కడప

సిసి కెమెరాలతో టెన్త్ విద్యార్థుల బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 7: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ అరికట్టేందుకు ఈ ఏడాది ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జిల్లాలో ఐదు పరీక్ష కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 21 నుంచి పరీక్షలు జరగనున్న తరుణంలో విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఐదు సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కడప నాగరాజుపేట ఉన్నత పాఠశాల, కమలాపురం, దువ్వూరు, పోరుమామిళ్ల, వేంపల్లె జడ్‌పి బాలికల పాఠశాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో కడపకు ప్రధమ స్థానం దక్కింది. గతంలో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలున్న ఐదు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా సిసి కెమెరాలు ప్రవేశపెట్టారు. కెమెరాలతోపాటు సిట్టింగ్, ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు, ఆర్‌జెడి, డిఇఓ, ఉప విద్యాశాఖ అధికారులు ముగ్గురు, పరీక్షల జిల్లా సహాయ కమిషనర్ ప్రతినిత్యం అకస్మికంగా తనిఖీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. సిసి కెమెరాల ఏర్పాటుతో చాలా మంది విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సిసి కెమెరాల వల్ల తమ పిల్లలకు అసౌకర్యంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కాపీయింగ్ అరికట్టి నాణ్యమైన విద్యను అందించేందుకే చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని విద్యాశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
భక్తజనసంద్రం పాలతల క్షేత్రం
పెండ్లిమర్రి, మార్చి 7: రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన శైవక్షేత్రాల్లో ఒకటైన శ్రీపొలతల పుణ్యక్షేత్రం శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. జిల్లాలోని పెండ్లిమర్రి మండలం గంగనపల్లె పంచాయతీ పరిధిలోని శేషాచల అటవీప్రాంతంలో వెలసివున్న శ్రీపొలతల మల్లేశ్వరస్వామి ఆలయానికి సోమవారం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కడప జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల నుంచి, కర్నాటక , తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పోలీసు అధికారులు వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం వేకువజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివార్లను అందంగా అలంకరించి భక్తులకు కనులవిందు చేశారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసి కాయ కర్పూరాలు సమర్పించారు. ఆలయం పక్కన వెలసివున్న అక్కదేవతల గుడి వద్ద మహిళ భక్తులు వారి కోరికలు నెరవేరాలని కోనేటిలో చన్నీటి స్నానాలు చేసి తడిబట్టలతో పిల్లల క్షేమాన్ని కాంక్షిస్తూ పీడపిశాచాలు తొలగిపోవాలని, ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్నారు. అనంతరం ఆలయం పక్కనే ఉన్న చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణానికి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కమలాపురం టిడిపి ఇన్‌చార్జ్ పుత్తానరసింహారెడ్డిలకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేసి శివపార్వతుల కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణాన్ని వేదపండితులు రాజేష్, విజయ్‌ల బృందంతోపాటు ఆలయ అర్చకులు కలిసి శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారి ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డిని ఘనంగా సన్మానించారు. రాత్రి 9గంటలకు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను అక్కదేవతల ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు.
పొలతల క్షేత్రంలో వసతుల కొరత
శివరాత్రి పురస్కరించుకుని పొలతలక్షేత్రంలో భక్తుల కోసం ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన వసతులు ఏమాత్రం సరిపోలేదు. ముఖ్యంగా నీటి సమస్య, మహిళలకు స్నానాలు ఆచరించేందుకు గదులు, మరుగుదొడ్ల కొరత అధికంగా కన్పించింది. అక్కదేవతల గుడి పక్కన ఉన్న కొలనులో నీరు లేక బురదనీటిలోనే స్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకోవాల్సి రావడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. భక్తులు కల్యాణం చూసేందుకు అవకాశం లేకండా ఆలయ అధికారులు, కార్యవర్గ సభ్యులు చుట్టునిలబడ్డారు. దీంతో సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురై నిర్వాహకులపై మండిపడ్డారు.
కిక్కిరిసిన శివాలయాలు
కడప : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని శివాలయలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా శివాలయాల్లో ఆలయా ప్రధాన అర్చకులు శివపార్వతులను ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు కనువిందు చేశారు. భక్తులు తెల్లవారు జామున నుంచే శివాలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండటంతో శివాలయాల వద్ద దేవస్థానాల చైర్మన్లు, ఉత్సవాల నిర్వాహకులు చలువ పందిళ్లు వేయించారు. ప్రధానంగా శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం రోజు శివరాత్రి రావడంతో పండుగకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు దేవస్థానాల్లో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎలాంటి తోపులాటలు లేకుండా భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే ఆలయాల్లో ఉదయం 5గంటల నుంచి శివునికి ప్రత్యేక అభిషేకాలు, గణపతి, లక్ష్మీసరస్వతి, నవగ్రహ రుద్రహోమాలు, పూజలు నిర్వహించారు. సాయంత్రం 6గంటల నుంచి శ్రీ శివపార్వతుల కల్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. లింగోద్భవ కార్యక్రమం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు శివాలయాలకు చేరుకున్నారు. ముఖ్యంగా నగరంలోని గడ్డిబజారు వీధిలోని శ్రీసోమసుందరేశ్వరస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మణపల్లె చంద్రవౌళీశ్వరశర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. అలాగే మోచంపేటలోని శ్రీప్రసన్నవిశే్వశ్వరస్వామి ఆలయం, నబీకోటలోని శివాలయం, జయనగర్ కాలనీలోని శ్రీమృత్యుంజయేశ్వరస్వామి ఆలయం, మున్సిపల్ మైదానంలోని శ్రీకాశీవిశే్వశ్వరస్వామి ఆలయం, దేవునికడపలోని శ్రీసోమేశ్వరస్వామి ఆలయంతోపాటు పలు శివాలయాల్లో అభిషేకాలు, పూజలు, శివపార్వతుల కల్యాణం, గ్రామోత్సవాలు ఘనంగా జరిగాయి.శైవక్షేత్రాలకు వచ్చిన భక్తులకోసం పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాలు, మంచినీటి వసతి కల్పించారు. అలాగే కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం మధ్య మధ్యలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.