నంది అవార్డుల పునఃపరిశీలన జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత గత ఐదేళ్లుగా నంది అవార్డుల ఊసే లేదు. 2012, 2013 సంవత్సరాలకు ఒకేసారి ఏడాది మార్చి మొదటి వారంలో ‘నంది’ పురస్కారాలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మలి దశలో 2014, 2015, 2016 సంవత్సరాలకు ముచ్చటగా మూడేళ్ల నందులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డులపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం రోజులుగా అవార్డుల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా హేతుబద్ద చర్చ జరుపుతున్న ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్ర దర్శకుడు బాబ్జీతో ఆంధ్రభూమి ఇంటర్‌వ్యూ.. విశేషాలు...
* 2014, 2015, 2016 నంది అవార్డుల విషయంలో వివక్ష జరిగిందంటూ జరుగుతున్న వివాదంలో మీ గొంతు కూడా వినిపిస్తోంది.. నిజంగానే వివక్ష, గోల్‌మాల్ జరిగిందంటారా?
- వంద శాతం జరిగింది. అయితే అదేదో ఇప్పుడే జరిగిందనే విషయంలో నేను విభేదిస్తాను. అప్పుడప్పుడు తప్ప గత కొన్ని దశాబ్దాలుగా ఇది ఎప్పుడూ జరుగుతూనే వుంది. ప్రస్తుతానికి వస్తే 2014, 15, 16 సంవత్సరాల అవార్డుల ప్రకటన వచ్చినప్పటి నుంచి కాదు. ఇదే ఏడాది మార్చిలో ప్రకటించిన 2012, 2013 నంది అవార్డుల ప్రకటన వచ్చినప్పటి నుంచి నేను నెత్తినోరు బాదుకుంటూనే వున్నాను. కానీ అప్పుడు నా గొంతు ఒంటరిదయింది. ఇప్పుడు చాలా గొంతులు వినిపిస్తున్నాయి. పెద్ద గొంతులే గర్జిస్తున్నాయి. 2012 అవార్డులలో తెలుగు సినిమా పితామహుడు ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రానికి కనీసం జ్యూరీ అవార్డు కూడా ఇవ్వకపోవడం అన్యాయం అని నేను వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలెవ్వరూ స్పందించలేదు. అప్పుడే ఆ వివక్షను వ్యతిరేకించి వుంటే ఇప్పుడు ‘రుద్రమదేవి’ చిత్రానికి అన్యాయం జరిగేది కాదు. ఇతర చిత్రాలకు, ఇతర నటీనటులకు అన్యాయం జరిగేది కాదు. ఏదైనా తమదాకా వస్తే కానీ ఆ బాధ అర్థం కాదులెండీ..! పోనీలెండీ ఇప్పటికైనా పొలికేకలు వినిపిస్తున్నాయి. ప్రశ్నలు పొడుచుకొస్తున్నాయి.
*తప్పు ఎక్కడ జరిగిందటారు?
- ప్రభుత్వం జ్యూరీని నియమించేటప్పుడే మొదటి తప్పు జరిగిపోతుంది. ప్రభుత్వం జ్యూరీలో ఎవరెవరిని నియమించారనే విషయం ముందుగా మీడియాలో ప్రకటించకూడదు. అవగాహన లేనివాళ్లను, పరిజ్ఞానం లేని వాళ్లను, కులపిచ్చగాళ్లను, కోడి గుడ్డుపై పీకలు పీకడానికే ప్రయత్నించే వాళ్లను, అవార్డుల మార్గ దర్శక సూత్రాలు అస్సలు తెలి

