‘చీకటి వెలుగుల రంగేళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా-
ఒక మంచి కళే కాదు! గొప్ప ప్రచార సాధనం కూడా!!
ఆబాల గోపాలాన్నీ సమ్మోహన పరిచి ప్రభావితం చేయగల అసమాన సాధనం!
అట్టి సినిమా-
కొంత కాలం క్రితం వరకు సమాజానికి దర్పణంగా నిలిచింది. మంచి చెడులను విశే్లషించడంతోపాటు సమాజాన్ని మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేసింది. సమాజాన్ని అందులోని ఆచార వ్యవహారాలను, అందులోని మానవతా విలువలను, ఉదాత్త విషయాలను సినిమాల్లో చూపించే ప్రయత్నం జరిగింది. అలాగే భారతీయ జీవన విధానంలో పెన వేసుకున్న పండుగలను...ఆ విశేషాలను చూపే ప్రయత్నం జరిగింది. అలాగే భారతీయుల ప్రధాన పండుగల్లో ఒకటైన దీపావళి పండుగకు సంబంధించిన సన్నివేశాలు...దీపావళి పాటలు అనేకం తెలుగు సినిమాల్లో వున్నాయి.
‘దీపావళి’ అనే పేరుతో 1960లో ఒక సినిమానే వచ్చింది. దీపావళి పండగ జరుపుకునేందుకు కారణమైన నరకాసురుడి వృత్తాంతం ప్రధాన కథాంశంగా నిర్మితమైన చిత్రం ఇది. అంతే కాకుండా ‘ఇంటింటి దీపావళి’ అనే సాంఘిక చిత్రం కూడా వచ్చింది. దీపావళి చీకటినాడైన అమావాస్య రోజు వచ్చే వెలుగుల పండుగ. చీకటి తొలగి జీవితంలో వెలుగు వస్తే దీపావళి వచ్చినట్టుగా భావించేందుకు నిదర్శనంగా సినిమాల్లో చెప్పబడింది.
ఇక తెలుగు సినిమాల్లో ‘దీపావళి’ని ప్రస్తావిస్తూ అనేక పాటలే వచ్చాయి. ‘దీపావళి’ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పాట ‘విచిత్ర బంధం’ సినిమాలోని-
‘చీకటి వెలుగుల రంగేళి
జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల
ఆశల వెలిగించు ఈ పాలవెల్లి...’
ఈ పాట 1972లో నిర్మించబడిన ‘విచిత్రబంధం‘ సినిమాలో ఆచార్య ఆత్రేయ రాశారు. అమావాస్యనాడు జన్మించిన వారు ‘దొర’ అయినా ‘దొంగ‘ అయినా అవుతారనే సమాజంలోని నానుడిని ఇందులో ఆత్రేయ ఉపయోగిస్తూ
అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కని బావకో జవాబులు
మాటల్లో వినిపించు చిటపటలు
ఏ మనసున కవ్వించు గుసగుసలు
అమ్మాయి పుట్టింది అమావాస్యనాడు
అసలైన గజదొంగ అవుతుంది చూడు...’ అంటూ సాగేలా రాశారు.
‘దీపావళి దీపావళి
ఇంటింట ఆనంద దీపావళి
మాఇంట మాణిక్య కళికావలి...’ అని ప్రారంభమయ్యే పాట ‘షావుకారు’ సినిమాలోనిది. ఎల్‌విప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దీపావళి పాటను సీనియర్ సముద్రాల రాయగా శాంత కుమారి, బాలసరస్వతి గానం చేశారు. ఈ పాటలో దీపావళి పండుగ వాతావరణం, ఆనందం, అల్లుళ్ల సరదాలు, కూతుర్ల కళకళలు వంటివి వర్ణించబడ్డాయి.
1960లో విడుదలైన ‘పెళ్లి కానుక’ సినిమాలో దీపావళికి సంబంధించిన పాట రెండు వర్షన్‌లలో చిత్రించబడింది. అందులో ఒకటి సంతోషంతో నిండినది కాగా మరోటి విషాద గీతం. సంతోషంతో నిండిన పాటను ఆంజనేయశాస్ర్తీ రాయగా విషాద గీతాన్ని ఆత్రేయ రచించారు.
‘ఆడేపాడే పసివాడా ఆడేనోయి నీ తోడ
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా...’ అని సాగే సంతోష దీపావళి పాటలో ఒక పటాసు పేలుడులో కథలో విషాదం అలుముకుంటుంది. ఆ సన్నివేశంలో
ఆడేపాడే పసివాడ-అమ్మలేని నిను చూడ
కన్నీటి కథ అయే దీపావళి..’ అంటూ విషాదంగా సాగుతుంది దీపావళి పాట.
‘దేవుడమ్మ’ చిత్రంలో
‘ఈ పూట వెలిగే మతాబాల కన్నా
నీ పాల నవ్వుల దీపాలే మిన్న
ఈ ఇంటవున్నా మరే ఇంట వున్నా
నీవున్న ఆ ఇల్లే దీపావళి..’ అంటూ చెల్లెలిపైన అన్న అనురాగ ప్రకటన దీపావళి నేపథ్యంలో సాగుతుంది.
‘జమిందారుగారి అమ్మాయి’ చిత్రంలో ఆరుద్ర రాసిన పాట సమసమాజ స్థాపనను దీపావళి నేపథ్యంలో వెల్లడిస్తుంది.
‘ఇంటింటా దీపాలు వెలగాలి
మన ఊరంతా చీకట్లు తొలగాలి
కలవారి లోగిట్లో నిరుపేద ముంగిట్లో
ఒకేలాగ కాంతులు నిండాలి’ అని సాగే పాటలో ఆర్థిక వ్యత్యాసాలు తొలగి ధనిక పేదా తేడాలేని సమసమాజం కావాలని ఆరుద్ర ఆశిస్తారు
‘రామయతండ్రి’ సినిమాలో మల్లెమాల వ్రాసిన
వెనె్నలరోజు-ఇది వెనె్నల రోజు
అమావాస్యనాడు వచ్చే పున్నమి రోజు
ఇది వెనె్నల రోజు
పెద్దలంతా పిల్లలుగా మారే రోజు
పల్లేదో పట్టణమేదో తెలియని రోజు
దీపావళి రోజు’ అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అంబరాన్నంటే ఆనందంతో జరుపుకునే దీపావళిని వర్ణిస్తుంది.
‘దివ్వి దివ్వి దివ్వెట్లు
దీపావళి దివ్వెట్లు..’ అని సాగే ‘సంసారం-సాగరం’ సినిమాలో డాక్టర్ సి.నారాయణరెడ్డి సమాజ ఏకత్వాన్ని ప్రబోధిస్తూ
‘తారా జువ్వల్లా ఎగిరెగిరి పడక
చిమ్మిన రవ్వల్లా చెల్లా చెదురు కాక
ఒకటిగా కలిసి మెలిసి వున్నప్పుడే పండుగ’ అని ఉద్బోధించారు.
ఇలా తెలుగు సినిమాల్లో దీపావళి పాటలు ఎన్నో ఉన్నాయి.

-ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖరరావు