భగత్‌సింగ్

సైమన్ గో బ్యాక్ (భగత్‌సింగ్ - 18)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక తప్పును ఇంకో తప్పు సరిచేసింది.
గాంధీగారి చలవవల్ల చౌరీచౌరాలో చతికిలపడిన జాతీయోద్యమం ఐదేళ్ల తరవాత తెల్లదొరల తొందర మూలంగా పుంజుకుని మళ్లీ దారిన పడింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయుల భూరి సహాయానికి తప్పని బహుమానంగా ముష్టి విదిల్చినట్టు బ్రిటిషు ప్రభుత్వం మాంటేగు చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను ప్రకటించింది. వాటికి సంబంధించిన 1919 చట్టంలో ఒక అంశం ఏమిటంటే - ఆ సంస్కరణల మోతాదు సరిపోతుందా, తగ్గించాలా, ఇంకా పెంచాలా, హిందూ దేశంలో బాధ్యతాయుత పాలనకు ఇంకా ఏమేమి చెయ్యతగును అన్నవి పరిశీలించడానికి పదేళ్ల తరవాత ఒక కమిషన్ వేయబడునని! అవే ముష్టి సంస్కరణలు కాబట్టి వాటిపై పదేళ్లకు జరిగే పునర్విచారణ సంగతి దేశంలో ఎవరూ పట్టించుకోలేదు.
సీమ సాములకు ఆ విషయం గుర్తుంది. చట్టంలో పొందుపరిచిన ప్రకారం పదేళ్ల గడువు 1929లో తీరుతుంది. సరిగా ఆ సంవత్సరమే ఇప్పుడున్న బ్రిటిషు కామన్స్ సభ ఆయువు తీరుతుంది. కొత్తగా ఎన్నికల తరవాత లేబర్ పార్టీ పవర్లోకి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆ పార్టీకి భారతీయుల స్వాతంత్య్ర కాంక్ష అంటే కొంచెం సానుభూతి. లేబర్ గవర్నమెంటుకు అవకాశం చిక్కితే ఎడాపెడా సంస్కరణల వరాలు ఇచ్చెయ్యగలదు. వాటివల్ల బ్రిటిషు వారి ఆర్థిక, ఇతరేతర ప్రయోజనాలకు ఇబ్బంది రావచ్చు. లేబరోళ్లకు ఆ సందు ఎందుకివ్వాలి? కొత్త కమిషన్ మొక్కుబడి ఏదో మన చేతిలో పవరుండగానే కానిచ్చి, కంటితుడుపు సంస్కరణలేవో మనమే లాగిస్తే పోదా - అనుకున్నారు నాటి ప్రభువులు. తలచిందే తడవుగా బ్రిటిషు మంత్రి మండలిని కొలువుదీర్చారు. సర్ జాన్ సైమన్ అధ్యక్షతన భారత సంస్కరణలపై కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి 1927 నవంబర్ 8న ప్రకటించేశాడు.
తమరు తెచ్చిన సంస్కరణలు ఎందుకూ కొరగావు. అవసరాలకు తగ్గట్టు వాటిని వెంటనే సమీక్షించవలసింది అంటూ భారత రాజకీయ పార్టీల ప్రముఖులు గతంలో ఎన్నిసార్లు అడిగినా - పదేళ్ల గడువు ముగిసేదాకా పునః సమీక్ష ససేమిరా కుదరదని ఆంగ్లేయులు చట్టాలు వల్లించారు. తమ దిక్కుమాలిన ప్రయోజనాలకు అవసరమయ్యేసరికి మళ్లీ వారే నియమాన్ని తీసి గట్టున పెట్టి, ఎవరూ అడక్కుండానే హుటాహుటిన నడమంత్రపు కమిషనును పుట్టించారు. అదీ - ఎవరికీ నచ్చని విధంగా.
