రాష్ట్రీయం

బిజెపి బలం చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొనే భారీ బహిరంగ సభను మార్చి 6న నిర్వహించాలని నిర్ణయించినట్టు బిజెపి ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ చెప్పారు. బహిరంగ సభ ఏర్పాట్ల విషయంలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించడానికి రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్‌లోని బిజెపి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, ఈ సభ ద్వారా తమ పార్టీ బలమేమిటో చూపిస్తామన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సభ అవుతుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందిస్తోందో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభలో ప్రజలకు వివరిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో, ఏం చేయబోతోందో ప్రజలకు వివరించడానికి బహిరంగ సభను మంచి అవకాశంగా అమిత్‌షా తీసుకుంటారన్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ వర్శిటీలో జాతి వ్యతిరేకులకు కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వత్తాసు పలకటం దురదృష్టకరమని సిద్ధార్థనాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. జాతివ్యతిరేకులపై చర్యలు తీసుకుంటే దానిని వాక్‌స్వాతంత్య్రాన్ని హరించినట్టు మాట్లాడటం సరికాదన్నారు. గోబ్యాక్ ఇండియా, డిస్ట్రాయ్ ఇండియా, పాకిస్థాన్ జిందాబాద్ వంటి నినాదాలు చేయటం వాక్‌స్వాతంత్య్రమా అని ప్రశ్నించారు. విద్యాలయాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ, సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వారిని కూడా జాతి వ్యతిరేకులుగానే పరిగణించాలన్నారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ వర్శిటీకి వెళ్లి కులం కార్డును ఉపయోగించి రాజకీయంచేసిన వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి జెఎన్‌యులో జరిగిన సంఘటనలపై ఏం మాట్లాడతారని సిద్ధార్థనాథ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న బిజెపి కాపలా కుక్క పాత్రను పోషిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కాపు రిజర్వేషన్లపై బిజెపి విధానమేమిటని ప్రశ్నించినపుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయించటమే తమ బాధ్యతని సిద్ధార్థనాథ్‌సింగ్ చెప్పారు. విలేఖర్ల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, మాజీ కేంద్ర మంత్రులు పురంధ్రేశ్వరి, కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బిజెపి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి జి రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, లక్ష్మీపతిరాజు తదితరులు పాల్గొన్నారు.