుగా రోగులకు ధైర్యం కలిగించాలి, స్వాంతన వచనాలు చెప్పాలి. ఆమె పంచే పండ్ల కంటే ఆమె పంచే ప్రేమ కోసం వారు ఎదురుచూస్తున్నారు. అందుకే ఆ అవ్వంటే వారికి ఇష్టం’ అంది. ఆ మాటల్లో నిజం తెల్సుకున్న ఆధునిక స్ర్తి మాట్లాడకుండా తలవంచుకుని వెళ్లింది.

-ఆదూరి హైమావతి