భగత్‌సింగ్

పార్లమెంటులో బాంబు (భగత్‌సింగ్‌ 27)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1929 ఏప్రిల్ 8.
ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన రోజు.
ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలవడానికి ముందే భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు సెంట్రల్ అసెంబ్లీ భవన సముదాయానికి చేరుకున్నారు. వారి కోసమే వేచి ఉన్న పార్లమెంటు మెంబరు ఒకరు వారి చేతిలో రెండు పాసులు పెట్టి వెళ్లిపోయాడు. వారు వెళ్లిన కాసేపటికే విజిటర్స్ గ్యాలరీ నిండిపోయింది. వివాదాస్పదమైన రెండు బిల్లుల గురించి వైస్రాయి లార్డ్ ఇర్విన్ ఏమి మాట్లాడుతాడో, ప్రజా వ్యతిరేకతను తోసిరాజని వాటిని ఎలా పాస్ చేయిస్తారో చూద్దామని చాలామంది వచ్చారు. వి.ఐ.పి.లకు ఉద్దేశించిన గ్యాలరీలో సర్ జాన్ సైమన్ కనపడ్డాడు. అతడిని చూడగానే భగత్‌సింగ్‌కి లాహోర్‌లో ‘సైమన్ కమిషన్ గోబ్యాక్’ అంటూ జరిగిన ప్రజా ప్రదర్శన, ఆ సందర్భాన లాలాజీపై జరిగిన లాఠీ దాడి గుర్తొచ్చాయి. రక్తం మరిగింది.
ఆ రోజు చేయాల్సిన దానికి భగత్‌సింగ్ జాగ్రత్తగా పథకం వేశాడు. అన్ని సన్నాహాలూ పకడ్బందీగా చేసుకున్నాడు. జయదేవ్ కపూర్ ముందే వచ్చి ఢిల్లీలో ఒక ఇంట్లో పోర్షనును అద్దెకు తీసుకున్నాడు. ముగ్గురూ అందులో ఉండి ముందస్తు ఏర్పాట్లను చకచకా చేశారు. జయదేవ్ హిందూ కాలేజి విద్యార్థినని చెప్పుకుని పార్లమెంటు కార్యాలయ సిబ్బందితో పరిచయం చేసుకున్నాడు. పాసులు సంపాదించి, ఆ సముదాయం ఆనుపానులన్నీ పరిశీలించాడు. భవనంలో ఎక్కడ ఏమి ఉండేదీ ప్లాను గీచి భగత్‌కి ఇచ్చాడు. ముహూర్తానికి రెండు రోజుల ముందు జయదేవ్ సాయంతో భగత్, దత్‌లు పార్లమెంటుకు వెళ్లి రెక్కీ జరిపారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందనున్న సభా మందిరాన్ని చూసి, ఎక్కడ నిలబడి ఎటుకేసి గురిపెట్టి బాంబు వేయాల్సిందీ, ఎవరికీ హాని జరగని విధంగా ఎలా జాగ్రత్త పడవలసిందీ చూసుకుని వచ్చారు. సభలోకి వెదజల్లాల్సిన ప్రకటన పత్రం ముసాయిదాను భగత్‌సింగ్ తన విలక్షణ శైలిలో తయారుచేశాడు. ‘హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ’ లెటర్ హెడ్డు మీద 30,40 కాపీలను తానే టైపు చేశాడు. ఆ పని కోసం పాత టైపురైటర్‌ని జయదేవ్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు.
ఆ రోజున తమ వేషాలు ఎలా ఉండాలన్నదీ ముందే ఆలోచించుకున్నారు. గంజిపెట్టి ఇస్ర్తి చేసిన ఖాకీ చొక్కా, ఖాకీ నిక్కరు, చొక్కాపైన నీలిరంగు కోటు; కాళ్లకు మేజోళ్లు, బూట్లు. ఇదీ ఆహార్యం. ఇవిగాక భగత్‌సింగ్ నెత్తిమీద ఫెల్ట్‌హాట్ పెట్టుకున్నాడు. ‘యాక్షను’ అయ్యాక పత్రికల వాళ్లు వారి బొమ్మలను ప్రచురించాలనుకుంటారు కదా? వాటి కోసం కష్టపడాల్సిన శ్రమ వారికి లేకుండా విప్లవకారులే వాటిని అందజెయ్యదలిచారు. ఢిల్లీలోని కశ్మీరీగేటు దగ్గర ఒక ఫోటో స్టూడియోకు వెళ్లి భగత్, దత్‌లు ఆ వేషంలో ఫోటో తీయించుకున్నారు. బాంబు దాడి కాగానే హిందుస్తాన్ టైమ్స్, పయొనీర్, స్టేట్స్‌మన్ వగైరా జాతీయ దినపత్రికలు ప్రచురించింది ఆ చిత్రాలనే. నాటి నుంచి నేటి దాకా భగత్‌సింగ్‌ని తలచుకుంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆ బొమ్మే!
ఏప్రిల్ 8న మరి కాసేపట్లో పార్లమెంటుకు బయలుదేరతారనగా భగత్‌సింగ్ దృష్టి జయదేవ్ వేసుకున్న బూట్ల మీద పడింది. అవి బాగా అరిగి ఉన్నాయి. భగత్‌వేమో కొత్త బూట్లు. సాండర్స్ హత్య తరువాత ఘరానా వేషంలో రైలెక్కి కోల్‌కతా పారిపోయే ముందు కొనుక్కొన్న ఖరీదైన షూస్ అవి. ఇప్పుడు ఎలాగూ తాను చేరేది జైలుకే కదా? అక్కడ వాటిని ఎలాగూ వేసుకోనివ్వరు. మిత్రుడికైతే అవి పనికొస్తాయి. భగత్ తాను వేసుకున్న వాటిని చప్పున విప్పి జయదేవ్‌కిచ్చేసి అతడి బూట్లను తాను ధరించాడు. తన దగ్గరున్న పాకెట్ వాచిని కూడా అతడికి బహుమతిగా ఇచ్చాడు. దానికో ప్రత్యేకత ఉంది. 1915 ఫిబ్రవరిలో విప్లవాన్ని ఆరంభించే సమయాన్ని సరిగ్గా చూసుకోవటం కోసం గదర్ పార్టీ కొన్న గడియారమది. విప్లవం విఫలమయ్యాక రాస్ బిహారీ బోస్ దానిని సచింద్ర సన్యాల్‌కి ఇచ్చాడు. సన్యాల్ దానిని భగత్‌కి బహూకరించాడు. అనంతర కాలాన హర్‌దోయిలో తాను నిర్మించిన షాహిద్ స్మారక భవన్‌లో ఆ బూట్లను, గడియారాన్ని జయదేవ్ అపురూపంగా భద్రపరిచాడు.
పెళ్లికి వెళుతున్నంత సంతోషంగా భగత్, బటుకేశ్వర్ దత్ చట్టసభ ప్రాంగణానికి బయలుదేరారు. ఏ శత్రు దేశమో ఉసికొలపగా వీలైనంత ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు తీసి, సర్వనాశనం చేయడానికి పార్లమెంటు మీద బాంబులతో విరుచుకుపడ్డ ఈ కాలపు అఫ్జల్‌గురు వంటి రక్తపిపాసులు కారు వారు. పొరపాటున కూడా ఎవరికీ ఏ విధమైన హాని జరగనివ్వకూడదని ఆరాటపడ్డ మానవతామూర్తులు వాళ్లు. ఎవరైనా తూలి తమ మీద పడితేనో, జనం మధ్య నడిచేటప్పుడు రాపిడివల్లో ఒరుసుకుని ప్రమాదవశాత్తూ బాంబు ఎక్కడ పేలుతుందోనన్న భయంతో నిక్కరు ఒక జేబులో బాంబును, రెండో జేబులో డిటొనేటరును పెట్టుకుని నెమ్మదిగా అడుగులేస్తూ గ్యాలరీలో ప్రవేశించారు. ముందే ఎంపిక చేసుకున్న స్థానాల్లో కూచున్నారు.
సమావేశాలు మొదలయ్యాయి. కీలకమైన ఓటింగు జరిగే రోజు కాబట్టేమో ‘హౌస్‌ఫుల్’ అయింది. మోతీలాల్ నెహ్రు, ఎం.ఆర్.జయకర్, ఎన్.సి.కేల్కర్, మహమ్మదాలీ జిన్నా వంటి ఉద్దండులు సభలో కొలువుదీరారు. విఠల్‌భాయ్ పటేల్ అధ్యక్ష స్థానంలో ఉన్నాడు.
జీరో అవర్ కాగానే కార్మిక వివాదాల కొత్త బిల్లు మీద ఓటింగు జరిగింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరూ వ్యతిరేకించినా, సర్కారు కొమ్ముకాసే నామినేటెడ్ సభ్యుల వత్తాసుతో బిల్లు నెగ్గింది. ఇక ‘ప్రజాభద్రత’ నల్లబిల్లు మీద సభాపతి తన రూలింగు ప్రకటించడమే తరువాయి. దాని తరవాత ఆ బిల్లు మీదా ఓటింగు తతంగం నడుస్తుంది. ప్రజా ప్రతినిధులు అడ్డుకున్న సర్కారీ తాబేదార్ల మద్దతుతో అది కూడా పాసవుతుంది. ఎక్కడైనా తేడా వస్తే ‘వీటో’ చక్రం అడ్డువేసి బిల్లులను గట్టెక్కించటానికి వైస్రాయ్ రడీగా ఉన్నాడు. ఆ అన్యాయాలను ఎదుర్కొని, కర్కోటకపు బిల్లులు చట్టాలు కాకుండా చేయగల శక్తి లేకపోవచ్చు. కాని
యావత్ప్రపంచం ఉలిక్కిపడేలా, నిరంకుశాధిపత్యంతో మదించిన బ్రిటిషు బదిరాంధకుల గూబలు పగిలేలా ప్రజాగ్రహ విస్ఫోటాన్ని వినిపించడం భారతీయులకు చేతనవునని రుజువు చేయాలి.
ఆ క్షణాన భగత్‌సింగ్ మనసులో ఫ్రెంచి వీరుడుఖఖఒఆళ ఘేజ్ఘశఆ మెధిలాడు. ‘చెవిటివాడికి వినపడాలంటే పెద్ద చప్పుడు చేయాల’న్న అతడి మాటలు గుర్తొచ్చాయి. భగత్ మెల్లిగా బాంబుకు డిటొనేటరు అమర్చి మెరుపులా లేచాడు. కింద సభా మందిరంలో అధ్యక్ష స్థానానికి దగ్గరగా, అధ్యక్షుడికి ముప్పు కలగని విధంగా ముందే ఎంచుకున్న చోటికి గురిచూసి బాంబు విసిరాడు.
‘ప్రజా భద్రత బిల్లుపై ఇప్పుడు నేను నా రూలింగును ప్రకటించదలచాను’ అని సభాపతి అంటూండగా ‘్ఢమ్’ అని భయంకర శబ్దంతో బాంబు పేలింది. సభ నిండా దట్టమైన పొగ అలుముకుంది. హఠాత్తుగా చీకటి కమ్మింది. ఎవరికీ ఏమి కనిపించలేదు. గుండెలవిసే పేలుడుతో అందరూ దిమ్మెరపోయారు. సభా మందిరంలోని మెంబర్లు, పైన గ్యాలరీల్లోని ప్రజలు, పత్రికా ప్రతినిధులు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. చాలామంది ద్వారం దగ్గరికి పరుగులు పెట్టారు. బయటికి వెళ్లే అన్ని దారులూ జామ్ అయ్యాయి. తొక్కిసలాట వల్ల అటు వెళ్లలేనివారు బెంచిల కింద దాక్కున్నారు. ఘనత వహించిన హోం మెంబరు బిక్కుబిక్కుమంటూ బల్లకింద నక్కాడు! సభాపతి తన చాంబరులోకి పరుగెట్టాడు. అంతా గందరగోళం. ఎటుచూసినా అయోమయం.
అంతలోనే బటుకేశ్వర్‌దత్ ఇంకోవైపు రెండో బాంబు విసిరాడు. (కాదు. రెండోదాన్ని కూడా భగత్‌సింగే విసిరాడని కొందరు చెబుతారు.) మళ్లీ భయంకర విస్ఫోటం. మరింత దట్టమైన పొగ. కారు చీకట్లు. ఎల్లెడలా భీతావహం. సరిగా అప్పుడే ఎక్కడినుంచో తుపాకి కాల్పులు. అది విప్లవకారుల పనికాదు. పిస్టళ్లు ఎవరు పేల్చారో తెలియదు.
అందరూ తలా ఒక దిక్కుకు పరుగులు పెడుతూ ఆర్తనాదాలు చేస్తూండగా భగత్, దత్‌లు నిబ్బరంగా నిలబడి ‘ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్య ముర్దాబాద్’ అంటూ ఎలుగెత్తి నినాదాలు చేస్తూ తమ చేతుల్లోని ప్రకటన పత్రం కాపీలను సభలోకి విసిరేశారు.
