భగత్‌సింగ్

కోరుకున్న ఉరి (భగత్‌సింగ్ - 31)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా విన్నాక ఒక అనుమానం సహజం.
అంత తెలివిగల భగత్‌సింగ్ ఇంత తేలికగా పోలీసుల చేతికి చిక్కాడేమిటి? నాలుగు నెలలకు పైగా శక్తియుక్తులు అన్నీ వెచ్చించి, బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా సాండర్స్‌ని ఎవరు చంపిందీ కనుక్కోలేకపోయిన బ్రిటిషు సర్కారుకు - ఆ పని చేసింది నేనేనహో అని తనకు తానే అంత తెలివితక్కువగా తెలియపరచాడు. ఎందువల్ల?
పార్లమెంటులో బాంబు వేసిన సమయాన భగత్‌సింగ్ జేబులో ఉన్న రివాల్వరును లాక్కుని పరీక్ష చేశాకే - సాండర్స్‌ని కాల్చింది కూడా దానితోనే అన్న సంగతి పోలీసులకు తెలిసిపోయింది. పార్లమెంటులో విసిరిన ‘నోటీసు’ కాగితాలను సాండర్స్ హత్యానంతరం లాహోర్‌లో అంటించిన పోస్టర్‌తో పోల్చి చూశాకే రెండింటి వెనకా ఉన్నది ఒక్కరేనని తెల్ల పాలకులకు లైటు వెలిగింది. మహా మేధావి భగత్‌సింగ్ మరీ ఇంత మూర్ఖంగా దొరికిపోయాడేమిటి? తనను తాను కాచుకోవడం పట్ల ఇంత అజాగ్రత్త చూపాడేమిటి?
ఔను. అది నమ్మశక్యంకాని నిర్లక్ష్యమే. ఆత్మరక్షణ విషయంలో ఆశ్చర్యపరచే అలసత్వమే - అని అభిప్రాయపడ్డారు భగత్‌సింగ్ జీవిత చరిత్ర గ్రంథాలు రాసిన వారిలో చాలామంది.
వారందరూ గొప్పవాళ్లే. కాని ఆ అభిప్రాయం సరికాదు.
నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పోలీసులకు పట్టుబడటం కాదు. పోలీసులకు పట్టుబడటం కోసమే భగత్‌సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అజాగ్రత్త వల్ల గుట్టు బయటపెట్టుకుని ఉరికంబం ఎక్కడం కాదు. ఉరికంబం ఎక్కడం కోసమే అజాగ్రత్తగా మెలగి తన గుట్టును తానే బుద్ధిపూర్వకంగా రట్టు చేసుకున్నాడు.
నేరస్థుల వాసన పట్టటంలో పోలీసు కుక్కలకు ఉన్నంత నేర్పు పోలీసుల వాసన పట్టటంలో భగత్‌సింగ్‌కు ఉంది. రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఎత్తుకు పైఎత్తు వేయటంలో అతడు ఘనుడు. ఉదాహరణకు - 1927లో ఏమైంది? పోలీసులు తనను వెంటాడుతున్నారని అనుమానం కలగగానే, లాహోర్ వెళ్లాల్సిన వాడు కాస్తా అమృత్‌సర్‌లో దిగిపోయాడు. అక్కడా ఒక పోలీసు తనను వెంబడిస్తున్నాడని పసికట్టి, చటుక్కున ఒక ఇంట్లోకి దూరి, జేబులోని రివాల్వరును తెలిసిన లాయరుకు అప్పగించాడు. ప్రమాదం ఆకస్మికంగా ముంచుకొస్తున్నదనిపించినప్పుడే ముందు జాగ్రత్తతో ఆచితూచి అడుగువేసిన భగత్‌సింగ్, రోజుల తరబడి అన్నీ ఆలోచించి పార్లమెంటులో బాంబు సాహసానికి ఉపక్రమించినవాడు తలచుకుంటే తనను తాను కాచుకోలేడా?
