ఆ ఇద్దరిదే గ్యారేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**జనతా గ్యారేజ్
తారాగణం: ఎన్టీఆర్, మోహన్‌లాల్, నిత్యామీనన్, సమంత..
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: తిరు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని,
వై రవిశంకర్, మోహన్
దర్శకత్వం: కొరటాల శివ
**
పక్కా కమర్షియల్ ఫార్ములామీదే ఎక్కువ దృష్టిపెట్టిన తాను -కెరియర్‌లో ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ లవ్ థీమ్ సినిమాలు తక్కువే చేశానన్నది అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ చెప్పే మాట. అందుకే -కమర్షియల్ ఫార్ములాను పక్కనపెట్టి వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ‘టెంపర్’, తరువాత ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు ఎన్టీఆర్ ఎంపిక చేసుకుంటున్న చిత్రాల్లో వైవిధ్యాన్ని తేటతెల్లం చేశాయి. తాజాగా - జనతా గ్యారేజ్ కూడా అలాంటి వైవిధ్యంతో కూడుకున్నదే. రెండే రెండు హిట్లతో షార్ట్ పీరియడ్‌లోనే టాప్ డైరెక్టర్ రేంజ్‌కి ఎదిగిన కొరటాల శివ దర్శకుడు. సో.. సెట్స్‌కు వెళ్లిన దగ్గర్నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్‌లోనే ‘ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును’ ట్యాగ్‌లైన్‌తో ఆకట్టుకున్న ఎన్టీఆర్ - జనతా గ్యారేజ్‌లో ఎలాంటి రిపేర్లు చేశాడో చూడాలంటే సినిమాకు వెళ్లాలి.
కథ: సత్యం (మోహన్‌లాల్)ది ఆటో మొబైల్ వర్క్‌షాప్. కుటుంబం, మిత్రులతో కలిసి జనతా గ్యారేజ్ పేరిట దాన్ని నడుపుతుంటాడు. ఆటోమొబైల్ రిపేర్లతోపాటు, తవద్దకు సాయంకోరి వచ్చేవారికి అండగా నిలబడుతుంటాడు. అప్పటికే సత్యంపై కక్షగట్టిన ముఖేష్ (సచిన్‌ఖేడ్కర్) జరిపిన ఓ అటాక్‌లో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం, తన తమ్ముడి కొడుకు ఆనంద్‌ను మేనమామ ఇంట్లో పెంచుతుంటాడు. ఆనంద్ (ఎన్టీఆర్) చిన్నప్పట్నుంచీ మొక్కలపై ప్రేమ పెంచుకుని, అవే తన ప్రపంచంగా బతుకుతుంటాడు. ముంబయిలో పెరిగిన ఆనంద్ -అనూహ్య పరిస్థితుల్లో హైద్రాబాద్ చేరుకుని అక్కడ జనతా గ్యారేజ్‌ను లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్‌ను జనతా గ్యారేజ్‌కు దగ్గర చేసిన అంశమేంటీ? జనతా గ్యారేజ్‌ను ఆనంద్ ఏస్థాయికి తీసుకెళ్లాడు..? అన్నది వెండితెరపై చూడాల్సిన మిగతా సినిమా.
ఎవరెలా చేశారు?
హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ప్రదర్శించడంలో ఎన్టీఆర్ తనదైన స్టైల్‌ను మరోసారి చూపించాడు. డైలాగ్ డెలివరీలో ఫోర్స్, యాక్టింగ్‌లో ఈజ్ కనబరుస్తూ సినిమాను హైట్స్‌కు తీసుకెళ్లాడు. ఇక మోహన్‌లాల్‌ను తెలుగు తెరపై చూడడం అందమైన అనుభూతి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మోహన్‌లాల్ నటనకు ఎక్కడా వంకపెట్టలేం. చాలాచోట్ల సినిమాను ఆయన పాత్రే నిలబెట్టింది. సినిమాపరంగా చూసుకుంటే సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల సన్నివేశాలు మేజర్ ప్లస్‌పాయింట్. ‘జయహో జనతా...’ అంటూ ఈ టైంలో వచ్చే మాంటేజ్ సాంగ్ బాగుంది. ఇక ‘పక్కా లోకల్’ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్‌సాంగ్ ఆడియన్స్‌కి మంచి రిలీఫ్! రెండు బలమైన పాత్రలను సృష్టించి, వాటి చుట్టూ ఎమోషన్ అల్లుకోవడంలో డైరెక్టర్ శివ కాస్త వైవిధ్యానే్న చూపించాడు. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరుకునే సత్యం పాత్రతో ఆడియన్స్ బాగా కనెక్టయ్యారు. జనతాగ్యారేజ్ పేరుని ఎంతో మందికి శక్తిగా మార్చి, సత్యం ఓ ప్యార్లల్ సొసైటీ నడపటం అన్న దానిలో అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్నిచోట్ల బాగానే వాడుకున్నా, కొన్నిచోట్ల సీరియస్‌నెస్ మిస్సయ్యిందన్న భావన ఆడియన్స్‌ని కొంచెం ఇబ్బంది పెడుతుంది.
రెండు మంచి పాత్రలతో కథ చెప్పే ప్రయత్నం చేసిన కొరటాల శివ, మూలకథను మెప్పించేలా మాత్రం తీర్చిదిద్దలేకపోయాడు. అయితే కథను కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో అల్లుకుని, ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అందించడంలో ఫర్వాలేదనిపించాడు. జనతా గ్యారేజ్ నేపథ్యాన్ని, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాలను బాగా డీల్ చేశాడు. ఇక తిరు సినిమాటోగ్రఫీ టెక్నికల్‌గా సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టింది. దేవిశ్రీప్రసాద్ అందించిన బాణీలు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తన ప్రతిభ చూపించాడు. వంకపెట్టడానికి వీల్లేనట్టు ఎడిటింగ్ సాగినా, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకోవు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఓకె.
దర్శకుడు కొరటాల గత సినిమాల్లో బలమైన పాయింట్‌ను, తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్‌లో చెప్పి సక్సెస్ కొట్టాడు. ఈసారి పూర్తిగా కమర్షియల్ పంథా మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా ‘జనతా గ్యారేజ్’. మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన, వాటి చుట్టూ పూర్తిస్థాయిలో కట్టిపడేసే కథ, కథనాలను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. అయితే ఎన్టీఆర్, మోహన్‌లాల్ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాలపాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు లాంటివి సినిమాకు కమర్షియల్‌గా కలిసివచ్చే అంశాలు. నిజానికి ఈ గ్యారేజ్‌లో ఇంకొన్ని రిపేర్లు జరిగితే బాగుండని ప్రేక్షకుడు అనుకున్నా, పెద్ద లోపంగా మాత్రం చూడటం లేదు. ఇక సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ బలమైన కథ, కథనాలు లేకపోవడమే. గొప్ప పాత్రలను ఎంచుకుని వాటిచుట్టూ కథ అల్లుకున్నా -వర్షన్ అవుట్‌డేటెడ్ కావడంతో ప్రేక్షకుడికి కాస్త బోర్ కొట్టిన ఫీలింగ్ కలిగింది. సమంత, నిత్యామీనన్ లాంటి స్టార్ హీరోయిన్లున్నా, వాళ్లు వేళ్ళపై లెక్కబెట్టేన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించారు. పక్కా కమర్షియల్ సినిమా అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సవ్వడం పెద్ద మైనస్.

-త్రివేది