లెక్కలు మారుతున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం తెలుగు సినిమా ట్రెండ్ మారింది. కొత్తదనంతోపాటు భిన్నమైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సినిమాల స్థాయి పెరిగింది. తెలుగు సినిమా గురించి చర్చించుకోవాలంటే బాహుబలికి ముందు బాహుబలి తరువాత అని చెప్పుకునే రోజులు వచ్చాయి. దానికి కారణం బాహుబలికి ముందు సినిమాల విషయంలో ముఖ్యంగా బడ్జెట్ గురించి పెద్దగా పెట్టుబడి పెట్టిన సినిమాలు లేవు. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కూడా అది వారి మార్కెట్ పరిధి ప్రకారమే బడ్జెట్‌ను కేటాయించేవారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా 30నుంచి 50 కోట్ల మధ్యలోనే సినిమాలు నిర్మాణమయ్యేవి. కానీ బాహుబలి సినిమా ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీసుపై విజయదుందుభి మోగించింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ‘బాహుబలి-2’ 1700 కోట్ల వసూళ్లు రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఒక సినిమాను పరిధికి మించి బడ్జెట్ పెట్టి దానిని రాబట్టుకోవడమంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో రాజవౌళి విజయం సాధించాడు. బాహుబలి అనే సినిమా కొత్త కథతో తీసింది కాదు. కానీ కథనంతో రక్తి కట్టించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా మార్కెట్ చేసాడు. బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. ప్రపంచం దృష్టి తెలుగు సినిమాపై పడడంతో ఇప్పుడు ఇక్కడ రూపొందే ప్రతి సినిమాకు క్రేజ్ రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూపొందించిన చిత్రాల బడ్జెట్ కూడా పరిధిలను దాటి ప్రపంచ మార్కెట్ వైపు పరిగెడుతోంది. ఈ కోవలో తెలుగు భాషలో రూపొందుతున్న భారీ సినిమాల గురించి చర్చిస్తే తాజాగా తొమ్మిదేళ్ల గాప్ తర్వాత మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న చిరంజీవి ‘ఖైదీ నెం.150’తో ఘన విజయానన్ని అందుకున్నారు. ఈ సినిమాతో ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటారు. ప్రస్తుతం ఆయన నటించే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో తెరకెక్కే సినిమాకు కూడా ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలోనే బాహుబలితో జాతీయ స్థాయి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ కూడా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఇదివరకే విడుదలై ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తించింది. ప్రభాస్ ‘సాహో’ చిత్రం కూడా మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ లిస్టులో ఉంది సూపర్ స్టార్ మహేశ్ నటిస్తున్న ‘స్పైడర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో సంచలనం లేపుతోంది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయనున్నారు.
బాహుబలి స్ఫూర్తితో ఇప్పటికే తమిళంలో కూడా పలు చిత్రాలను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. హీరోలు కూడా వారి మార్కెట్ పరిధిని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘రోబో 2.0’ చిత్రం ఏకంగా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఏకంగా 350నుంచి 400 కోట్ల వరకు పెట్టినట్టు సమాచారం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు. ఇదే స్పూర్తితో దర్శకుడు సుందర్.సి కూడా 200 కోట్ల భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర సినిమాను ఇదివరకే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ సినిమా 2018లో విడుదల చేస్తారట. ఇక మలయాళ స్టార్ మోహన్‌లాల్ భీముని పాత్రలో తెరకెక్కుతున్న ‘మహాభారతం’ నేపథ్యంలో రూపొందే కురుక్షేత్రం సినిమా ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రధమార్ధంలో షూటింగ్ మొదలుపెట్టనుంది. మరోవైపు పలువురు తమిళ స్టార్ హీరోలు కూడా భారీ బడ్జెట్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోందట. మరోవైపు రామ్‌చరణ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఓ చిత్రాన్నిరూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమాల మార్కెట్ పరిధి పెరగడంతో బడ్జెట్ కూడా పెంచేసి విడుదల సమయంలో ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించి మొదటి వారంలోనే పెట్టుబడిని రాబట్టుకునే ఆలోచనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్‌సీస్ మార్కెట్‌లో స్టార్ హీరోల సినిమాలకు గిరాకీ ఎక్కువే. అక్కడ స్టార్ హీరోల సినిమాలు చూడాలని ప్రేక్షకులు ఆరాటపడతారు. దానికి తోడు ఓవర్‌సీస్‌లో స్టార్ హీరోల సినిమాలు తీసుకోవడానికి బయ్యర్స్‌కూడా భారీ పోటీ పడడంతో ఈ క్రేజ్ ఇంకా పెరిగింది. మొత్తానికి బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో తెలుగు సినిమాలో భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువవుతున్నాయి.

-శ్రీ