ఏదైనా.. ఆ క్షణమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిక్రమ్. ఆహార్యం నుంచి దర్శకత్వం వరకూ.. మాట నుంచి మన్నన వరకూ అతనిదో ట్రాక్. అతని సినిమాలు ప్రేక్షకులకు ఆనందం పంచుతాయి. సంభాషణలు జీవితానికో అర్థం చెబుతాయ. అతనితో సినిమా చేయడానికి పనె్నండేళ్లు ఎదురుచూశానని జూ. ఎన్టీఆర్ చెప్పాడంటే -త్రివిక్రమ్ ఇమేజ్‌ను అంచనా వేయొచ్చు. వాళ్లిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమే -అరవింద సమేత వీర రాఘవ. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్. ఎన్టీఆర్, పూజాహెగ్డే పెయర్. హారిక హాసిని బ్యానర్‌పై చినబాబు నిర్మించిన చిత్రం. గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో త్రివిక్రమ్ ముచ్చట్లు.

ప్రీ రిలీజ్ వేడుకలో వౌనంగా ఉన్నారు?

ఆ టైంలో చాలా అయోమయంలో ఉన్నా. హరికృష్ణ మరణం అందరి మనసుల్లో ఉండిపోయింది. నేనేం మాట్లాడిన దాంతోనే ముగించాలి. అందుకనే ఎక్కువ మాట్లాడలేదు. ఎన్టీఆర్‌కు వదిలేశా.
తండ్రి మరణాన్ని జీర్ణించుకుని, ఎన్టీఆర్ షూటింగ్ తొందరగానే మొదలుపెట్టాడు?
హరికృష్ణ చనిపోయిన తరువాత, నేను నిర్మాత చినబాబు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే డిసెంబర్, జనవరిలో చాలా సినిమాలు విడుదల తేదీలు ప్రకటించుకున్నాయి. కానీ రెండురోజుల తరువాత తారక్ ఫోన్ చేసి, షూటింగ్‌కు వస్తున్నా అన్నాడు. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావాలన్నాడు. నాలుగో రోజునుంచి షూటింగ్ చేద్దామన్నాడు. పూజాహెగ్డే కాల్షీట్లు ఉన్నాయి కాబట్టి టెన్షన్ పడొద్దన్నాడు. ఎన్టీఆర్ సంకల్పం కారణంగానే సినిమా దసరాకు విడుదలవుతున్నది.
ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకోవడానికి కారణం?
గత పనె్నండేళ్లుగా తారక్ నేను సినిమా చేయాలనీ అనుకుంటున్నాం. కుదర్లేదు. కానీ నాన్నకు ప్రేమతో తరువాత ఎలాగైనాసరే మనం సినిమా చేయాలనీ ఫిక్సయ్యాం. అప్పటినుండి ఈ విషయంపై నేనూ సీరియస్‌గా ఉన్నాను. అయితే అజ్ఞాతవాసి తరువాత ఎన్టీఆర్‌కు కథ చెప్పాను. అలా రెండు మూడు కథలు చర్చలకు వచ్చాక, ఫైనల్‌గా ఈ పాయింట్ తనకు నచ్చింది. ఇంతకుముందు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అరవింద సమేత ఒక కొత్త కోణాన్ని చూపించనుంది. అక్కడి మహిళలు ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు. వాళ్ళుపడిన బాధలు ఎలా వుంటాయో చిత్రంలో చూపించాను.
కోబలి సినిమా కథ ఇదేనా?
చాలామంది ఇదే ప్రశ్న అడిగారు. పవన్‌కళ్యాణ్‌తో తీద్దామనుకున్న కోబలి చిత్రానికి, ఈ సినిమాకీ సంబంధం లేదు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలతోపాటు ఎమోషన్స్‌తో సాలిడ్‌గా ఉంటుందీ చిత్రం. కోబలి సినిమా కథ పూర్తిగా భిన్నం. అందులో పాటలు ఉండవు. ఆదిలాగ ఉంటుంది.
ప్రేక్షకులు మీనుంచి ఆశించే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందా?
ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో కాస్త తక్కువనే చెప్పాలి. ఎందుకంటే మొదటిసారి ఈ సినిమా కోసం స్టోరీకి ఏంకావాలో అది మాత్రమే తీశాను. అనవసరమైన కామెడీ, శృతిమించిన రొమాన్స్ లాంటివి చిత్రంలో ఉండవు. ఎమోషన్స్ ఈ చిత్రానికి హైలైట్.
అత్తారింటికి దారేది తరువాత క్లైమాక్స్
భిన్నంగా చేస్తున్నారు?
