మాయమైన పంచముఖాగ్ని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

55ఏళ్ల వయసొచ్చినా
యాబ్రాసి బతుకు బతికేస్తూ.. నోటికొచ్చింది వాగుతూ.. చేతికందింది మెక్కుతూ..
బ్రతుకు నెట్టుకుపోతున్న ఈ పాతకాలపు
బీఏ పట్ట్భద్రుడి పేరు
-పంచముఖాగ్నిహోత్రావధాని.
ఇతనికి నచ్చిన పని ఇంతవరకూ దొరకలేదు.
దొరికిన పనేదీ అతనికి నచ్చలేదట..
అంటూ పరిచయమవుతాడు గొల్లపూడి మారుతీరావు -మనిషికో చరిత్ర సినిమాలో.
ఆయన పరిచయమే ఓ వెరైటీ. అంతకంటే వెరైటీగా ఫస్ట్ సీన్‌లోనే పాత్ర ప్రవర్తనను చూపిస్తారు. డబ్బులివ్వకుండా డబ్బా కొట్లో జంతికలు తీసుకుని -తిరిగిచ్చేసి అరటిపండు తీసుకుని తినేసి -పండు బదులు జంతికలు ఇచ్చేశానుగా అని చెప్పే చచ్చుముచ్చు సమయస్ఫూర్తి చూపించిన హోత్రావధాని పాత్ర ఇంకెవరైనా పోషిస్తే ఆకట్టుకుంటుందా? అంత రక్తికడుతుందా అనిపిస్తుంది చూసే ఆడియన్స్‌కి.
మారుతీరావని ముద్దుగానో, గొప్పగానో చెప్పుకోవడమే తప్ప -పసిపిల్లాడి నుంచి పళ్లూడిన ముసలాడి వరకూ గొల్లపూడి ఇంటిపేరుతోనే పరిచయం. అసలు -మారుతీరావును పరిచయం చేయాలనుకోవడం హస్యాస్పదమేమో. రచయితగా -ఎన్నో కథలు, కథానికలు, నాటకాలు, నాటికాలు, నవలలు, వ్యాసాలు ఆయన కలంనుంచి జాలువారాయి. స్క్రీన్ రైటర్‌గా ఆయననుంచి ఎన్నో కథలు, అత్యుత్తమ సంభాషణలు పుట్టుకొచ్చాయి. నటుడిగా ఎన్నో పాత్రలకు జీవంపోశారు. రేడియో వ్యాఖ్యాతగా ప్రతిభ చూపారు. నాటక ప్రయోక్తగా ప్రత్యేకత చాటుకున్నారు. టీవీ నటుడిగా, యాంకర్‌గా, జర్నలిస్టుగా, ఫిల్మ్ ఎడిటర్‌గా, దర్శకుడిగా.. ఆయన అభినివేశం చూపని కళారంగం లేదేమో అనిపిస్తుంది. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి వయోధిక అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. నిజంగా ఇది సినిమా పరిశ్రమకే కాదు, సాహితీ లోకానికి, కళా ప్రపంచానికి తీరనిలోటే.
1939 ఏప్రిల్ 14న విజయనగరంలో పుట్టినవాడు గొల్లపూడి మారుతీరావు. విద్యాభ్యాసం తరువాత విజయవాడ ఆకాశవాణి నుంచి జీవితం మొదలెట్టిన మారుతీరావు, అక్కడ ప్రజ్ఞావంతుల పరిచయంతో రచనలవైపు ఆకర్షితులయ్యారు. అలా ఎన్నో కథలు, కలలు, నవలలు, నవనికలకు తన కలంనుంచి పురుడు పోసిన గొల్లపూడి -రెండు రెళ్లు ఆరు, పతిత, కరుణించని దేవతలు, మహానటుడు, కాలం వెనక్కు తిరిగింది, ఆశయాలకు సంకెళ్లులాంటి రచనలకు రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. ఆయన రచనా శైలిలోనే కాదు, మాటలోనూ ఓ విరుపు, మెరుపు ఉంటుంది. అభినయంలోనూ అది కనిపిస్తుంది. అందుకే గొల్లపూడి -ప్రత్యేకత కలిగిన కళాకారుడయ్యారు. ఒకదశలో ఆయనకు తగిన విలనిజాన్ని, క్యారెక్టర్ పాత్రల్ని సినీ రచయితలు పుట్టించారంటే అతిశయోక్తి కాదు.
