ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘శతమానం భవతి’. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సక్సెస్ మీట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత దిల్‌రాజు తనతో తొలి చిత్రం ‘దిల్’ను డైరెక్ట్ చేసిన వినాయక్‌కు చిరంజీవి చేతుల మీదుగా సన్మానం చేయించారు. దిల్‌రాజు తల్లిదండ్రులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ- ‘దిల్‌రాజుకు దిల్ అనే పేరును ఏ ముహూర్తాన ఎవరు పెట్టారో కానీ అదే ఆయన ఇంటిపేరు అయ్యింది. దిల్ పేరులో ఉన్నట్టే దిల్‌రాజు దమ్మున్న, ఆరోగ్యకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తీస్తున్నాడు. సినిమాకు దర్శక,నిర్మాతలు తల్లిదండ్రులతో సమానం. ఈరోజుల్లో నిర్మాతలంటే క్యాషియర్‌తో సమానమైపోతున్నారు. కానీ కథను నమ్మి, తగిన విధంగా ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ను ఎంపిక చేసుకుని ముందుండి నడిపిస్తున్న దిల్‌రాజు నిజమైన నిర్మాతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. ఈ తరం హీరోలందరూ దిల్‌రాజు బ్యానర్‌లో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిని కనపరుస్తుంటారు. సెంటిమెంట్స్ ఉన్న గనుకే దిల్‌రాజు కెరీర్‌లో తనకు అండగా నిలబడ్డ వినాయక్‌కు సన్మానం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి దిల్ నుండి నేటి ఖైదీ నెం.150 వరకు వినాయక్ ప్రవర్తనలో ఏ మార్పు లేదు. శతమానం భవతి సినిమా ఓ మంచి వెజిటేరియన్ భోజనం చేసినట్టు ఉంది. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏ పాత్రనైనా చెడుగుడు ఆడగల నటుడు. ఎస్వీ రంగారావు తర్వాత అంత గొప్ప నటుడు ఈ తరంలో ప్రకాష్‌రాజ్ అని నా మనసులో అనిపిస్తూ ఉంటుంది. జయసుధ ద్రవం వంటి వ్యక్తి. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోతారు. చాలామందిని ఎడ్యుకేట్ చేసే హెచ్చరిక లాంటి సినిమాను డైరెక్ట్ చేసిన సతీష్‌ను అభినందిస్తున్నాను. శర్వానంద్ మా ఇంట్లోనే మా చరణ్‌తోపాటు పెరిగాడు. తనకు దక్కిన ఈ విజయం నా బిడ్డకు దక్కిన విజయంగా భావిస్తున్నాను’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ- ‘సతీష్ కథ చెప్పగానే దాన్ని నేను సినిమాగా కాకుండా లైఫ్‌గా చూశాను. మాతో సహా అందరి జీవితాలు అందులో కనపడ్డాయి. ఈ చిత్రంతో మళ్లీ ఫ్యామిలీ చిత్రాలకు కొత్త ఒరవడి మొదలవుతుందని అనిపించింది. అప్పట్లో బొమ్మరిల్లు సినిమా అలాంటి ఒరవడిని క్రియేట్ చేసింది. ఇది సక్సెస్ మీట్ మాత్రమే కాదు, మా ఫ్యామిలీ, శతమానం భవతి చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకునే ఫంక్షన్. దిల్ నుండి శతమానం భవంతి వరకు ఎంతోమంది నటీనటులను, టెక్నీషియన్స్‌ను, 8 మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాం. శతమానం భవతి సినిమా రెండు పెద్ద సినిమాల మధ్య పోటీగా విడుదలైంది. విడుదలైన రోజు పెద్దగా టాక్ రాలేదు. ఒకరిద్దరు తప్ప నాకెవరూ ఫోన్ చేయలేదు. సినిమా రిలీజ్ అయిన మూడవ రోజు నాకొక కాల్ వచ్చింది. నేను ముందు రిసీవ్ చేసుకోలేదు. తర్వాత కాల్ చేస్తే ‘నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను... సినిమా చాలా బావుంద’ని మెచ్చుకున్నారు. శతమానం భవతి చిత్రం అమ్మానాన్నలందరికీ అంకితం. మా బ్యానర్‌లో అందరూ గర్వపడే సినిమాలు చేస్తామ’ని అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ- ‘నేను హీరో అవుతాననగానే నా తల్లిదండ్రులు ననె్నంతో సపోర్టు చేశారు. నా జీవితంలో మర్చిపోలేని రోజుది. అంతా ఒక కలలాగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరచిపోలేను. శతమానం భవతి సక్సెస్ చూస్తుంటే హిట్ కొట్టాననే ఆనందం కనపడుతుంది. మాటల్లో చెప్పలేని అనుభూతి. సతీష్ కథ చెప్పడానికి ముందు ఫ్యామిలీ చిత్రం ఏం చేస్తాననుకున్నాను. నాలుగు నెలల్లో ఒక కలలాగా సినిమా పూర్తయింది. నా 25వ సినిమాకు చిరంజీవిని గెస్ట్‌గా పిలవాలనే కోరిక ఇప్పుడు ఇలా తీరింది.’ అన్నారు.