చక్కగా నడుస్తున్న సహాయ నిరాకరణోద్యమాన్ని చౌరీచౌరాలో హింస వంకతో గాంధీ మహాత్ముడు చేతులారా చంపేసిన తరవాత దేశం కల్లోలితమైంది. మత హింస పేట్రేగింది. అల్లర్లలో వేల ప్రాణాలు పోయాయి. కార్మికులు విస్తృతంగా సమ్మెలు కట్టడంతో పారిశ్రామిక రంగం అశాంతి మయమైంది. ఇంకో చెంప, విప్లవకారుల కార్యక్రమాలు విజృంభించాయి. బ్రిటిషు వారికి తొత్తులుగా ఊడిగం చేయటానికి ఒకప్పుడు అలవాటుపడ్డ జాతీయ కాంగ్రెసులోనూ ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అని ఎలుగెత్తి చాటిన లోకమాన్య తిలక్ వంటి మహనీయుల ప్రభావంవల్ల స్వరాజ్య కాంక్ష ప్రబలింది. గాంధీతో విభేదించి మోతీలాల్ నెహ్రు, చిత్తరంజన్‌దాస్ ప్రభృతులు స్థాపించిన స్వరాజ్ పార్టీ స్వాతంత్య్ర లక్ష్య సాధనకు నడుము కట్టింది. అధినివేశ ప్రతిపత్తి (డొమీనియన్ స్టేటసు) ప్రసాదిస్తే చాలు బ్రిటిషు సార్వభౌమత్వానికి లోబడి ఆంగ్ల సామ్రాజ్యంలో భాగంగా కొనసాగడానికి గాంధీగారు ఎంత అంగలారుస్తుంటేనేమి? 1927 ఆఖరున మద్రాసు కాంగ్రెసులో ఆయన బలవంతంగా కాంగ్రెసు వాదుల మెడలు వంచి ఆ మేరకు తీర్మానం చేయిస్తేనేమి? కాంగ్రెసు సంస్థలో వామపక్ష, లిబరల్ భావాలుగల యువతరం సంపూర్ణ స్వాతంత్య్రానికి ఉరకలేస్తున్నది. ఇలాంటి ఉద్విగ్న రాజకీయ స్థితిగతుల్లో భారత జాతి భావి రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉండాలి అన్నది సవ్యంగా తేల్చాలంటే సంబంధిత అన్ని వర్గాలన్నిటితో రౌండ్ టేబిల్ సమావేశం ఏర్పాటు చేయాలి. లేదా రాజ్యాంగ నిర్మాణ సభను ఎన్నికల ద్వారా నెలకొల్పాలి. భారతీయులలో సెగలు కక్కుతున్న స్వరాజ్య కాంక్షకు వాస్తవ రూపం ఇచ్చే పనిలో ముఖ్యంగా భారతీయులను నిమగ్నులను చేయాలి. బ్రిటిషు సర్కారు వీటిలో ఏ ఒక్కటీ చేయలేదు. భారతీయులకు స్వాతంత్య్రం ఆపేక్షించే అర్హత అసలు ఉందా, ఉంటే ఏ మేరకు దాన్ని అనుగ్రహించాలి అన్నది తేల్చడానికి ఎవరూ కోరని, ఎందుకూ కొరగాని కమిషన్‌ను వేసింది. పైగా దాన్ని కూడా పూర్తిగా తెల్లవాళ్ల తోటే నింపింది. అధ్యక్షుడు సర్ సైమన్ సహా కమిషన్‌లో కూర్చిన ఏడుగురూ బ్రిటిష్ ఎం.పీ.లే. అందరూ ఆంగ్లేయులే.
ఇది దేశవాసులందరికీ సహజంగానే ఒళ్లు మండించింది. భారతదేశ భావి రాజ్యాంగం ఎలా ఉండాలో భారతీయులు గదా తేల్చుకోవలసింది? ఈ దేశంలో ఉన్న వారందరూ శుంఠలు; ఏడుగురు తెల్లతోలు వాళ్లు మాత్రమే ఈ దేశానికి ఏమి అవసరమో తేల్చగలిగిన వాళ్లు; భారతీయులు చేయగలిగిందల్లా ఆ దొరలకు మహజర్లు పెట్టటం; వారు పెడచెవిన పెడితే మళ్లీ మళ్లీ వేడుకుంటూ దేబిరించడమూనా? ఇది సహించరాని కండకావరం. దీనిని ప్రతిఘటించటం ఆత్మగౌరవంగల ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం - అన్న భావావేశం దేశమంతటా అలుముకుంది. ఈ కమిషన్ ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు కనుక దానిని గుర్తించేదే లేదంటూ లాలా లజపత్‌రాయ్ కేంద్ర చట్ట సభలో 1928 ఫిబ్రవరి 16న ప్రతిపాదించిన తీర్మానాన్ని ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులందరూ ‘వందేమాతరం’ నినాదాల నడుమ ఏకగ్రీవంగా ఆమోదించారు.
