చిత్తూరు

మోదీ, బాబుల గీత మారుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 14: దేశంలో, రాష్ట్రంలో పేదరికం ప్రమాదస్థాయికి చేరింది. నిరుద్యోగం అణుబాంబులా కాచుకు కూర్చుంది. ఇవి రెండు దేశాన్ని ఎక్కడ దిగుమింగుతాయోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొని ఉంది. ఈ క్రమంలోనే మోదీ, బాబుల గీత మారుతోందని మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతామోహన్ జోస్యం చెప్పారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ, బీఎస్పీలు జత కట్టాయని, దీంతో మోదీ బాయ్‌కి మున్ముందు కష్టాలు తప్పవని అన్నారు. దేశంలో తృతీయ ఫ్రంట్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కూటమే 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రానుందని చెప్పారు. మోదీ కీర్తి దేశంలో ఎలా తక్కువ వ్యవధిలో మసక బారిందో అంతకన్నా వేగంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి కీర్తి కూడా దిగజారిపోయిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. బాబు అవకాశవాద రాజకీయాలు ఇక పనిచేయవన్నారు. కేంద్రంలోని బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నాలుగు సంవత్సరాలు తిరగముందే విబేధించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. మోదీ పాలనలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నారు. మోదీ ఇవ్వడు, బాబుకు సాధించుకునే శక్తి లేదన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారన్నారు. ప్రత్యేకహోదా అంటే ఐదు సంవత్సరాలకు రూ.25వేల కోట్లు నిధులు వస్తాయన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు లక్ష కోట్లు ఒక్క తిరుపతికే తీసుకువచ్చానన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఐషర్, ఐఐటిలను తిరుపతికి తీసుకువచ్చిన ఘనతే తనదేనని ఆయన చెప్పుకున్నారు. చెన్నయ్, బెంగళూరుల్లో కూడా ఈ జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఒక్కచోట లేవన్నారు. తాను ఎన్నోరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా మీడియా ఆ అభివృద్ధిని గుర్తించకపోవడం తనకు కొంత బాధ కలిగిందన్నారు. మీడియా అభివృద్ధిపై వార్తకథనాలు రాయకపోవడం విస్మయానికి గురిచేసిందన్నారు. ప్రత్యేక హోదా అంటూ బూరలూది, డప్పులు కొట్టి, తలకిందులుగా వేలాడితే మీడియా వాటికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చి ఊదరగొడుతున్నారని ఆయన మీడియాపై విమర్శనాస్త్రాలు సంధించారు. జిల్లాలో కాంగ్రెస్‌కు సంబంధించి వార్తలు రాస్తున్నాం కదా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కొన్ని పత్రికల తీరుపై తాను మాట్లాడుతున్నానన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సహకారం అందించకపోవడం వెనుక బాబు ప్రవర్తనే కారణమన్నారు. ఢిల్లీకి 29సార్లు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర జీడీపీ రేటు 18శాతం పెరిగిందని ప్రధాని ముందు గొప్పలు చెప్పుకున్నాడన్నారు. జీడీపీ రేటు పెరిగినప్పుడు కేంద్రం నిధులు ఎలా విడుదల చేస్తారన్న కనీస పరిజ్ఞానం బాబుకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. బాబు తనకు మిత్రుడని, ఇలాంటి విషయాల్లో తనను సంప్రదించి ఉంటే కేంద్రంతో, ప్రధానితో ఎలా వ్యవహరించి ఉండాలో వివరంగా చెప్పి ఉండేవాడినన్నారు. విభజన సమయంలో అనేక రకాల మార్పులున్నా తాను ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, కేంద్ర మంత్రులకు తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల అవసరాలను విస్పష్టంగా తెలియజేశానన్నారు. ఈక్రమంలో లక్ష కోట్ల రూపాయల విలువచేసే అభివృద్ధి పనులను తాను తిరుపతికి తీసుకురాగలిగానని చెప్పారు. ఇందులో 7 జాతీయ రహదారులు, దుగరాజపట్నం పోర్టు, మన్నవరం బెల్ ప్రాజెక్టు, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, రైల్వేస్టేషన్, క్రికిట్ స్టేడియాలకు అనుమతులు తీసుకువచ్చానన్నారు. అలాగే క్యాన్సర్ ఆస్పత్రిని, 300 పడకల ఆస్పత్రిని, 7008 మంది పేద మహిళలకు రూ.292 కోట్లతో గృహాలు మంజూరు చేయించానన్నారు. ప్రధానితో సఖ్యతతో ఉండటంతోనే తనకీ పనులు సాధ్యమయ్యాయన్నారు. తాను మంజూరు చేసుకువచ్చిన పనులకు అవసరమైన నిధులను మురగబెట్టి వెనక్కి పంపిన ఘనుడు