సెంట్రల్ అసెంబ్లీలో ప్రమాదరహితమైన బాంబును వేసి పెద్ద చప్పుడు చేయాలన్నదే తప్ప ఎవరిని కాల్చే ఉద్దేశమూ భగత్‌సింగ్‌కి ఏ కోశానా లేదు. పిస్టల్ ప్రయోగించాలన్న ఆలోచనే లేనప్పుడు అంత పెద్ద సాహసకృత్యానికి వెళుతూ పిస్టల్ ఎందుకు పట్టుకుపోతాడు? ఎటుపోయి ఎటు వస్తుందో - ఎందుకైనా మంచిది - మారణాయుధం దగ్గర ఉంచుకోవాలని తలచాడు అనుకుందామా? భగత్ దగ్గర వేరే పిస్టల్ ఏదీ లేదా? బాంబులు, తుపాకులు భారీగా సమకూర్చుకుని పెద్ద గిడ్డంగులే నడిపిన విప్లవ పార్టీలో ముఖ్య నాయకుడైన వాడికి సాండర్స్ హత్యకు ఉపయోగించిన రివాల్వరు తప్ప వేరేదీ అందుబాటులో లేకపోయిందా? అలాగే - సాండర్స్ హత్య అనంతరం వేసిన పోస్టరునూ, పార్లమెంటులో విసిరిన పత్రాన్నీ ఒకే రంగు కాగితం మీద, ఒకే నమూనాలో, ఒకే రకం పదజాలంతో ఒకే సంతకంతో రూపొందిస్తే వీళ్లే వాళ్లు అని పోలీసులకు చప్పున తెలిసిపోతుందన్న సంగతే గ్రహించలేని అమాయకుడా భగత్‌సింగ్?
కాదు. పోలీసులకు ఆ సంగతి తెలవాలన్న ఉద్దేశంతోటే అతడు కావాలని కేర్లెస్‌గా వ్యవహరించాడు.
ఎందుకలా చేశాడు? సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేయాలి; పారిపోకుండా అక్కడే నిలబడాలి; పోలీసులు తమని అరెస్టు చేసి, దేశంలో అందరి దృష్టీ తమ మీదికి మరలాక ఆ అవకాశాన్ని వాడుకుని, న్యాయస్థానాన్ని వేదిక చేసుకుని తమ వాణిని, వాదాన్ని జాతి జనులకు దృఢంగా, బలంగా వినిపించాలి - అన్నదే కదా విప్లవ పార్టీ విధాన నిర్ణయం? ఆ పనిని భగత్, దత్‌లు తు.చ తప్పక, చక్కగా పూర్తి చేశారు. సెషన్స్ కోర్టులో వారి స్టేట్‌మెంటుతో వారి పట్ల ప్రజల వైఖరి మొత్తంగా మారిపోయింది. అనుకున్నది అనుకున్నట్టే అయాక కూడా సాండర్స్ హత్య కేసు ఉచ్చును భగత్‌సింగ్ ఏరికోరి తన మెడకు తగిలించుకున్నాడెందుకు? ఉరి మీద మరులుగొన్నాడా? జీవితం మీద విరక్తి చెందాడా? కాదు.
పార్లమెంటులో బాంబు ప్రయోగం వల్ల ఎవరి ప్రాణమూ పోక, ఎవరూ తీవ్రంగా గాయపడక, ఆస్తి నష్టమూ పెద్దగా లేనప్పుడు ఆ నేరానికి మహా అయితే యావజ్జీవ ఖైదును మాత్రమే కోర్టు విధించగలదు. ఆ సంగతి భగత్‌సింగ్‌కి తెలుసు. అలాగే అయింది కూడా. సెషన్సు కోర్టు తీర్పును హైకోర్టు ధ్రువీకరించాక జరిగేదేమిటి? ఆనవాయితీ ప్రకారం 14 ఏళ్ల పాటో, లేదా జీవిత పర్యంతమూనో రాళ్లు కొడుతూ, దెబ్బలు తింటూ జైలులో దుర్భరంగా బతకాల్సిందే కదా? ఇక భగత్‌సింగ్ ఏమయ్యాడో, ఎలా ఉన్నాడో బాహ్య ప్రపంచానికి తెలియదు; పట్టదు. కొన్నాళ్లకు క్రమంగా అతడి జ్ఞాపకాలూ మరుపున పడతాయి. కొద్దికాలపు సంచలనంగానే భగత్‌సింగ్ చరిత్ర పుటలో చిన్న ఫుట్‌నోట్‌గా మిగిలిపోతాడు.
అలాంటి అనామకపు బతుకు భగత్‌సింగ్‌కి ఇష్టం లేదు. తన జాతి గుండెల్లో కలకాలం నిలిచే స్ఫూర్తిగా, ఎప్పటికీ గుర్తుండే విప్లవ గీతికగా, యువత నెత్తురు మండించే నిరంతర ప్రేరక శక్తిగా, భావితరాలకు ఉదాత్త ఆదర్శంగా అతడు మిగిలిపోవాలనుకున్నాడు. దేశమాత సేవలో, బంధనాలు తెంచి జాతి గతిని మార్చే లక్ష్య సాధనలో... చివరి ఊపిరి వరకూ తన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనుకున్నాడు.

