ఈ వైరస్ మాటేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం మొత్తం -కరోనా గురించే మాట్లాడుతుంది. వైరస్ వచ్చింది కనుక -తగు జాగ్రత్తలు తీసుకోమంటూ ప్రభుత్వాలు, ప్రముఖులు, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిగో వైరస్ అంటే అదిగో వ్యాక్సిన్ అంటున్నవాళ్లూ లేకపోలేదు. వీళ్లందరు చెబుతున్న వాటికి భిన్నమైన జాగ్రత్తలు చెప్పేవాళ్లూ లేకపోలేదు. సౌచిత్వంతో ఉండాలన్న సనాధన ధర్మం పాటించకపోవడం, నివాస వాతావరణానికి అనుగుణమైన ఆహారపు అలవాట్లను వదిలేయడమే ఇలాంటి వైరస్‌లకు భయపడాల్సి వస్తుందని అంటున్నవాళ్లూ లేకపోలేదు. చెట్టుని పుట్టని గౌరవించటం, ఔషధ గుణాలున్న ఆహారపు అలవాట్లు వదిలి పాశ్చాత్య పోకడలను పాటిస్తూ ప్రకృతికి దూరంగా జరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నది శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డిలాంటి ప్రముఖులు చెబుతోన్న మాట. మార్పు అనివార్యమేగానీ, ప్రమాదకరమైన మార్పు దిశగా ప్రయాణం మంచిది కాదన్న సూత్రం ఇందులో కనిపిస్తుంది.
తెలుగు సినిమా పరిశ్రమను సైతం ‘కమర్షియల్’ వైరస్ పట్టిపీడిస్తోంది. ఒకప్పుడు మన తెలుగు సినిమా చక్కని కథ కథనాలతో ప్రేక్షక హృదయాలను రంజింపజేసేది. చక్కటి సాహిత్యం, మధురానుభూతి గొలిపే సంగీతం, కలకాలం మదిలో నిలిచి నటీనటుల హావభావాలు, హృదయాలను గిలిగింతలుపెట్టే నాయికా నాయకుల ప్రణయ సన్నివేశాలు.. వెరసి కుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలు రూపొందేవి. తెలుగు ప్రజలనేకాక మొత్తం భారతదేశానికే ఆదర్శంగా నిలిచాయి మన సినిమాలు. అందుకే -50ఏళ్ల క్రితంనాటి సినిమాలనూ నేడు హాయిగా కూర్చుని చూసే పరిస్థితి ఉంది. నాటి చిత్రాలలో నైతిక విలువలు, బాధ్యతలు, కుటుంబ జీవన విధానం, ఆదర్శప్రాయమైన నడవడిక, సక్రమ ప్రవర్తనను స్పష్టంగా చూపించేవారు. ఒక చిత్రం రూపొందించాలంటే ఆ సినిమా యూనిట్ దానిని ఒక బృహత్తర కార్యంలా, యజ్ఞంలా భావించేవారు. పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, మూగమనసులు, అప్పుచేసి పప్పుకూడులాంటి సినిమాలు అజరామరమైన సినిమాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే దేశంలోకి చొచ్చుకొచ్చిన పాశ్చాత్య ధోరణుల వలన మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అది సినిమాల్లోనూ తీవ్రమవుతోంది. అన్ని విషయాలలో విదేశీ సంస్కృతిని అనుసరించడం, అనుకరించడం ఫ్యాషనైంది. అందుకే చెప్పుకోడానికి తెలుగు సినిమాలే అయినా -విదేశీ పోకడలే కనిపిస్తున్నాయి. ఏ సినిమాలో చూసినా మితిమీరిన హింస, హాస్యం పేరిట ద్వంద్వార్థాలు, వికారం కలిగించే హీరో హీరోయిన్ల శృంగార ఘటనలు, అనైతికత, తాగుడు సన్నివేశాలు, జుగుప్స కలిగించే హీరోయిన్ల అర్థనగ్న ప్రదర్శనలు.. ఇత్యాది అశ్లీలంతో కుటుంబంతో కలిసి చూడాలంటే జుగుప్స కలుగుతోంది. ఇప్పుడు హీరోయిజం అంటే -పనీపాటా లేకుండా స్నేహితులతో కలిసి మందుతాగడం, సిగరెట్లు కాల్చడం, అడ్డొచ్చిన వారిని చితగ్గొట్టడం. ఇక కథానాయిక పాత్ర ఏంటంటే -హీరోతో బరితెగించిన ప్రేమ, సగం దుస్తులతో సాగించే ప్రణయ కలాపాలు.. ఇలా కమర్షియాలిటీ పేరిట ప్రేక్షకుడిలో కామోదీప్త కోరికలు కలిగించడానికి సృష్టించబడిన పాత్ర. తెలుగు భాషాపరంగా చూస్తే మన మాతృభాషకు సినిమాల్లో జరుగుతున్న అన్యాయం తక్కువేం కాదు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లంలాంటి భాషలను కలగాపులగం చేసి మాట్లాడ్డం రివాజైంది. సినిమా అనేది మహత్తర సాధన కనుకనే గతంలో సామాజికాంశాలు, నైతిక విలువలు, భక్తిశ్రద్ధలను సమాజంలో నిలిపేందుకు ఆయా అంశాలను విధిగా ఉండేలా రచయితలు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. పాశ్చాత్య సంస్కృతి మన సంప్రదాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సమయంలో -దర్శకుడు కె విశ్వనాథ్ ఆధ్యాత్మిక, భారతీయ కళాసంపద, లలిత కళలు, సంగీతం, నాట్యంవంటి వాటిని పామరులకూ అర్థమయ్యేలా జనరంజక కథలు అల్లుకున్నారు. 1980-90ల కాలంలో తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశం భారతీయతపట్ల ప్రజలకు గౌరవం అమితంగా పెరిగింది. అయితే నేడు కాసులు రాల్చుకోవడం మాత్రమే ధ్యేయం, సినిమా ఫక్తు వ్యాపారం మాత్రమేనని సగర్వంగా ప్రకటించుకుని, వ్యాపారవేత్తలు సినిమా రంగంలో ప్రవేశించడం వలన సినిమాలలో విలువలు అంతరిస్తున్నాయి. సినిమాల ప్రభావం ఎలక్ట్రానిక్ మీడియాపైనా పడింది. నేడు టీవీలో వస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ప్రతిక్షణం వీక్షకుల మదిలో విషాన్ని నింపే ప్రక్రియ అప్రతిహతంగా సాగుతోంది. సినిమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో సంస్కరణలు చేపట్టేందుకు శ్యామ్‌బెనగల్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఎన్నో విలువైన సూచనలు అందించినా అవన్నీ బుట్టదాఖలు కావడం మనం చేసుకున్న దురదృష్టం. ఈ పరిస్థితి ఏ ఒక్క సినిమాకో సంబంధించినది కాదు. దాదాపు తెలుగులో రూపొందిస్తున్న అన్ని సినిమాలకూ ఇదే జాఢ్యం అంటుకుంది. ఓ మంచి మాట చెప్పే సినిమా ప్రస్తుతం భూతద్దంపెట్టి వెతికినా దొరకని పరిస్థితి. నిజానికి ఇది -జీవన విధానాన్ని దెబ్బతీసే వైరస్సే. దీన్నిలాగే పెంచి పోషిస్తే -ఏదోకరోజు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాకపోదు. ఆ పరిస్థితి రాకముందే -కళ్లు తెరవడం ఎంతైనా ముఖ్యం. లేదంటే -మారుతోన్న పరిస్థితుల పర్యావసానాలు ఎలా ఉంటాయో అంచనా వేయడమే అసాధ్యం. ఏమంటారు?

-సిహెచ్ ప్రతాప్