యని వాళ్లను, చరిత్ర తెలియని వాళ్ల ను ఎవరో రెకమండ్ చేశారని జ్యూరీ సభ్యులుగా నియమించరాదు. ఉదాహరణకు రఘుపతి వెంకయ్య నాయుడు అంటే జాతీయ జెండాను కనుక్కున్న మహనీయుడు కదా అని జవాబిచ్చిన ఓ అపర మేధావి 2012 జ్యూరీలో మెంబర్‌గా పనిచేశారు. తలపండిన సీనియర్ సినీ ప్రముఖులు, సినీ పరిజ్ఞానం, కళల పట్ల అవగాహన వున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు, న్యాయవాదులు ఉండాల్సిన జ్యూరీలో నిన్నగాక మొన్ననో, అటు మొన్ననో సినీ ఫీల్డ్‌లోకి వచ్చి ఏ ఒకటో అరో సినిమాలు చేసి సినిమాలను జడ్జీ చేసే తెలివితేటలు మచ్చుకు లేని వాళ్లు కూడా రాజకీయ పలుకుబడి వుంటే చాలు జ్యూరీ మెంబర్‌లై పోతున్నారు. అలాంటప్పుడు న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఎందరో ప్రతిభామూర్తులైన దర్శక రచయితలు, సాంకేతిక నిపుణులు రేయింబవళ్లు కష్టపడి, ప్రాణాలను, కెరీర్‌ని ఫణంగా పెడితే, నిర్మాత అనే వ్యక్తులు తమ ఆస్తి పాస్తులను, తమ జీవితాలను ఫణంగా పెట్టి తీసిన సినిమాలు అవార్డులకు అర్హత కలవో.. లేవో ఈ జ్యూరీ మెంబర్‌లు తేల్చేస్తున్నారు. ఆ జ్యూరీ మెంబర్లలో కొందరు నటులు వృత్తిపరంగా తమకు వ్యతిరేకమైన నటుల సినిమాలకు అవార్డులు రాకుండా అడ్డుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయి. అలాగనీ జ్యూరీలో అందరూ అలాంటి వారే అనను. కొందరైనా నిఖార్సయిన వాళ్లు, నిజాయితీగా వ్యవహరించే వాళ్లు ప్రతి జ్యూరీలోనూ ఉంటారు. కానీ మిగతా వాళ్ల బలం ముందు వారి గొంతు పీలదవుతుంది. ‘సీతయ్య.. ఎవరి మాట వినడు.. ఏ ప్రలోభాలకు లొంగడు’ అనే తరహా వ్యక్తులను జ్యూరీ మెంబర్లుగా నియమిస్తే గానీ ఇలాంటి తప్పిదాలు జరగవు.
*లెజెండ్ సినిమాకు, బాలకృష్ణ - మహేష్‌బాబు - జూ.ఎన్‌టిఆర్ వంటి కమర్షియల్ హీరోలకు ఉత్తమ నటుడు అవార్డులు ఇవ్వడంపై మీ అభిప్రాయం?
- లెజెండ్ సినిమాకే కాదు. ఏ సినిమాకైనా ఇవ్వొచ్చు. కమర్షియల్ హీరోలకు కూడా ఇవ్వొచ్చు. అది బాలకృష్ణ, మహేష్‌బాబు, జూ. ఎన్‌టిఆర్ ఎవరైనా కావచ్చు. అయితే ఆ సినిమా నంది అవార్డుల మార్గ దర్శకత్వాలకు అనుగుణంగా వుందా లేదా అని కొలమానంలో చూసి ఇవ్వాలి. ఎంత పెద్ద కమర్షియల్ హీరో అయినా ఆయన ఓ సందేశాత్మక చిత్రంలోనో, ఓ చైతన్యవంతమైన ఆదర్శవంతమైన చిత్రంలోనో నటించి వుంటే ఆయనకు అవార్డు తప్పకుండా ఇవ్వాల్సిందే. అసలు నంది అవార్డులను ఏర్పాటు చేసింది కమర్షియల్ సినిమాల కోసం కాదు. కమర్షియల్ సినిమాలకు ఆ అవార్డుల అవసరం కూడా లేదు.
ప్రజలకు మంచిని బోధించే చిత్రాలను, నైతిక విలువలు-మానవ సంబంధాలను కాపాడే సినిమాలను, మూఢ నమ్మకాలు, మూఢాచారాలను ఎండగట్టే సినిమాలను, వ్యవస్థ కోసం.. సమాజం కోసం.. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియపరిచి తద్వారా దేశం కోసం శ్రమించే నాయకులను తయారు చేసే సినిమాలను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడిన నంది అవార్డుల పవిత్ర లక్ష్యం కాలక్రమేణా కనుమరుగైపోయింది. పక్కా కమర్షియల్ సినిమాలకు నంది అవార్డులివ్వడం ప్రారంభించారు. ఆ విషయానే్న నాలాంటి వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. సందేశాత్మక చిత్రాలకు అటు బిజినెస్ కాకుండా, ఇటు ప్రభుత్వ గుర్తింపయిన నంది అవార్డులు రాకుండా వుంటే అటువంటి సినిమాలను ఎవరు తీస్తారు చెప్పండి?