పని అయిపోయింది. కావాలనుకుంటే పారిపోవచ్చు. బాంబు పేలుళ్లకు దిగ్భ్రాంతి చెంది పోలీసులు కూడా ప్రాణాలు దక్కించుకోవటానికి కళ్లు నులుముకుంటూ, కేకలు వేస్తూ పరుగులు పెడుతున్నారు. విప్లవకారులను గమనించేవాళ్లు, పారిపోతుంటే పట్టుకునేవాళ్లు ఎవరూ లేరు. కాని పారిపోయే ఉద్దేశం ఇద్దరికీ లేదు. పిడికిలి బిగించి నినాదాలు చేస్తూ భగత్, దత్ అందరి దృష్టినీ పనిమాలా ఆకర్షించారు. ‘్భయపడకండి; కంగారుపడకండి’ అన్నట్టు సైగ చేస్తూ, సభలోని మెంబర్లను స్థిమితపరచాలని చూశారు.
కాసేపటికి పొగ బయటికి పోయింది. చీకటి తొలిగింది. సభాసదులు నెమ్మదిగా కుదుటపడ్డారు. పైనుంచి విసిరిన కాగితాలను అందుకుని చదవటం మొదలెట్టారు.
కంగారుపడ్డ పోలీసులు తేరుకుని, గ్యాలరీలో నిర్భయంగా నినాదాలు చేస్తున్న యువకులను తేరిపార చూశారు. కాని వారి దగ్గరికి వెళ్లటానికి భయపడ్డారు. అన్నిటికీ తెగించినవాళ్లు. ఇప్పటికే రెండు బాంబులు విసిరారు. వారి దగ్గర ఇంకా ఎన్ని బాంబులున్నాయో! ఎలాంటి మారణాయుధాలున్నాయో! వాటితో తమని ఎక్కడ చంపేస్తారో - అని పోలీసులు భయపడ్డారు. ‘్ఫరవాలేదు. దగ్గరికి రండి. మేమేమీ చేయం. లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఒకటికి రెండుసార్లు వారు అన్నాక ధైర్యం తెచ్చుకుని సార్జంట్ టెర్రీ వారి దగ్గరికి వెళ్లాడు. వారి జేబుల్లో ఏమి ఉందో, తుపాకితో ఎక్కడ కాలుస్తారోనని అతడు కంగారుపడుతూంటే భగత్‌సింగ్ నవ్వి జేబులో నుంచి రివాల్వరును, తూటాలను తీసి తానే సార్జంటుకు అప్పగించాడు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ ‘వందేమాతరం’ ‘బ్రిటిషు సామ్రాజ్యం నశించాలి’ అని గొంతెత్తి నినదిస్తూండగా విప్లవకారులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి, వాన్ ఎక్కించారు. చాందినీచౌక్ పోలీసుస్టేషన్‌లో ఇద్దరినీ చెరో చోట లాకప్‌లో ఉంచారు.
విప్లవకారులు ఎంత జాగ్రత్తపడ్డా బాంబు పేలిన చోట మెంబర్లు కూచునే బల్ల వెనక భాగం ముక్కలు, ఇటుక పెల్లలు బలంగా తగిలి ఒక సభ్యుడి తొడకు పెద్ద గాయమైంది. ఇంకో ముగ్గురికి చిన్న దెబ్బలు తగిలాయి. దిగ్భ్రాంతి కలిగించే దురాగతం దృష్ట్యా సభను 11వ తేది గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు సభాధ్యక్షుడు ప్రకటించాడు. ఎక్కడి వారక్కడ వెళ్లిపోయారు. సభలో విసిరిన లీఫ్‌లెట్లను అందుకున్న వారి నుంచి అధికారులు లాక్కున్నారు. అవి బయటికి పొక్కకుండా అడ్డుకున్నామని ప్రభుత్వం మురిసినా, ఉత్సాహవంతుడైన హిందుస్తాన్ టైమ్స్ పత్రిక రిపోర్టరు ఎలాగో ఒక కాపీని చేజిక్కించుకున్నాడు. సంచలన వార్తను పతాక శీర్షికగా ఇస్తూ ఆ పత్రిక అదే సాయంత్రం వెలువరించిన ప్రత్యేక సంచికలో విప్లవకారుల ప్రకటన పూర్తి పాఠాన్ని ఇచ్చారు:
ది హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ
నోటీసు
‘చెవిటివాళ్లకు వినపడాలంటే పెద్దగా అరవాలి’. ఫ్రెంచి అనార్కిస్టు అమరవీరుడు వేలాన్ కలకాలం నిలిచేలా అన్న ఈ పలుకులతో మా ఈ చర్యను గట్టిగా సమర్థించుకుంటున్నాము.