బాబు అన్నారు. లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే దుగరాజపట్నం వద్దని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి బాబు అని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో అధికారపార్టీ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నా నిలదీయలేని ప్రతిపక్ష నేత ఉండటం దురదృష్టకరమని ఆయన జగన్‌పై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే తపన తప్ప ప్రజా సంక్షేమంపైన, అధికారపార్టీ దుర్మార్గాలను ఆయన ప్రశ్నించలేకపోతున్నారన్నారు. ప్రతిపక్ష నేతకు పక్షవాతం వచ్చిందేమోనని ఎద్దేవా చేశారు. తాను ప్రతిపక్ష నేతగా ఉంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేవాడినని డాక్టర్ చింతామోహన్ అన్నారు. తాము అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకువస్తే టీడీపీకి చెందిన అశోక్‌గజపతి రాజు పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండి తిరుపతి విమానాశ్రయం నుంచి విదేశాలకు ఒక్క విమానాన్ని కూడా నడపలేని అసమర్థ పాలకుడు బాబు అన్నారు. దుగరాజపట్నం విషయంలో మోదీ దుర్మార్గంగా వ్యవహరించినందువల్లే ఆయన కీర్తి మసకబారిందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, మీరు అందరినీ ఎందుకు కలుపుకొని పోవడంలేదని విలేఖరులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ తనలో కొంత బాధ ఉందని, 2015 ఉప ఎన్నికల్లో మట్టిగాజులు, బొందారంతోవున్న శ్రీదేవి అనే పేద మహిళను తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపానన్నారు. ఆరోజు ఎవరూ ఆమె గెలుపునకు సహకరించకపోవడమే తన ఆవేదనకు కారణమన్నారు. అయితే చిత్తూరు జిల్లాలోని నాయకులనే కాకుండా రాష్ట్రంలోని నాయకులందరినీ కలుపుకుని వెళ్లి, రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన సంకల్పమని చెప్పారు. నిజాయితీపరులైన వ్యక్తినే 2019లో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పీసీసీ కార్యదర్శి నైనారు శ్రీనివాసులు, ఎస్సీ సెల్ కన్వీనర్ పూతలపట్టు ప్రభాకర్, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ సభ్యురాలిగా కిడాంబి ప్రమీలమ్మ
* పార్టీకి సేవలందించిన వారికి కాంగ్రెస్‌లో గుర్తింపు
* ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మార్టిన్ లూథర్ స్పష్టం
తిరుపతి, మార్చి 14: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర, కేంద్ర పార్టీ అధిష్ఠానాలు దృష్టిసారించాయి. 47 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ప్రమీలమ్మకు ఏఐసీసీ సభ్యురాలిగా స్థానం కల్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన ప్రమీలమ్మ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రమీలమ్మ ఇద్దరు తాతలు కె.వరదాచారి, నామకల్ రంగాచారీలు స్వాతంత్య్ర సమరయోధులు. స్వాతంత్య్ర పోరాటంలో జైలు శిక్షను అనుభవించారు. అనంతరం ప్రజా ప్రతినిధులుగా కూడా సేవలు అందించారు. ఆమె పెద్దమ్మ జానకి కూడా చిత్తూరు జిల్లా నుంచి తొలి మహిళా స్వాతంత్య్ర సమరయోధురాలు కావడం విశేషం. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మార్టిన్ లూథర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజలకు సేవలు అందించిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు. పరిస్థితులను బట్టి వారికి తగిన హోదాను కల్పించి గౌరవిస్తుందని, అందులో భాగమే ప్రమీలమ్మను కాంగ్రెస్ పార్టీ అఖిలభారత అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏఐసీసీ సభ్యురాలిగా నియమించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి పోయారన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో రానుందని ఆయన జోస్యం చెప్పారు. ఏఐసీసీ సభ్యురాలిగా నియమితులైన ప్రమీలమ్మ మాట్లాడుతూ నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి తాను సేవలు అందిస్తున్నానని, దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు నుంచి తన తాత, ముత్తాతలు కాంగ్రెస్‌కు సేవలు అందించారన్నారు. ఈసందర్భంగా తనకీ పదవి ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధికీ, సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక దృష్టిసారిస్తానని ఆమె పేర్కొన్నారు.