క్రైమ్/లీగల్

వీడిన పద్మావతి హత్య కేసు మిస్టరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 4: నగరంలో సంచలనం రేపిన గృహిణి పద్మావతి దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది. ఘటన జరిగిన సుమారు 50గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దోపిడీ సమయంలో ప్రతిఘటించినందునే మహిళ బలైందని, అంతకుముందు కూడా ఇదే తరహా ఘటనకు నిందితుడు పాల్పడినట్లు పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు. కమిషనరేట్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. భవానీపురం పోలీస్టేషన్ పరిధిలోని ధనలక్ష్మి పప్పులమిల్లు రోడ్డులో యేదుపాటి పద్మావతి(56) గత నెల 31న సాయంత్రం 4గంటలకు తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
నిందితుడి నేపథ్యం
పెనమలూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన గవిరినేని అనిల్‌కుమార్ గతంలో నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో నెల జీతానికి పనిచేసేవాడు. ఆదాయం చాలకపోవడంతో అక్కడ పనిమానేసిన అనంతరం సుమారు ఏడాదిన్నర పాటు కడప జిల్లా ముద్దనూరు వద్ద సిమెంట్, ఇటుక వ్యాపారం నిర్వహించి నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. తర్వాత తిరిగి విజయవాడ వచ్చేసి డబ్బు సంపాదించాలనే క్రమంలో నేరాలబాట పట్టాడు. మోటారు బైక్‌పై పలు ప్రాంతాల్లో సంచరిస్తూ సులువుగా దొంగతనాలు చేసేందుకు వ్యూహరచన చేస్తుండేవాడు. తలుపులు తెరిచి ఉన్న ఇళ్ళలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడాలని ఆలోచన చేశాడు. ఈక్రమంలో గత ఏడాది జూలై 10న విద్యాధరపురం అరవింద వీధిలో తలుపులు తెరిచి ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న నూకల సుమలత అనే మహిళను కత్తితో బెదిరించి బంగారు నానుతాడు, గాజులు, చెవిదిద్దులు దోచుకున్నాడు. దోచుకున్న సొత్తును మరుసటిరోజు ఆంధ్రా లయోలా కళాశాల సమీపంలోని ఐఓబీ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 1.56 లక్షలు తీసుకున్నాడు. ఇదే తరహా నేరాలకు అలవాటుపడిన అనిల్‌కుమార్ జనవరి 31న సాయంత్రం సుమారు 4గంటల సమయంలో భవానీపురం ధనలక్ష్మి పప్పులమిల్లు రోడ్డులో యేదుపాటి పద్మావతి ఇంట్లోకి ప్రవేశించాడు. ఓ శుభకార్యానికి భర్తతో కలిసి బయటకు వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చిన పద్మావతి ఆ సమయంలో దివాన్ కాట్‌పై నిద్రిస్తోంది. లోపలికి వచ్చిన అనిల్‌కుమార్ పద్మావతిని నిద్రలేపి నగలు ఇవ్వాల్సిందిగా కత్తితో బెదిరించాడు. ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన ఆమె తేరుకుని అనిల్‌కుమార్‌ను ప్రతిఘటించడంతో కత్తితో విచక్షణా రహితంగా పొడిచి గాయపరిచాడు. దీంతో బాధితురాలు కేకలు పెట్టడంతో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకుని పరారయ్యాడు. మరుసటిరోజు పటమట పోలీస్టేషన్ పరిధిలోని మణప్పురం ఫైనాన్స్ కంపెనీకి వచ్చి దోచుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 2.50 లక్షలు నగదు తీసుకున్నాడు.
సినీఫక్కీలో తప్పించుకునే యత్నం
నిందితుడు అనిల్‌కుమార్ ప్రొఫెషనల్ కిల్లర్ కాకపోయినా అంతా సినీఫక్కీలో వ్యవహరించాడు. కడపలో సిమెంటు వ్యాపారంలో నష్టం వచ్చాక ఖాళీగా ఉంటూ తరచూ టీవీల్లో వచ్చే క్రైం స్టోరీలు వీక్షించేవాడు. క్రమేణా వాటి నుంచి ప్రేరణ పొంది సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరమార్గం ఎంచుకున్నాడు. ఈక్రమంలో ఒంటరి మహిళలను దోచుకోవడం ఆరంభించాడు. పద్మావతి హత్యకు ముందు సుమలతను కత్తితో బెదిరించి బంగారం దోచుకున్నాడు. సుమలత అటకాయించక పోవడంతో చంపకుండా వెనుదిరిగాడు. కానీ పద్మావతి నిందితుడు కత్తి చూపించినప్పుడు ప్రతిఘటించడంతో బలైంది. పద్మావతి ఒంటిపై బంగారం దోచుకున్నాక పోలీసు జాగిలాలు పసిగట్టకూడదనే ఉద్దేశ్యంతో వంటగదిలోని కారం తీసుకొచ్చి ఘటనాస్థలిలో చల్లాడు. అనంతరం తాపీగా బయటకు వచ్చి బైక్‌పై నగరంలో తిరిగాడు. దర్యాప్తు అధికారులను, పోలీసు జాగిలాల దృష్టి మరల్చేందుకు పోలీసు కంట్రోలు రూము వద్దకు వచ్చి బందరు రోడ్డు, మొగల్రాజపురం, తదితర ప్రాంతాల్లో సంచరించి ఏలూరు వెళ్లాడు. ద్వారకాతిరుమల వెళ్లి తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకున్నాడు. దోచుకున్న బంగారం మరుసటిరోజు విజయవాడ వచ్చి మణప్పురం ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టి సొమ్ము చేసుకున్నాడు.
పట్టుబడింది ఇలా..
పద్మావతి దారుణ హత్యకు సంబంధించి పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటయ్యాయి. మరోవైపు సైబర్ క్రైం విభాగం రంగంలోకి దిగింది. నేరస్థలి పరిశీలన, వేలిముద్రల సేకరణ, సీసీ ఫుటేజ్ ఆధారాలు, బైక్, పాత నేరస్తుల డేటా సేకరించారు. టెక్నాలజీని వినియోగించి ఎట్టకేలకు నిందితుడికి సంబంధించిన వివరాలు పసిగట్టారు. పోలీసు ఊహాచిత్రం కూడా విడుదల చేశారు. ఈక్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసి ఎట్టకేలకు ఘటన జరిగిన 50గంటల్లోగా నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి కత్తి, పల్సర్ బైక్, రూ 1.20 లక్షలు నగదు, 86గ్రాముల బంగారం, రక్తం మరకలు కలిగిన దుస్తులు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద దొరికిన రశీదు ఆధారంగా 2019 మార్చిలో బంగారం తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఈ రెండు నేరాలతో పాటు మరో నేరానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు సీపీ వివరించారు. విలేఖరుల సమావేశంలో జాయింట్ సీపీ డీ నాగేంద్రకుమార్, క్రైం డీసీపీ కోటేశ్వరరావు, డీసీపీ విక్రాంత్ పాటిల్, ఏసీపీ సుధాకర్, సీఐ మోహన్‌రెడ్డి, సైబర్ క్రైం సీఐ శివాజీ పాల్గొన్నారు. కాగా వీరందరికీ సీపీ అవార్డులు ప్రకటించారు.