క్రైమ్/లీగల్

కరోనా వార్డు పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిని మంగళవారం ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. ఒకవైపు ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రికి అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి పరీక్షలు నిర్వహించేందుకు, వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా వార్డును పరిశీలించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డిలో ఈ బృందంలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు గాంధీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించటంతో ఇక్కడ చేసిన ఏర్పాట్లను బృందం పరిశీలించి, ఆ తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రావణ్ కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో సూపరింటెండెంట్.. ఆసుపత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చే రోగులకు చేసే పరీక్షలు, ప్రత్యేక వార్డు ఏర్పాటు, అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది వివరాలను వివరించారు. వార్డు లోపలికి రోగి తప్ప ఇతరులను అనుమతించేది లేదని వివరించారు. వార్డుకు కూడా ఒక వైపు నుంచి లోనికి, మరోవైపు నుంచి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని, అనుమానిత రోగులకు అందించాల్సిన వైద్యం, వారితో మెలగాల్సిన తీరుపై ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి కరోనా వ్యాధి సోకిందా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు కేవలం ఆరు గంటల సమయం పడుతోందని వివరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో సర్కారు ఆసుపత్రికి వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైద్యులు, ఇతర సిబ్బంది రౌండ్ ది క్లాక్ ప్రజలకు అందుబాటులో ఉండాలని బృందం సూచించింది.