సైమన్ కమిషనుకు వ్యతిరేకంగా దేశమంతటా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహ తీవ్రతకు గాంధీ మహాత్ముడు సైతం తల ఒగ్గాడు. 1929 డిసెంబర్ 31 దాకా ఏమీ చేయకుండా చేతులు ముడుచుకు కూచుని బ్రిటిషు సర్కారుకు సహకరిస్తూ పోతే చాలు బ్రిటిషు సామ్రాజ్యంలో భాగంగా పరిమిత స్వరాజ్యం దానికదే ఉరుక్కుంటూ వస్తుందని ఆయన చెబుతున్న కబుర్లు, కంటున్న కలలు సైమన్ కమిషన్ దెబ్బకు పటాపంచలయ్యాయి. ఎదురు నిలవలేనప్పుడు ప్రజాభిప్రాయం వెంబడి పోవటమే మేలనుకున్నారో ఏమో మహాత్ముడు ఎక్కడలేని తెగువతో సైమన్‌ను ఒక సైతాన్‌లా పరిగణించి, దానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమించాడు.
కమిషన్ సభ్యులు భారతదేశంలో అడుగుపెట్టిన రోజునే దేశమంతటా పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరగాలి. కమిషన్ పర్యటించే ప్రతి ఊళ్లోనూ ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తాలి. కమిషన్ మెంబర్లను సాంఘికంగా బహిష్కరిచాలి... అంటూ సాక్షాత్తూ గాంధీజీయే దిశానిర్దేశం చేయటంతో కొనే్నళ్లుగా డీలాపడ్డ కాంగ్రెసు సంస్థలో గొప్ప కదలిక వచ్చింది. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి అన్ని పార్టీలూ, అన్ని రాజకీయ గ్రూపులూ, విప్లవ సంస్థలూ కాంగ్రెసుకు బాసటగా నిలవటంవల్ల దేశంలో గొప్ప రాజకీయ చైతన్యం ఉరకలేసింది. చౌరీచౌరా సాకుతో చచ్చు పడటానికి ముందు సహాయ నిరాకరణోద్యమం నాటి పోరాట పటిమ మళ్లీ పొటమరించింది.
సైమన్, అతడి సహచరులు ఓడ దిగి 1928 ఫిబ్రవరి 3న ముంబయిలో అడుగుపెట్టిన రోజు దేశవ్యాప్తంగా పూర్తి హర్తాళ్ జరిగింది. ముఖ్యమైన పట్టణాలు, నగరాలు అన్నిటిలో ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలు మారుమోగాయి. ఎక్కడ చూసినా నల్లజండాలు రెపరెపలాడాయి. ఊరేగింపులు, బహిరంగ సభలకు లెక్కలేదు. అన్నిటికంటే పెద్ద ప్రదర్శన లక్ష మందితో ముంబయి చౌపట్టి బీచ్‌లో జరిగింది. అన్ని పార్టీల నాయకులూ ఒక్క వేదిక మీద నిలిచి బ్రిటీష్ దుర్నీతిని ఖండఖండాలుగా తెగనాడారు.
అది మొదలుకుని సైమన్ కమిషన్ దేశంలో నడయాడినంత కాలమూ ఎక్కడికి వెళ్లినా, ఎటుచూసినా ప్రచండ ప్రజా వ్యతిరేకతను చవి చూసింది. మద్రాసులో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశంలాగే లాహోర్‌లో పంజాబ్ కేసరి లాలా లాజపత్‌రాయ్ నిషేధాజ్ఞలను ధిక్కరించి, తెల్లవారి సాయుధ బలగాలకు ఎదురొడ్డి ధైర్యంగా నిలబడ్డాడు.
జరగరాని ఘోరం జరిగింది.
