రాష్ట్రీయం

బోరుబావిలో బాలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తవ్విన కొద్ది గంటలకే సంఘటన
బయటకు తీసేందుకు ప్రయత్నాలు
ఆక్సిజన్ అందిస్తున్న 108 సిబ్బంది
ఘటన స్థలాన్ని సందర్శించిన ఎంపి
సంగారెడ్డి, నవంబర్ 28: ముక్కుపచ్చలారని మూడేళ్ల బాలుడు రాకేష్ బోరుబావిలో తల క్రిందులుగా పడిపోయాడు. మెదక్ జిల్లా పుల్‌కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో శనివారం ఉదయం 6.30కు సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి రాములు మూడెకరాల భూమిలో శుక్రవారం సాయంత్రం బోరు తవ్వించడానికి మోటారు తీసుకొచ్చారు. బైరు సాయిలు, మొగులమ్మల ఇంటికి 50 అడుగుల దూరంలో బోరు తవ్వించారు. 150 అడుగుల లోతువరకు తవ్వినా నీరు పడకపోవడంతో, మరో 30 అడుగుల లోతుకు బోరు తవ్వించారు. అయినా నీరు పడలేదు. దీంతో శనివారం ఉదయం మరో బోరు వేసే ఆలోచనతో డ్రిల్లింగ్ మోటార్‌ను అక్కడే ఉంచారు. బోరు బావి తవ్వుతోన్న ప్రాంతానికి దగ్గర్లో నివాసం ఉంటున్న సాయిలు, మొగులమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. ప్రమాదానికి గురైన రాకేష్ నాల్గవ సంతానం. ఉదయం 6 గంటలకు మూడేళ్ల రాకేష్ ఆరేళ్ల అన్న బాల్‌రాజ్‌తో కలిసి బోరువేసిన ప్రాంతానికి వెళ్లారు. పిల్లలను గమనించిన మోటారు సిబ్బంది వెళ్లిపోవాలని హెచ్చరించి పనిలో నిమగ్నమయ్యారు. బోరు తవ్వగా వచ్చిన మట్టిలో ఆడుకుంటూ చిన్నారి రాకేష్ అదుపుతప్పి బావిలో పడిపోయాడు. తమ్ముడ్ని రక్షించేందుకు అన్న బాల్‌రాజ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదృష్టవశాత్తూ బాల్‌రాజ్ బావిలో పడకుండా నిలదొక్కుకోగలిగాడు. తమ్ముడు బావిలో పడిపోయిన విషయాన్ని మోటారు సిబ్బందికి, తల్లిదండ్రులకు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న పుల్‌కల్ ఎస్‌ఐ సత్యనారాయణ హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకుని 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆక్సిజన్‌ను బోరులోపలికి అందించే చర్యలు మొదలెట్టారు. 33 అడుగుల లోతులో బాలుడు రాకేష్ ఇరుక్కుపోయినట్టు అధికార్లు గుర్తించారు. నాలుగు జేసిబిలు, మూడు ఇటార్చిలతో బోరుకు సమాంతరంగా మరో బావి తవ్వడం ప్రారంభించారు. పెద్దపెద్ద బండరాళ్లు అడ్డురావడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. మెదక్ ఆర్డీవో మెంచు నగేష్, తహశీల్దార్ శివరాం, జోగిపేట సిఐ నాగయ్యతోపాటు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది, 108 సిబ్బంది, ట్రాన్స్‌కో అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. రాత్రి పది గంటల వరకూ తవ్వకాలు జరుపుతున్నారు. సిద్దిపేట ఎస్‌కె బోర్‌వెల్స్‌కు చెందిన శ్రీనివాస్‌ను రప్పించి సిసి కెమెరాల ద్వారా పరిశీలించారు. రాకేష్ తల క్రిందులుగా పడిపోయాడని, 33 అడుగుల లోతులో ఇరుక్కున్నాడని, ఎలాంటి కదలికా లేదని సమాచారం ఇవ్వడంతో భయాందోళనలు మొదలయ్యాయి. అయితే ఆక్సిజన్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో, రాకేష్ ప్రాణాలతో ఉండి ఉండొచ్చన్న ఆశ వ్యక్తమవుతోంది. విషయం దావాలనంలా వ్యాపించడంతో వివిధ గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. బాలుడ్ని రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ సంఘటన స్థలాన్ని సందర్శించి బాలుడి యోగక్షేమాల గురించి ఆరా తీశారు. కుటుంబీకులను ఓదార్చి, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందోల్ ఎమ్మెల్యే పి బాబుమోహన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. బోరుబావిలో నీరుపడక విఫలమైందని తెలిసినా బోరు మోటారు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రాకేష్ ప్రమాదంలో పడ్డాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతపై బండరాయినో, మట్టినో పోసి పూడ్చివేసి ఉంటే విలువైన ప్రాణానికి ముప్పు వాటిల్లేది కాదని ప్రజలు పొలం యజమానిపై మండిపడుతున్నారు. (చిత్రం) బాలుడిని రక్షించే ఆపరేషన్‌లో భాగంగా జెసిబి సాయంతో సమాంతరంగా మరో బావి తవ్వుతున్న దృశ్యం, బోరుబావిలో పడిన రాకేష్ (ఇన్‌సెట్‌లో)