రాష్ట్రీయం

పరిపాలనా భవనాలకు 400 ఎకరాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీడ్ క్యాపిటల్‌లోని మూడు గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు
సామాన్య, మధ్యతరగతి ప్రజల గృహావసరాలకు కన్పించని చోటు

విజయవాడ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠకు ముసాయిదా నోటిఫికేషన్ జారీతో తెరపడినట్లయింది. మొత్తం 25గ్రామాల్లో అధిక జనసాంద్రత ఉండే లింగాయపాలెంను ముందుగానే సీడ్ క్యాపిటల్‌గా నిర్ణయించినట్లే ఆ గ్రామం నుంచి రాయపూడి, తాళ్లాయపాలెం, కృష్ణా కరకట్ట మధ్య ప్రభుత్వ నగరంగా నిర్మించాలని మాస్టర్ ప్లాన్‌లో చూపారు. ఇక్కడ శాసనసభ, శాసనమండలి, సచివాలయం వంటి నిర్మాణాలు జరుగుతాయి. రాజధానికే కాదు రాష్ట్ర పరిపాలనకు ఈ నగరం కేంద్రం కానుంది. వాస్తుశాస్త్రం మేరకు ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య దీన్ని ప్రతిపాదించారు. ఈ ప్రభుత్వ నగరానికి 1430 హెక్టార్ల మేర భూమిని కేటాయించినట్లు కన్పిస్తున్నప్పటికీ భవనాల నిర్మాణాల కోసం కేవలం 400 ఎకరాలను మాత్రమే చూపుతున్నారు. ఆర్థిక నగరానికి 1430 హెక్టార్లు కేటాయించారు. ఈ నగరంలో ప్రాథమిక వాణిజ్య భవన సముదాయాలు ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ నగరానికి 2వేల 677 హెక్టార్ల భూమిని కేటాయించారు. ప్రపంచ ఐటి దిగ్గజ సంస్థలకు ఇక్కడ పెద్దపీట వేయబోతున్నారు. 752 హెక్టార్లలో కాలుష్య రహిత పారిశ్రామికవాడ ఉంటుంది. పర్యాటక నగరానికి 4వేల 745 హెక్టార్ల భూమిని కేటాయించారు.
రాజధాని పేరిట రైతు నుంచి సేకరించిన 33వేల ఎకరాల్లో పరిపాలనా భవనాలకు కేవలం 400 ఎకరాలు మాత్రమే కేటాయించి మిగిలిన భూములను కార్పొరేట్ శక్తులకు వేర్వేరు పద్దుల కింద అప్పనంగా అప్పగించేలా మాస్టర్ ప్లాన్ కన్పిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా పరిపాలనా నగరంలో నిలిచిన ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల భవితవ్యం ఏమిటన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న. భవిష్యత్‌లో అక్కడి నివాసగృహాలను యథాతథంగా ఉంచుతారో, లేదోనని ఆ గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న కరకట్ట వందేళ్ల క్రితం నాటిదని, ఇటీవలి కాలంలో మరమ్మతులు మినహా పూర్తిస్థాయిలో పటిష్ఠపర్చలేదనే సాకుతో దాన్ని విస్తరిస్తూ పునర్నిర్మించటానికి కూడా ప్రతిపాదనలు చేశారు. అయితే నదీగర్భంలో అక్రమంగా వెలిసిన కట్టడాల భవితవ్యం ఏమికానున్నదోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇందులో కొన్ని భవనాలు ముఖ్యమంత్రి నివాస, అతిథిగృహాలుగా మారాయి. ఇందుకోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. పర్యాటక రంగం కోసం ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి నదీగర్భంలో ఓ మార్గం నిర్మాణం కానుంది. ఇక రాజధాని నగరంలో వినియోగించే నీటిని రీసైక్లింగ్ చేయాలని ప్రతిపాదించి శుద్ధిచేసిన నీటిని పార్క్‌లకు వినియోగించాలని సూచించారు. అయితే చివరకు సమీప కృష్ణానదిలోకే మళ్లించే అవకాశాలే కన్పిస్తున్నాయి. దీనివల్ల కృష్ణాజలాలు కలుషితమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదనే ఆందోళన నెలకొంది.