రచయిత నుంచి సినీ పరిశ్రమవైపు ఆకర్షితులైన గొల్లపూడి -అరంగేట్రంతోనే తనదైన శైలి చూపించి ప్రత్యేకత చాటారు. అక్కినేని ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి ఆత్రేయతో కలిసి సంభాషణలు అందించారు. ‘ఆత్మగౌరవం’ చిత్రానికి కథనిచ్చి నందిని అందుకున్న గొల్లపూడి -తరువాతి కాలంలో తరంగిణి, సంసారం ఒక చదరంగం, కళ్లులాంటి అద్భుత చిత్రాలకు కథలు, సంభాషణలు అందించారు. ఉత్తమ కథా రచయితగా ‘ఆత్మగౌరవం’, ఉత్తమ హాస్యనటుడిగా ‘తరంగిణి’, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘రామాయణంలో భాగవతం’, ఉత్తమ సంభాషణా రచయితగా ‘మేస్ర్తీ కాపురం’, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ‘ప్రేమ పుస్తకం’ ఉత్తమ టీవీ నటుడుగానూ ఆరుసార్లు నందులు అందుకున్న ప్రజ్ఞావంతుడు మారుతీరావు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో తొలిసారి స్క్రీన్‌పైకి వచ్చారు మారుతీరావు. దాదాపు 250 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, సహాయ నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు. ఒకవిధంగా విలక్షణ విలనిజాన్ని పరిచయం చేసింది గొల్లపూడే అనాలి. అందుకు స్వాతిముత్యం లాంటి చిత్రాలను ప్రస్తావించక తప్పదు. గొల్లపూడి కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాలుగా -యముడికి మొగుడు, స్వాతి, గూఢచారి నెం1, అభిలాష, శివుడు శివుడు శివుడు, ఛాలెంజ్, మురారి, కంచె, సైజ్ జీరో చిత్రాలను ప్రస్తావించొచ్చు. చివరిగా ఆది హీరోగా వచ్చిన జోడి (2019) చిత్రంలో గొల్లపూడి మారుతీరావు స్క్రీన్‌పై కనిపించారు. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన ఒకే ఒక చిత్రం -ప్రేమ పుస్తకం. ఇక -నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో స్క్రిప్ట్ స్క్రూటినీ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. 1996 ఇండియన్ పనోరమా సెక్షన్‌లో భారతీయ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యుడిగానూ ఆయన సేవలు అందించారు.
ఇక గొల్లపూడి కలంనుంచి జాలువారిన కొన్ని రచనలు -వర్శిటీ పాఠ్యాంశాలయ్యాయి. తెలుగు నాటక రంగంపై ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలు ఆంధ్ర వర్శిటీలోని థియేటర్ ఆర్ట్స్ విభాగానికి పాఠ్య పుస్తకమైంది. నాటికలు, నాటకాలు, కథానికలు, సినిమా కథలు, పత్రికా వ్యాసాలు.. ఇలా ఏ రచనలోనైనా తనదైన ప్రత్యేక ముద్ర చూపించారు గొల్లపూడి. వర్తమాన రాజకీయాలు, బతుకు ఘటనలపై తనదైన శైలిలో రాసిన ‘జీవనకాలమ్’ -గొల్లపూడికి ప్రత్యేక గుర్తింపునిచ్చిందనే చెప్పాలి. ఆసక్తికరంగా రచనను సాగిస్తూ -చురుక్కుమనే చతురతను ముగింపులో ప్రస్తావించటం మారుతీరావు ప్రత్యేక శైలి. సాహితీలోకానికి ఆయన చేసిన సేవలను గుర్తించి సంగం అకామెడీ అవార్డులు, సర్వరాయ ధర్మనిధి పురస్కారం, గురజాడ అప్పారావు మెమోరియల్ గోల్డ్ మెడల్, తెలుగు వెలుగు, మద్రాసు తెలుగు అకాడెమీ, పైడి లక్ష్మయ్య ధర్మనిథి పురస్కారం, ఆంధ్ర నాటక కళాపరిషత్ లాంటి అవార్డులు, రివార్డులు ఎన్నో ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. రచయితగా, నటుడిగా గొల్లపూడిది ఒక శకం. ఆనవాళ్లను మనకొదిలి -ఆ శకం ఆకాశంలో అంతర్థానమైపోయింది.