‘‘ఎవరైనా నా దేశానికి కీడు చేశారు అంటే నా దేవుడిని అవమానించారు అనే నేను ఒక హిందువుగా భావిస్తాను. నా దేశాన్ని సేవించడమే నాకు రాముడి సేవ. ఆమె సేవే నాకు కృష్ణుడి సేవ. నాలాంటి కొడుకు దగ్గర తల్లికి సమర్పించడానికి ప్రాణం తప్ప మరేదీ లేదు. దానే్న నేను ఆమె పాద పీఠం ముందు అర్పించుకుంటున్నాను. ఇవాళ భారత్ నేర్చుకోవలసింది ఎలా మరణించాలన్నదే. దాన్ని నేర్పటానికి మేము మరణించి చూపటమే మార్గం. అందుకే నేను మరణిస్తున్నాను. నా ఆత్మ బలిదానానికి గర్వపడుతున్నాను. మళ్లీ ఇదే తల్లికి బిడ్డగా జన్మించి, లక్ష్యం సిద్ధించేదాకా పవిత్ర ఆశయం కోసం మళ్లీ మళ్లీ మరణించాలన్నది ఒకటే నా కోరిక’’ -అని 1909లో ఉరికంబమెక్కే ముందు మదన్‌లాల్ థింగ్రా పలికాడు.
భగత్‌సింగ్ కూడా అదే దారిలో నడవదలిచాడు. అందుకే - బాంబు కేసులో జైలుకు పోవటంతో తనకు ఆశ్వాసాంతం కాకుండా అక్కడి నుంచి నేరుగా ఉరికంబానికి తన దారిని తానే భగత్ జాగ్రత్తగా మలచుకున్నాడు. అందులో భాగంగానే సాండర్స్ హత్య మిస్టరీని తానే ఛేదించి పెట్టి విదేశీ పాలకుల చేతికి గువ్వపిట్టలా చిక్కాడు. అది ఆత్మహనన వైకల్యంతోనో, నిస్పృహ వల్లో, లేక కీర్తికండూతి చేతో చేసిన పని కాదు. దాని వెనుక గొప్ప త్యాగనిరతి, మహత్తర ప్రణాళిక ఉన్నాయి.
తరువాత జరిగింది అద్భుత చరిత్ర!
అసెంబ్లీ బాంబు కేసులో తమ చేతికి చిక్కింది చాలా పెద్ద చేప అన్న సంగతి అర్థం కాగానే బ్రిటిషు సర్కారు మెరపులా కదిలింది. భగత్, దత్‌ల తీగ పుచ్చుకుని విప్లవ డొంక మొత్తాన్నీ కుళ్లగించింది. మాయచేసి, మోసగించి, మభ్యపెట్టి విప్లవ శ్రేణుల్లో చిచ్చు పెట్టింది.
