కాంబినేషన్ కాదు..కథే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌రాజుతో కలిసి ప్రయాణం చేయడంవల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నిర్మాతగా నా ప్రస్థానానికి మార్గదర్శకాలు అవుతున్నాయని అంటున్నాడు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. 2006లో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమాతో నిర్మాతగా తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నూతన నటీనటులతో ‘హుషారు’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్‌తో ఇంటర్వ్యూ..
కొత్త ట్రెండ్..
గత ఏడాది దసరా రోజున కొత్త నటీనటులతో సినిమాను మొదలుపెట్టాము. నూతన దర్శకుడు హర్ష కొనగంటి చెప్పిన కథ బాగా నచ్చింది. దానికి హుషారు అనే టైటిల్ పెట్టాం. స్టడీ పూర్తయినప్పటినుంచీ కెరీర్‌లో సెట్ అయ్యేవరకూ జరిగే కథ. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుంది.
పెద్ద హీరోలతో..
నేను లోకల్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వున్నా కూడా కొత్తవాళ్లతో చేయడానికి కారణం- కథ బాగా నచ్చింది. చాలా కొత్తగా గమ్మత్తుగా ఉంటుంది. ఈ సినిమాకు సెలబ్రేషన్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ అనే ట్యాగ్‌లైన్ పెట్టాం. పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలైంది. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి చిత్రాన్ని జూన్‌లో రిలీజ్ చేస్తాం.
కథ ప్రకారమే..
ఈ చిత్రంలో నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. అందరూ కొత్తవాళ్లే. కథలో కీలక పాత్ర కోసం రాహుల్ రామకృష్ణను ఎంపిక చేశాం. అతని పాత్ర సెకెండాఫ్‌లో వుంటుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. మంచి చెడుతోపాటు విలువలున్న సినిమా. యూత్‌ను టార్గెట్ చేసి తెరకెక్కిస్తున్నాం. అందాల రాక్షసి ఫేం రతన్ సంగీతం అందిస్తుండగా అర్జున్ రెడ్డి కెమెరామెన్ రాజ్ తోట ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ ఎడిటింగ్ చేశారు.
దిల్‌రాజుతో..
నేను తీసిన ‘సినిమా చూపిస్తా మావ’ చిత్రం నుంచీ దిల్‌రాజుతో నా ప్రయాణం మొదలైంది. ఆయనకు సినిమాలపై సరైన జడ్జిమెంట్ ఉంటుంది. నా ప్రొడక్షన్ నచ్చి నాతో నేను లోకల్ సినిమా చేశారు. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వస్తూనే వుంటాయి. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. దానివల్ల చాలా అనుభవాలు నేర్చుకుంటున్నాను.
కొత్త ప్రాజెక్ట్స్..
ఓ కొత్త దర్శకుడితో ఓ స్టార్ ఫ్యామిలీ నుండి హీరోను పరిచయం చేస్తూ నేను, దిల్‌రాజు కలిసి నిర్మించే సినిమా జూన్‌లో ప్రారంభం అవుతుంది. గత ఐదు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతోపాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తా.
మూడు పువ్వులు..
2006లో చిన్న నిర్మాతగా ప్రారంభమైన నా కెరీర్ సాఫీగా సాగుతోంది. నా మిత్రుడు శివాజీతో కలిసి చేసిన టాటా బిర్లా మధ్యలో లైలాతో నిర్మాతగా మారాను. ఇప్పటివరకూ 10 సినిమాలు చేశాను. ప్రస్తుతం నాతో సినిమాలు చేయడానికి దిల్‌రాజు, సురేష్‌బాబులాంటి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. వేణుగోపాల్ బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే బాగుంటుందనే నమ్మకం నిలబెట్టుకున్నాను. కాంబినేషన్‌లకు కాకుండా కథకే నా మొదటి ప్రాధాన్యత.

- శ్రీ