అత్తారింటికి దారేది సినిమా తర్వాత ‘క్లైమాక్స్‌లో ఎమోషనల్ కంటెంట్’కు కనెక్టయ్యానా? అంటే ఖచ్చితంగా చెప్పలేను. నా సినిమాలకు సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ తర్వాత నేనేమీ పట్టించుకోను. సినిమా ఫస్ట్‌కాపీ బయటకు వచ్చేంతవరకే గుర్తుండిపోతుంది. తర్వాత పట్టించుకోను. ఫ్యాక్షన్‌లో భాగంగా దాడులు, గొడవలు జరగడానికి ముందు, జరిగేటప్పుడు చాలా విషయముంటుంది. పూర్తయిన తర్వాత తీవ్రత అసలే ఉండదు. గొడవలవల్ల ఎవరు మారరు. అందుకే ఇలా.
జగపతిబాబు పాత్ర ఎలా ఉంటుంది?
అహంకారపూరిత ప్రజలు ఎంత దూరమైనా వెళ్ళి ప్రతీకారం తీర్చుకుంటారన్న విషయాన్ని బయటపెట్టేదే జగపతిబాబు పాత్ర. ఇలాంటి వాళ్లను మనం చాలామందిని చూసే ఉంటాం. తాను నమ్మిందే కరెక్ట్ అని భావించి, దానికోసం ఏదైనా చేసే మూర్ఖత్వమున్న పాత్రలో కనిపిస్తాడు.
అజ్ఞాతవాసి వైఫల్యం గురించి ఏమంటారు?
నేను హిట్లు, ప్లాపులను పట్టించుకోకుండా సినిమాలు తీస్తుంటాను. నేనెప్పుడు స్క్రిప్ట్ చదవడం, రాయడంలోనే బిజీగా ఉంటాను. ఆ మూమెంట్‌లో ఏదైనా ఎక్సయిట్ ఐడియావస్తే దాని మీదనే పనిచేస్తాను మిగతావి పక్కకు పెట్టేస్తాను. అజ్ఞాతవాసి ప్లాప్ తర్వాత ఆ విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేదు. సక్సెస్ వచ్చినా అంతే. ఏదైనా ఆ ఇంపాక్ట్ ఒకటి లేదా రెండు రోజులే. ప్లాప్ అయితే తెగ ఫీలవ్వడం, హిట్టయితే మొత్తం నేనే చేసానని ఊదరగొట్టడం నాకు ఇష్టం ఉండదు.
ఎన్టీఆర్ గురించి?
అతను లోతు తెలిసిన వ్యక్తి. సినిమా అంటే ప్రాణం. సినిమా విషయంలో తానెప్పుడూ ఫోకస్‌గానే ఉంటాడు. కథ విషయంలో ప్రతి పాయింట్ తెలుసుకుంటాడు. ఏ డైలాగ్ ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా వెంటనే చెప్పేస్తాడు. చాలా స్పీడ్. అందుకే ఆయనతో వంద రోజులు షూటింగ్ అనుకుంటే 70 రోజుల్లోనే పూర్తవుతుంది. కానీ నేనే లేట్. వంద రోజులు అంటే 110 రోజులు చేస్తా.
మీలోని రైటర్, డైరెక్టర్ విషయంలో ఎవరిదీ పైచేయి?
ఇది నన్ను కన్ఫ్యూజ్ చేసే ప్రశే్న. ఎందుకంటే ఈ రెండూ నాకు ముఖ్యమే. నన్ను రెండుగా విభజించి చూడలేం. రైటర్‌గా నన్ను నేను ఎప్పుడూ అప్‌డేట్ చేసుకుంటూనే ఉంటా.
ప్రస్తుతం తెలుగు సినిమా మారుతుంది? ఇప్పుడు వస్తున్న సినిమాలపై మీ అభిప్రాయం?
నిజమే. మార్పు చాలా సహజం. సినిమా రంగంలో ప్రతి పది పనె్నండేళ్లకోసారి మార్పువస్తుంది. నేను ఏ సినిమానైనా థియేటర్స్‌లో చూస్తా. కొన్ని సినిమాలు చూసినప్పుడు అబ్బా అంటూ జలసీగా ఫీలవుతా. అలా ఫీలైన సినిమాలు ఈమధ్యకాలంలో చాలా ఉన్నాయి. అర్జున్‌రెడ్డి, రంగస్థలం, ఆర్‌ఎక్స్ 100, జేమ్స్‌బాండ్, కంచరపాలెం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా.
మహేష్‌తో సినిమా ఎప్పుడు?
నాకు తనతో చేయాలనుంది. కానీ కుదరడం లేదు.
బన్నీతో సినిమా అంటున్నారు?
ఇప్పుడు దాని గురించి చెప్పలేను.
టాలీవుడ్‌లో స్టార్ దర్శకుడిగా ఉన్న మీరు ఎందుకు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టడం లేదు?
నిజంగా ఎవరూ అడగలేదు. అడిగితే చేస్తానేమో.
ఈ బ్యానర్‌లోనే వరుస విజయాలు ఎందుకు?
ఈ బ్యానర్‌లోనే వరుసగా సినిమాలన్నీ చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ మనకు కొన్ని కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. అవి ఇక్కడ కుదిరాయి. అంతే తప్ప వేరే ఆలోచన లేదు.

-శ్రీనివాస్ ఆర్.రావ్