ఆ రోజు 1928 అక్టోబర్ 30. మరి కాసేపట్లో సైమన్ కమిషన్ వారు రైల్లో లాహోర్‌కు రాబోతున్నారు. పరిస్థితి మహా ఉద్రిక్తంగా ఉంది. అంతకు ముందు మద్రాసు, కలకత్తా నగరాల్లో ప్రదర్శకులపై జరిగిన దౌర్జన్యాలకు, పోలీసు కాల్పులకు లాహోర్‌వాసులు భగభగ మండిపోతున్నారు. కిందటి రోజు సాయంత్రం మున్సిపల్ గార్డెన్‌లో జరిగిన బహిరంగ సభలో నిర్ణయించిన ప్రకారం ప్రజలు పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషను ముందు గుమికూడారు. లాలాజీకి ఆరోగ్యం బాగాలేదు. అయినా కార్యకర్తల కోరిక కాదనలేక ఓపిక చేసుకుని వచ్చాడు. భగత్‌సింగ్ ఆయన వెంట ఉన్నాడు.
లాలా లాజపత్‌రాయ్‌కి భగత్ కుటుంబం చాలాకాలంగా తెలుసు. భగత్ తండ్రి కిషన్ సింగ్, బాబాయి అజిత్ సింగ్‌లు లాలాజీతో కలిసి 1907లో పంజాబ్ కెనాల్ సెటిల్మంటు బిల్లుకు వ్యతిరేకంగా పోరాడారు. దాని కారణంగా లాలాజీ, అజిత్ సింగ్, మాండలే చెరసాల పాలయ్యారు. లాలాజీతోపాటు భగత్ తండ్రి ఆర్య సమాజ్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నాడు. కరవు, భూకంప బాధితులకు సహాయ చర్యల్లాంటివి అనేకం చేపట్టాడు. లాలాజీ పెట్టిన నేషనల్ కాలేజిలో భగత్ చదివాడు.
ఇలా మొదటి నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో భగత్‌సింగ్‌కి లాలాజీ తీరు నచ్చలేదు. ఒకప్పుడు గదర్ విప్లవకారులకు పెద్ద అండగా ఉండినవాడు ముస్లిం మతోన్మాదాన్ని ఎదుర్కోవటానికి ‘శుద్ధి’, ‘సంఘటన’ ఉద్యమాలను తలకెత్తుకుని పక్కా మతవాదిగా మారాడన్న అసంతృప్తి భగత్‌కి చాలా ఉంది. కులాలకు, మతాలకు అతీతంగా సామ్యవాద సాధనకు సమష్టి పోరాటం సాగాలన్న భగత్ తత్వానికి లాలాజీ పోకడ సరిపడలేదు. ‘దారి తప్పిన నాయకుడు’ అంటూ కవితాత్మక కరపత్రాన్ని లాలాజీకి వ్యతిరేకంగా రచించి ఆయన పాల్గొన్న సభలోనే భగత్ పంచి పెట్టించాడు కూడా.
ఇవన్నీ చిన్న విషయాలు. భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా లాజపత్‌రాయ్ పంజాబ్‌లో తిరుగులేని ప్రజా నాయకుడు. ఆయన పంజాబ్‌కి ప్రతిరూపంగా పేరెన్నికగన్న విశిష్ట వ్యక్తి. బ్రిటిషు సర్కారు విసిరిన సవాలును తిప్పికొట్టి, సైమన్ కమిషన్‌కి వ్యతిరేకంగా ఐక్య ప్రజా పోరాటాన్ని నడిపించటానికి ఆయనే సరైన మనిషి. మిగతా పేచీలను పక్కకు నెట్టి ఆయనకు బాసటగా పని చేయటం దేశభక్తులందరి కర్తవ్యం.
- అని భగత్ సింగ్ తలచాడు. అందుబాటులో ఉన్న నౌజవాన్ భారత్ సభ సహచరులందరినీ కూడగట్టి నిరసన కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నాడు. ప్రదర్శనలో పాల్గొనబోయే ప్రతి ఒక్కరి ముంజేతికీ భగత్ బృందం నిరసన సూచకంగా నల్లపట్టీ కట్టించింది. ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలను ఊరంతా రాయించింది.
