క్రైమ్/లీగల్

ముఖేష్‌కు సుప్రీం షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న మరణశిక్ష అమలుకు తీహార్ జైలులో ఏర్పాట్లు జరుగుతుండగా ముద్దాయిలు తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటునే ఉన్నారు. దోషుల్లో ఒకడు ముకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. ముకేష్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తోసిపుచ్చడంతో అతడు సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు. మరొక ముద్దాయి వినయ్ కుమార్ శర్మ బుధవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. వినయ్ తరఫున రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి స్వయంగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశానని అతడి తరఫున్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు. ముకేష్ కుమార్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఈనెల 17న రాష్టప్రతి కోవింద్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన క్షమాభిక్ష పిటిషన్‌ను సమగ్ర పరిశీలించకుండా రాష్ట్రపతి త్వరితంగా నిర్ణయం తీసుకున్నారని అతడు ఆరోపించాడు. ముకేష్ పిటిషన్‌ను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ‘నిర్భయ కేసులో న్యాయస్థానాలు వెలువరించిన తీర్పు కాపీలు, ముద్దాయి గత నేరచరిత్ర, అతడి కుటుంబం ఆర్థిక పరిస్థితి అన్నింటినీ పరిశీలించిన తరువాతే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు’అని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తి ఆర్ బానుమతి నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 కింద నిర్ణయం తీసుకునే అధికారం రాష్టప్రతికి ఉందని స్పష్టం చేసింది. ‘ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన దానిపై ముకేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నాం’అని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఏఎస్ బొపన్నతో కూడిన బెంచ్ పేర్కొంది. డీఎన్‌ఏ రిపోర్టు, వైద్యపరీక్షల నివేదికలు, మరణశిక్ష తీర్పు, కేసు డైరీ, చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టు, సుప్రీం కోర్టు పరిశీంచే తీర్పును వెలువరించినట్టు బెంచ్ చెప్పింది. కేసుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను రాష్ట్రపతి పరిశీలనలోకి తీసుకోలేదన్న పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ముద్దాయి ముకేష్ సింగ్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ 25 పేజీల తీర్పును సుప్రీం కోర్టు వెలువరించింది. జైలు గదిలో తనపై అనైతిక చర్యలకు పాల్పడినట్టు ముద్దాయి తరఫున్యాయవాది చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. తీహార్ జైలులో ఒక ప్రత్యేక గదిలో అది కూడా ఇనుప చువ్వలున్న దానిలో, గాలి ఆడేలా ఉన్న సెల్‌లో ఉంచినట్టు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను బెంచ్ పరిశీలించింది. నిర్భయ కేసులో దోషులకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేసినట్టు డీజీ వెల్లడించారు. క్షమాభిక్ష పిటిషన్‌ను ఆగమేఘాలపై తిరస్కరించారని పిటిషనర్ తరఫున్యాయవాది చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. దీనిపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనతో న్యాయమూర్తులు ఏకీభవించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 కిందే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని మెహతా బెంచ్‌కు స్పష్టం చేశారు. క్షమాభిక్షకు సంబంధించి నిర్ణయం తీసుకునే విశేష అధికారం ఆర్టికల్ 72/161 కల్పించాయని సోలిసిటర్ జనరల్ అన్నారు. ‘ముద్దాయి రోజువారీ హాజరు, తాజా వైద్యపరీక్షల నివేదిక, ట్రయల్ కోర్టు తీర్పు కాపీ, శిక్ష అమలు ఏర్పాట్లు’ తీహార్ జైలు సూపరింటిండెంట్ సుప్రీం కోర్టుకు అందజేశారు. అలాగే వివరాలకు సంబంధించి రెండు కాపీలను కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపారు. కాగా ముకేష్ సింగ్ నామినల్ రోల్‌లు జైలు సూపరింటిండెంట్ రాష్ట్రపతికి పంపలేదన్న ముద్దాయి తరఫున్యాయవాది ఆరోపణను ధర్మాసనం తిరస్కరించింది. తనను చిత్రహింసలకు గురిచేశారని, లైంగిక దాడి జరిగిందని ముద్దాయి ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. 2012 డిసెంబర్ 16న జరిగిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురిలో ముకేష్ కుమార్ సింగ్ ఒకడు. ఫిజియోథెరపీ విద్యార్థినిపై తెగబడ్డ మృగాళ్లు ముకేష్(32), పవన్ గుప్తా(25), వినయ్ కుమార్ శర్మ(26), అక్షయ్ కుమార్( 31)కు ఫిబ్రవరి 1 ఉదయం ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ముకేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఈనెల 17న రాష్ట్రపతి తిరస్కరించారు. ఇంతకు ముందు మిగతా ముగ్గురు ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. వినయ్ క్యూరేటివ్ పిటిషన్లు బెంచ్ కొట్టివేసింది. అక్షయ్ బుధవారం సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ వేశాడు. పవన్ మాత్రం ఇప్పటికైతే ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. నలుగుర్ని ఒకేసారి ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు ఓ పక్క ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
*చిత్రం... నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించిన వివరాలు
తెలుసుకోవడానికి బుధవారం సుప్రీం కోర్టు వద్దకు వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు