కొత్తగా.. ‘మూడొ’చ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పాత్రతో హీరోయిజం చూపించటం -సినిమాకు రొటీన్. ఒక హీరో రెండు పాత్రలు పోషిస్తే.. సమ్‌థింగ్ స్పెషల్. అదే హీరో ఒకే సినిమాలో మూడు పాత్రలు పోషిస్తే -ఓహ్.. అభిమానులు చెలరేగిపోతారు. అవును, ఇప్పుడు సౌత్ హీరోలకు అలాంటి ‘మూడే’వచ్చింది. ఒకర్ని చూసి ఇంకొకరు.. ఒకటీ రెండూ కాదు మూడేసి పాత్రల్ని అలవోకగా చేసేసేందుకు కథలు ఎంచుకుంటున్నారు. అంటే టెక్నికల్‌గా చేసేది ఒకే సినిమా అయినా.. సైకలాజికల్‌గా ఒక హీరో మూడు సినిమాలు చేసేస్తున్నట్టన్న మాట. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి దిగ్గజ నటుడు డ్యూయల్ రోల్ పోషిస్తే అభిమానులు ఆనందంతో ఊగిపోయేవారు. అలాంటిది ఏఎన్నార్ ‘నవరాత్రి’ సినిమాలో తొమ్మిది పాత్రలు పోషించీ మెప్పించారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఓకే హీరో మూడేసి పాత్రలు చేస్తున్న సినిమాలు వరుసగా రానున్నాయి.
ఒకప్పుడు హీరో డ్యూయల్ రోల్ అంటే -అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి కనిపించేది. మోస్తరు కథనైనా నెత్తిన పెట్టుకుని మోసేసి, వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన తమ హీరో సినిమాకు మినిమం గ్యారెంటీ ఇచ్చేసేవారు అభిమానులు. అలాంటి డ్యూయల్ ట్రెండ్ ఇప్పుడు కొంచెం విస్తరించిందేమో అనిపిస్తోంది. అటు తెలుగు, ఇటు తమిళం సినిమా హీరోలను చూస్తుంటే -ఒక హీరో మూడు పాత్రలన్న ట్రెండ్ సాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో కనిపించేందుకు హీరోలు ఎంత ఆసక్తి చూపిస్తున్నారనడానికి పెరుగుతున్న సినిమాల సంఖ్యనే ప్రస్తావించొచ్చు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘జై లవకుశ’. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే కోలీవుడ్ హీరో విజయ్ కూడా ఒక సినిమాలో మూడు పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్. అట్లీ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఇప్పుడు హీరో విశాల్ సైతం అదే బాట పట్టాడు. ఓ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు ఊపందుకున్నాయి. కొత్త దర్శకుడు తెరకెక్కించే ఈ సినిమాలో హీరో విశాల్ మూడు పాత్రల్లో కనిపిస్తాడని, చిత్రాన్ని ‘పిజ్జా’ నిర్మించిన సివి కుమార్ నిర్మిస్తున్నాడని బలమైన టాక్ వినిపిస్తోంది. మరి మూడు పాత్రల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమాలో ఏ హీరో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూద్దాం.

-శ్రీ