వీళ్ళతో లాస్ లేదు బాసూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు నిర్మించడం ఈరోజుల్లో ఓ సాహసమే. ఎవరైనా సరే లాభాలు లేదా పేరు కోసమో సినిమా తీస్తుండడం సహజమే. తను తీసిన ఎలాంటిదైనా గొప్పదని నిర్మాత భావిస్తాడు. లాభాలు రావాలని ఆశిస్తాడు. అందుకోసం పబ్లిసిటీసహా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఫలితం ముందుగా చెప్పలేం. ఒక్కోసారి లాభాలు తెస్తే ఒక్కోసారి గల్లాపెట్టి ఖాళీగానే ఉండిపోతుంది. చేతులు కాల్చుకోవడం ఇష్టంలేని నిర్మాతలు ఇప్పుడు మినిమమ్ గ్యారంటీ లాభాలైనా రావాలని భావిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందుకే ట్రెండ్ మార్చారు. పెట్టుబడి పెట్టే డబ్బులో అధిక మొత్తం రిటర్న్స్ వచ్చే హీరోలెవరా అని ఆరా తీసి వారితో సినిమాలు చేయాలనుకుంటున్నారు. వారికోసం ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో నిన్నమొన్నటివరకూ మినిమమ్ గ్యారెంటీ కథానాయకుడిగా రవితేజకి మంచి పేరుండేది. అలాగే ఆయన తరువాత అల్లరి నరేష్‌ను కూడా పిలిచేవారు. ఈ ఇద్దరు నటులు వరుస ఫ్లాపుల్లో చిక్కుకుపోవడంతో ఇప్పుడు ఆ లిస్టులోనుండి యువ కథానాయకులు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ నలుగురు కథానాయకులు మినిమమ్ గ్యారెంటీ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ముందుంది హీరో నాని.

నాని
లేటెస్టుగా హ్యాట్రిక్ హిట్స్‌ను దాటుకొని ‘జెంటిల్‌మన్’తో నాని మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఇప్పుడు నానితో సినిమాలు తీయడం చిన్న నిర్మాతలకు పెద్ద కష్టమే. ఎందుకంటే సినిమాకి సినిమాకి తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళుతున్నాడు కాబట్టి. ఒక్క సినిమా హిట్ అయితే నటీనటులకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. వాటిలో సరైనది ఎంచుకుని జాగ్రత్తగా ఉండకపోతే వారి కెరీర్‌కి బ్రేక్ పడినట్టే. అందులో యువ హీరోలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు యువనటుడు నాని కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక నాని నటించిన ‘్భలే భలే మగాడివోయ్’ చిత్రం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేగాక 20 కోట్లు వసూలు చేసి నానికి ‘స్టార్’ స్టేటస్ వచ్చింది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా 1.4 మిలియన్ డాలర్లను వసూలు చేసి స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చేలా చేసింది. నాని ఇప్పటివరకూ 5 కోట్ల బడ్జెట్‌లోపు వున్న చిన్న చిత్రాలే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు రేంజ్ పెరిగింది. అందుకే అతడిపై 10 కోట్లు పెట్టేందుకు కూడా నిర్మాతలు వెనుకాడటంలేదు. నాని లేటెస్టు మూవీ జెంటిల్‌మన్ సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మన్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్‌ను దాటుకొని మినిమమ్ గ్యారెంటీ కథానాయకుడిగా ఎదిగిన నానితో సినిమాలు తీయడానికి ఇప్పుడు దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నారు.

శర్వానంద్
యువ నటుడు శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన మినిమమ్ గ్యారంటీ కథానాయకుడిగా మారిపోయాడు. శర్వానంద్ నటించిన ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలు వరుస విజయాలను సాధించడంతో చిన్న సినిమాల నిర్మాతలకు శర్వానంద్ చిరునామాగా మారిపోయాడు. అయితే వచ్చిన ఆఫర్లు అన్నీ ఒప్పుకోకుండా సెలెక్టివ్‌గా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఇప్పుడు శర్వానంద్ నవ్వించే పోలీసు పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ పక్కన లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.

సాయిధరమ్‌తేజ్
మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌తేజ్ ఒక్కో సినిమాతో తన ఇమేజ్‌ని పెంచుకుంటూ వస్తున్నాడు. టాలీవుడ్‌లో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ కథానాయకుల్లో ఒకడు. ఇప్పటివరకు మెగా ఫ్యామీలిలో అందరూ స్టార్ హీరోలే ఉన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు, హై రెమ్యూనరేషన్లుతో సినిమా హిట్ అయితే లేదంటే భారీ లాస్ వచ్చేది. చిన్నా చితకా నిర్మాతలెవరూ మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్న నిర్మాతల కోసం నేనున్నానంటూ మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ ముందుకొస్తున్నాడు. సాయి ధరమ్‌తేజ చేసిన ‘పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రాలు ఓ మోసర్తు విజయాలు సాధించినా, తరువాత వచ్చిన ‘సుప్రీమ్’ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇతడితో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ కథానాయకునితో ఇప్పుడు 10 కోట్లతో సినిమా తీస్తే నో ప్రాబ్లమ్ అనే స్థాయిలో ఉన్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్‌తేజ తిక్క, జవాన్ సినిమాలు చేస్తున్నారు.

రాజ్ తరుణ్
వరుసగా మూడు హిట్ చిత్రాలతో ఒక్కసారిగా సంచలనం క్రియేట్ చేశాడు రాజ్‌తరుణ్. అనుకోకుండా హీరో అయిన ఈ కుర్రోడు ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ హీరో! డైరెక్టర్ అవుదామని వచ్చి ‘ఉయ్యాలా జంపాల’తో హీరోగా మారాడు. తర్వాత సినిమా చూపిస్త మావ, సుకుమార్ నిర్మాతగా మారి కుమారి 21ఎఫ్ సూపర్‌హిట్ అవ్వడంతో రాజ్‌తరుణ్ ఫేట్ మారింది. దాంతో ఇతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు పోటీపడ్డారు. అయితే తర్వాత వచ్చిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా ఫ్లాప్ అయినా, నాగేశ్వర్‌రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈడోరకం ఆడోరకం’ సినిమా ఈ హీరోని తిరిగి ఫామ్‌లో నిలిపింది. ‘ఈడోరకం ఆడోరకం’ తరువాత రెండు సినిమాలకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వాటిలో ఒక సినిమాకు మారుతి సహ నిర్మాతగా, కథ, స్క్రీన్‌ప్లే అందించగా కొత్త దర్శకురాలు సంజన దర్శకత్వం వహిస్తోంది.

- శ్రీ