* నంది అవార్డుల విషయంలో తరచూ జరుగుతున్న తప్పిదాలేమిటి?
- మార్గ దర్శక సూత్రాలను కఠినంగా పాటించకపోవడం. రాజకీయ నాయకుల, సినీ

ప్రముఖుల ఒత్తిళ్లకు లొంగి ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్లు సదరు సూత్రా
లను తుంగలో తొక్కి తమకు ఇష్టమైన వాళ్లకు అవార్డులు
పంచేయడం.
* కొంచెం వివరంగా చెప్పండి?
-రీమేక్ చిత్రాలకు అవార్డులు ఇవ్వరాదు. కానీ హాలీవుడ్, ఇతర దేశాల సినిమాలను మక్కీకి మక్కీ కాపీ కొట్టి తీసిన అనేక చిత్రాలు నందుల పంటను పండించుకుంటున్నాయి. తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోని నటీనటులకు అవార్డులు ఇవ్వకూడదు. కానీ చాలా మంది ముఖ్యంగా హీరోయిన్‌లు, విలన్‌లు తమ పాత్రలకు డబ్బింగ్ తామే చెప్పుకోకపోయినా అవార్డులు అందుకుంటున్నారు. పునర్జన్మలు, మూఢ నమ్మకాలపై తీసిన సినిమాలు కూడా అనర్హాలే. కానీ అటువంటి కథలతో నిర్మించిన సినిమాలు కూడా కథలతో నిర్మించిన సినిమాలకు రాష్ట్ర అవార్డులే కాదు, జాతీయ అవార్డులు కూడా ఇచ్చేస్తున్నారు. ఉత్తమ నటుడు అవార్డులను కేవలం హీరోలకే ఇస్తున్నారు. ఆ కేటగిరికి హీరోలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాస్తవానికి హీరోలకు ఇవ్వవలసినది ‘ఉత్తమ కథానాయకుడు’ అవార్డు. ఉత్తమ నటుడు అవార్డుకు సినిమాలో నటించిన ఏ నటుడైనా అర్హుడే. అది అన్న పాత్ర ధారయినా కావచ్చు.. తండ్రి పాత్ర ధారాయినా కావచ్చు. ఏ నటుడైనా ఏ పాత్ర ధరించినా అతడు బాగా నటిస్తే అతనికి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలి. ఈ అవార్డులను మరగబెట్టి, పేరబెట్టి ఐదేళ్లకొకసారి ఇస్తే ఉపయోగం శూన్యం. కాబట్టి ఏ ఏడాదివి ఆ ఏడాదే ఇచ్చేయాలి.
* చివరగా ఓ ప్రశ్న.. ఇప్పుడు ఈ అవార్డుల ప్రకటన విషయంలో జరుగుతున్న వివాదానికి పరిష్కారం ఏమిటి?
- 2012, 2013, 2014, 2015, 2016 అవార్డుల విషయంలో ఓ పునః పరిశీలన కమిటీలను వేసి వివక్షకు గురయి, అర్హత వుండి కూడా అవార్డులకు ఎంపిక కాకుండాపోయిన ‘రుద్రమదేవి’, ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ వంటి చిత్రాలకు అవార్డులిచ్చి గౌరవించాలి. గతంలో ఎర్రమందారం, సీతారామయ్య గారి మనవరాలు సినిమాలు పోటీ పడినప్పుడు ‘ఎర్రమందారం’ చిత్రానికి అవార్డును ఇచ్చి ‘సీతారామయ్య గారి మనవరాలు’ చిత్రాన్ని పక్కన పెట్టినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఆ విషయాన్ని గుర్తించి, తప్పును గ్రహించి, ఆ చిత్రాన్ని అవార్డుల జాబితాలో చేర్చి అక్కినేనికి అవార్డునిచ్చి గౌరవించారు. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించాలి. ‘రుద్రమదేవి’, ‘రఘుపతి వెంకయ్య నాయుడు ఇంకా ఇటువంటి చిత్రాలేమైనా వుంటే వాటికి న్యాయం జరిగేలా చూసి నంది అవార్డుల గొప్పదనాన్ని నిలపాలి.