బ్రిటిషు ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేదు. క్రూరంగా పేట్రేగింది. పోలీసు సాయుధ బలగాలను భారీగా మోహరించింది. ఎక్కడా ఎవరూ గుమికూడటానికి వీల్లేదని, ఊరేగింపులు, ప్రదర్శనలు జరపరాదని కర్కశంగా నిషేధాజ్ఞలు విధించింది. ఎట్టి పరిస్థితిలోనూ నిరసన ప్రదర్శన జరగటానికి వీల్లేదని, కమిషన్ దొరలకు ఇంచుక అసౌకర్యాన్ని కూడా సహించరాదని అధికార గణానికి కరకు ఆదేశాలు జారీ చేసింది. అడుగడుగునా బారులు తీరిన పోలీసులు. వారి చేతిలో తుపాకులు. భయానక యుద్ధ వాతావరణం. అందరి మొగాల్లో ఆందోళన. ఏ క్షణాన ఏమవుతుందోనన్న వ్యాకులత.
మధ్యాహ్నం ఒంటి గంటకు లాలా లాజపత్‌రాయ్ నిషేధాజ్ఞలను ధిక్కరించి, 5 వేల మంది ప్రదర్శకులు వెంటరాగా ఊరేగింపుగా రైల్వేస్టేషనుకు చేరుకున్నాడు. భగత్‌సింగ్, అతడి విప్లవ సహచరులు కాక సర్ మంగళ్‌సింగ్, దునిచంద్, దుర్గాదాస్

ఖన్నా, హన్స్‌రాజ్, బోధ్‌రాజ్, అబ్దుల్ కాదిర్ కసూరి, మొహమ్మద్ ఆలం తదితర పంజాబ్ ప్రముఖ నాయకులు ఆయన వెంట ఉన్నారు.
ఊరేగింపును చూడగానే బందోబస్తును పర్యవేక్షిస్తున్న సీనియర్ పోలీసు సూపర్నెంటు జె.వి.స్కాట్ మండిపడ్డాడు. బారికేడ్లను దాటి రావద్దని, ఎక్కడివారక్కడ చెదిరిపోవాలని రంకెలేశాడు. జనం పట్టించుకోలేదు. ముందుకే సాగారు.
అంతలో రైలొచ్చింది. కమిషన్ దొరలు దిగారు. కాని స్టేషను దాటి బయట అడుగుపెట్టలేక పోయారు. ఎటు చూసినా జనం. జనం. ‘సైమన్ గో బ్యాక్’, ‘అంగ్రేజ్ ముర్దాబాద్’ ‘ఇంక్వలాబ్ జిందాబాద్’ అంటూ మిన్నంటిన నినాదాలు.
హిందుస్తానీ హైఁ హమ్ హిందుస్తాన్ హమారా
ముడ్ జావ్ సైమన్ జహాఁ హై దేశ్ తుమ్హారా
(మేం హిందుస్తానీలం. హిందుస్తాన్ మాది. వెనక్కి తిరుగు సైమన్. నీ దేశానికీ పో.) అంటూ ప్రదర్శకులు గొంతెత్తి పాడుతున్నారు.
వచ్చిన దొరలు బిత్తరపోయారు. వారికి దారి ఇవ్వటానికి పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. తుపాకులు చూపి, లాఠీలు ఎత్తి గుంపును బెదిరించారు. వెనక్కి నెట్టజూశారు. కాని జనం ఆగలేదు. ఇంకా ఇంకా ముందుకు చొచ్చుకెళ్లారు. మమ్మల్ని చూడటం ఇష్టం లేకపోతే కమిషన్ వారి కళ్లకు గంతలు కట్టి తీసుకుపొండని లాలాజీ గర్జించాడు.
సూపర్నెంట్ స్కాట్ ఉద్రేకంతో ఊగిపోయాడు. ‘్ఛర్జ్’ అని అరిచాడు. పోలీసులు విజృంభించారు. లాఠీలతో ఆందోళనకారులను చితకబాదసాగారు. ఎందరి తలలో పగిలాయి. ఎముకలు విరిగాయి. దెబ్బలకు తాళలేక జనం పరుగులు పెట్టసాగారు. లాజపత్‌రాయ్ వారిని వారించాడు. ‘మనం సత్యాగ్రహులం. లాఠీ దెబ్బలకు ఎలా ఎదురు నిలవాలో మనకు తెలుసు. కదలకండి. ఎక్కడివారక్కడే ఉండండి’ అని ఆయన ఉరిమాడు.
అంతే! మహా నాయకుడి గంభీర స్వరం విని కకావికలైన జనం తెప్పరిల్లారు. గొడ్డును బాదినట్టు పోలీసులు బాదుతున్నా ‘మహాత్మాగాంధీకీ జై’, ‘్భరత్ మాతాకీ జై’ అని నినదిస్తూ పళ్లబిగువున నిలబడ్డారు.
స్కాట్‌కి అరికాలి మంట నెత్తికెక్కింది. అతడిని దహిస్తున్న ఆగ్రహమంతా లాలాజీ మీదికి మళ్లింది. ‘ముందు వాడిని కొట్టండి’ అని అరిచాడు.
కన్నూమిన్నూగానని తెల్లవాడికి తెలియకపోవచ్చు. కాని లాలాజీ ఎవరో, ఎంతటి మహనీయుడో స్థానిక పోలీసులకు తెలుసు. అందుకే సూపర్నెంటు గద్దించినా ఎవరూ ఆయన మీద దాడి చేయలేక పోయారు. లాఠీలు ఎత్తి కొట్టీ కొట్టనట్టు హడావుడి చేయసాగారు.
అప్పుడు ముందు కురికాడు డిప్యూటీ సూపర్నెంటు సాండర్స్. పోలీసువాడి చేతిలోని లాఠీ లాక్కుని లాలాజీని తీవ్రంగా కొట్టాడు. పెద్దాయన పట్టుకున్న గొడుగు ముక్కలైంది. నుదురు చిట్లింది. నెత్తురు చిమ్మింది. అది చూసి సూపర్నెంటు స్కాట్ కూడా ఇంకో లాఠీ చేతపట్టి లాలాజీని పిచ్చెత్తినట్టు కొట్టసాగాడు.
డయ్యర్ దయ్యం స్కాట్, సాండర్స్‌లని పట్టింది. మహా ఘనత వహించిన బ్రిటిషు సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ప్రజాశక్తికి ప్రతీకగా వారి కంటికి లాజపత్‌రాయ్ కనపడ్డాడు. వారిలోని జాత్యహంకారం, లోలోన మరుగుతున్న విద్వేషం, భారతీయులంటే అసహ్యం ఒక్కసారిగా భళ్లుమన్నాయి. పెద్దవాడు, గొప్ప ప్రజా నాయకుడు, పార్లమెంటులో పెద్ద హోదాలో ఉన్నవాడు అని అయినా చూడకుండా విచ్చలవిడిగా కొట్టారు. దెబ్బల ధాటికి లాలాజీ తల పగిలింది. ఛాతీ మీద పెద్ద గాయమైంది. రక్తం చిమ్మింది. బట్టలు నెత్తురుతో తడిశాయి.
పంజాబ్ కేసరి కుప్పకూలాడు. అందరూ నిశే్చష్టులయ్యారు.
*
(చిత్రం) పోలీసుల లాఠీ దెబ్బలకు
గాయపడిన లాలా లాజపత్‌రాయ్

================
నౌజవాన్ భారత్ సభ
భగత్‌సింగ్ జీవించిందే కొద్దికాలం. అందులోనే అతడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఒకే సమయాన వివిధ రంగాల్లో బహుముఖ పోరాటాలు సాగించాడు. భగత్‌సింగ్ కార్యవాది. కారణజన్ముడు. ఉన్న అతి తక్కువ వ్యవధిలో అనుకున్నది ఏకదీక్షగా చేస్తూ పోవడమే తప్ప తన ప్రయోజకత్వాన్ని ప్రచారం చేసుకోవాలని అతడు ఎప్పుడూ తలచలేదు. ‘నౌజవాన్ భారత్ సభ’ను ఎవరి స్థాపించిందీ తెలీకపోయినా ఆ సభకు మూల స్తంభం మాత్రం భగత్‌సింగ్.
-పి.బాబ్జీ (తెనాలి)
=============

-ఎం.వి.ఆర్. శాస్త్రి