లాహోర్‌లో బాంబులకు కావలసిన ఇనుప తొడుగులను సుఖదేవ్ తనకు నమ్మకమైన కమ్మరి వద్ద చేయిస్తూండేవాడు. కర్మం చాలక అది కాకతాళీయంగా ఒక పోలీసు కంట పడింది. అంత పెద్ద సంఖ్యలో ఆ తొడుగులు ఎవరు ఆర్డరిచ్చారు, ఎందుకోసం అని అనుమానం వచ్చి అతగాడు కమ్మరి నుంచి ఒడుపుగా ఆరాలు తీశాడు. సుఖదేవ్‌ను నీడలా వెంబడించి విప్లవకారుల రహస్య స్థావరాన్ని కనిపెట్టాడు. పార్లమెంటులో బాంబు పేలి వారంరోజులయ్యాక కాశ్మీరీ గేటు దగ్గరి ఇంట్లో సుఖదేవ్, కిశోరీలాల్‌లు బాంబులు చేసే పనిలో ఉండగా పోలీసులు దాడి చేశారు. సుఖదేవ్‌ని కలవడానికి వచ్చిన జైగోపాల్ కూడా అప్పుడు అక్కడ ఉన్నాడు. ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక బాంబును, బాంబు తయారీ సామగ్రిని, రసాయనాలను సుఖదేవ్ నుంచి రివాల్వరును స్వాధీనం చేసుకున్నారు. నిర్బంధించాక వారిని ఒకరికి తెలియకుండా ఒకరిని నిగ్గదీశారు. ఒకరు లొంగిపోయి గుట్టు మొత్తం విప్పి అప్రూవరుగా మారారని ఇంకొకరికి చెప్పి నేరం ఒప్పుకోమంటూ బలవంతపెట్టారు. చిత్రహింసలు పెట్టి, ప్రలోభాలు చూపి, మాయమాటలు చెప్పి పోలీసులు పెట్టిన ఒత్తిడికి జైగోపాల్ తట్టుకోలేకపోయాడు. అరెస్టయిన ఎనిమిదో రోజున పోలీసు సాక్షిగా మారాడు. పార్టీ కార్యకలాపాలకు సంబంధించి తనకు తెలిసిందంతా పోలీసులకు చెప్పాడు. అతడిచ్చిన సమాచారంతో విప్లవకారులకు సంబంధించిన నివాసాలు, స్థావరాలు, కార్యస్థానాలు అన్నిటి మీదా మెరపు దాడులు జరిగాయి. లాహోర్, సహరాన్‌పూర్, ఝాన్సీలలో బాంబులు, పిస్టళ్లు, తూటాలు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డాయి. లాహోర్‌లో భగవతీ చరణ్ నివాసం ఒక్కచోటే 21 బాంబులు దొరికాయి. సుఖదేవ్ కూడా అప్రూవరుగా మారాడని, నీతో సహా విప్లవకారులకు సంబంధించిన సమాచారాన్ని బయటపెడుతూ స్టేట్‌మెంటు ఇచ్చాడని బుకాయించి, నకిలీ వాఙ్మూలాన్ని చూపించి పోలీసులు హన్స్‌రాజ్ వోహ్రాను భయపెట్టి తమవైపు తిప్పుకున్నారు. ఇదే రకమైన ఎత్తుగడలతో లలిత కుమార్ ముఖర్జీ, బ్రహ్మదత్, ఫణీంద్రనాథ్ ఘోష్, మన్‌మోహన్ బెనర్జీలను కూడా క్షమాభిక్ష ఎరవేసి అప్రూవర్లుగా మార్చారు. వారూ వీరూ ఇచ్చిన సమాచారంతో హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్.ఎస్.ఆర్.ఎ.)లో శివవర్మ, జైదేవ్ కపూర్ లాంటి ముఖ్యులందరినీ బంధించారు. మొత్తం అందరి మీద ‘లాహోర్ కుట్ర కేసు’ను పెట్టారు. చంద్రశేఖర్ ఆజాద్ ఒక్కడే ఎప్పటివలె పోలీసుల బారి నుంచి లాఘవంగా తప్పించుకున్నాడు.
ఈ పరిణామాలన్నీ భగత్‌సింగ్‌కు తెలుస్తూనే ఉన్నాయి. విప్లవ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచి, తమ అందరి అంతు చూడటానికే బ్రిటిషు ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని అతడికి అర్థమైంది. దేశంలోపలా వెలుపలా తీవ్ర సంచలనం రేకెత్తించిన అసెంబ్లీ బాంబు కేసు విచారణను ఎంత త్వరగా ముగించగలమా అని పాలకవర్గం పడుతున్న తొందరంతా అసలైన కుట్ర కేసుకు తెర ఎత్తడానికేనని అందరికీ అవగతమైంది. భగత్‌సింగ్ మీద ఇంకో ముఖ్యమైన కేసులో ముద్దాయిగా విచారణ జరగవలసి ఉన్నదని సెషన్స్ కోర్టు జడ్జి న్యాయస్థానంలోనే బాహాటంగా అన్నాడు.
వేటు వేయటానికి సర్కారు కత్తులు నూరుతున్నట్టే, దానిని ఎలా ఎదుర్కోవడమా అన్నది భగత్‌సింగ్ కూడా తీవ్రంగా ఆలోచించసాగాడు. ప్రపంచంలోకెల్లా శక్తిమంతమైన మహా సామ్రాజ్యంతో ధైర్యంగా తలపడి, బాధిత జాతికి వినూత్న ఉత్తేజం ఇవ్వడానికి తన వ్యూహ రచనలో తాను నిమగ్నమయ్యాడు.