‘మాంటేగు చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల అమలుకు సంబంధించి పదేళ్లుగా నడుస్తున్న అవమానకర చరిత్రను.. ఇండియన్ పార్లమెంటు అనబడే ఈ సభ ద్వారా భారతజాతికి జరిగిన అపచారాలను ఏకరవు పెట్టకుండా మేము కొన్ని విషయాలు ఎత్తి చూపదలిచాము. సైమన్ కమిషన్ మరిన్ని సంస్కరణలేవో విదిలిస్తుందని జనం ఎదురుచూస్తూండగా, ఆ విదల్చబోయే వాటిని పంచుకోవటానికి కొంతమంది కొట్లాడుతుండగా ప్రభుత్వం మన మీద ప్రజా భద్రత బిల్లు, కార్మిక వివాదాల బిల్లు అనే సరికొత్త అణచివేత చర్యలను రుద్దబూనింది. పత్రికలలో రాజద్రోహం బిల్లును వచ్చే సమావేశాలకు అట్టేపెట్టింది. బహిరంగంగా పని చేస్తున్న కార్మిక నాయకులను విచ్చలవిడిగా అరెస్టులు చేయటం చూస్తే గాలి ఎటు వీస్తున్నదీ విస్పష్టమవుతుంది.
‘ప్రభుత్వం కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతున్న ఈ తీవ్ర పరిస్థితుల్లో హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషను, తన బాధ్యతను పూర్తిగా గుర్తెరిగి తన సైన్యాన్ని ప్రస్తుత చర్యకు ఆజ్ఞాపించింది. ప్రభుత్వం ఆడిస్తున్న అవమానకరమైన ప్రహసనానికి తెరదించటం దీని ఉద్దేశం. మనలను పీడిస్తున్న విదేశీ పెత్తందారులు ఏమైనా చేసుకోనీండి. కాని ప్రజల ముందు వాళ్ల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయటానికే ఈ పని చేస్తున్నాం.
‘ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాలకు తిరిగి వెళ్లి రానున్న విప్లవానికి ప్రజలను సమాయత్తపరచెదరుగాక. లాలా లాజపత్‌రాయ్‌ని క్రూరంగా చంపడాన్నీ, ప్రజా భద్రత, కార్మిక వివాదాల బిల్లులనూ నిరసిస్తూ మేము అభాగ్య భారత ప్రజానీకం తరఫున ఈ ప్రభుత్వానికి పలుమార్లు రుజువైన ఒక చరిత్ర పాఠాన్ని నొక్కి చెబుతున్నాము. వ్యక్తులను తేలికగా హతమార్చగలరు. కాని భావాలను మీరు చంపలేరు. మహా సామ్రాజ్యాలు కూలిపోయాయి. బార్బన్లు, జార్‌లు పతనమయ్యారు. కాని ఆదర్శాలు నిలబడ్డాయి.
మానవ జీవితానికి అత్యంత గౌరవాన్నిచ్చే మేము.... అవ్యాజ శాంతిని, సంపూర్ణ స్వేచ్ఛను ప్రతి మనిషీ అనుభవించగలిగే ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగనే మేము మానవ రక్తాన్ని చిందించవలసి వచ్చినందుకు విచారిస్తున్నాము. కాని - మనిషిని మనిషి దోచుకోవటాన్ని అసాధ్యం చేసి, అందరికీ స్వాతంత్య్రాన్ని సిద్ధింపజేసే ‘మహా విప్లవ’ ధర్మ పీఠాన కొద్దిమంది వ్యక్తుల బలి అనివార్యం.
విప్లవం వర్థిల్లాలి.
సం.బాలరాజ్
కమాండర్ ఇన్ చీఫ్

ఒకటి తరవాత ఒకటిగా దేశంలోని ప్రధాన పత్రికలన్నీ ‘ఇంపీరియల్ అసెంబ్లీలో బాంబుల పేలుళ్ల’ వార్తను, భగత్‌సింగ్, బి.కె.దత్‌ల ఫోటోలను, సభలో వారు వెలువరించిన ప్రకటనను ప్రముఖంగా ప్రచురించాయి. విప్లవకారుల సాహసకృత్యం యావత్ప్రజానీకాన్నీ ఉత్తేజపరిచి ఉర్రూతలూపింది. దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. పార్లమెంటు సభా భవనంలో భగత్‌సింగ్ నోట ఖంగున మోగిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్థిల్లాలి) నినాదం నాటి నుంచీ నెత్తురు మండే యువతకు యుద్ధ నాదమైంది. కలకాలం స్ఫూర్తినిచ్చే విప్లవ అష్టాక్షరి అయింది. *

ఎం.వి.ఆర్.శాస్ర్తీ