1929 జూన్ 12న సెషన్సు కోర్టులో శిక్ష పడగానే బి.కె.దత్‌ను లాహోర్ సెంట్రల్ జైలుకూ, భగత్‌సింగ్‌ను మియాన్‌వాలీ జైలుకూ తరలించారు. ఇద్దరినీ ఒకే రైలులో వేరువేరు కంపార్టుమెంట్లలో ఎక్కించారు. అప్పటికే భగత్‌సింగ్ తదుపరి ఏమి చేయాలన్న దానిపై ఒక నిశ్చయానికి వచ్చాడు. జైలుకు వెళ్లిన వెంటనే నిరశన దీక్షతో ప్రభుత్వం మీద ప్రతిఘటన మొదలుపెట్టాలనుకున్నాడు. అందులో తానొక్కడే కాదు బటుకేశ్వర్ దత్ కూడా పాల్గొంటే ప్రభావం బాగా ఉంటుంది. కాని ఆ సంగతి దత్ చెవిన వేయటం
ఎలా? పోలీసులు ఇద్దరినీ కలవనీయకుండా అనుక్షణం కాపలా కాస్తున్నారాయె. ఇద్దరినీ ఒకే రైలు పెట్టెలో ప్రయాణం కూడా చేయనివ్వడం లేదాయె. మరి ఏం చేయాలి?
సవాలు ఎదురైనప్పుడు భగత్‌సింగ్ బుర్ర అమోఘంగా పని చేస్తుంది. అందునా అతడు మంచి నటుడు. తనకు కాపలాగా ఉన్న పోలీసు అధికారిని మాటల్లో పెట్టాడు. ‘నేను, మా వాడు బహుశా ఈ జన్మలో మళ్లీ కలుసుకోలేమేమో! చెరి ఒక జైల్లో మగ్గిపోబోతున్నాము కదా? ఆఖరిసారి వాడిని ఒకసారి చూసి తనివితీరా కాసేపు మాట్లాడాలని ఉంది. దయచేసి అనుమతించగలరా?’ అని దీనంగా అడిగాడు. ‘మా చేతులకు సంకెళ్లు ఉన్నాయి. మీ అంతటి వాళ్లు తుపాకులతో కాపలాగా ఉన్నారు. ఇక మేము ఏమి చేయగలం? ఎలా తప్పించుకుపోగలం? ఒక స్టేషనులో నన్ను ఆ పెట్టెలో ఎక్కించి తరవాత స్టేషను వచ్చేంతవరకూ వాడితో ఉండనిస్తే చాలు’ అని ప్రాధేయపడ్డాడు. పోలీసు వాడు కాదనలేకపోయాడు. ‘సరే’ అని ఇద్దరు ఖైదీలనూ కాసేపు కలిసి ప్రయాణం చేయనిచ్చాడు.
భగత్‌సింగ్‌కు అది చాలు. ‘నేను ఈ 15వ తేదీన ఫలానా విధంగా నిరాహారదీక్ష మొదలుపెడతా! నువ్వూ అలాగే చెయ్యి’ అని సహచరుడి చెవిలో చెప్పాడు.
ఒక మహా పోరాటానికి బీజావాపనం జరిగింది.
***

భగత్‌సింగ్
ప్రాణ త్యాగానికి సిద్ధపడి దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాని కెక్కిన భగత్ జీవిత గాథ ప్రతి ఒక్క భారతీయుడికీ స్ఫూర్తిదాయకం. పెళ్లికి వెళుతున్నంత సంతోషంగా భగత్, బటుకేశ్వర్ దత్ చట్టసభ ప్రాంగణానికి బయలుదేరిన సంఘటన చదువుతూంటే కళ్లనీళ్ల పర్యంతం అయ్యాం. ఏ శత్రు దేశమో ఉసికొలపగా వీలైనంత ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు తీసి, సర్వనాశనం చేయడానికి పార్లమెంటు మీద బాంబులతో విరుచుకుపడ్డ ఈ కాలపు అఫ్జల్‌గురు వంటి రక్తపిపాసులు కారు వారు. పొరపాటున కూడా ఎవరికీ ఏ విధమైన హాని జరగనివ్వకూడదని ఆరాటపడిన మానవతా మూర్తులు వాళ్లు. భగత్‌సింగ్ ‘అమర్ రహే’ అని అరవాలనిపించింది.
-ఎ.శాంతిసమీర (వాకలపూడి, తూ.గో.జిల్లా)

ఎం.వి.ఆర్.శాస్ర్తీ