క్రైమ్/లీగల్

సామూహిక అత్యాచారం కేసులో ఎనిమిది మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 10: మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని అమనగల్ శివారులో 24 సంవత్సరాల అక్షర (పేరు మార్చారు)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ తొమ్మిదిమంది నిందితుల్లో ఎనిమిది మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ సంఘటన వివరాలను వెల్లడించారు. పరిచయాన్ని ఆసరా చేసుకొని అక్షరను నమ్మించి నయవంచనకు పాల్పడి తొమ్మిదిమంది సామూహిక అత్యాచారం చేశారని కోటిరెడ్డి తెలిపారు. వీరిలో ముగ్గురు మేజర్లు కాగా మిగతా ఆరుగురు మైనర్లుగా ఉన్నారన్నారు.
అక్షరను అమనగల్ రప్పించారిలా..
అక్షర ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి హైద్రాబాద్ నుండి ఇల్లందు వెల్లడానికి రైల్లో బయలుదేరింది. 7వ తేదీ ఉదయం మహబూబాబాద్ చేరుకొని ఇల్లందు వెళ్లేందుకు తన వద్ద డబ్బు లేకపోవడంతో సాయంత్రం వరకు తనకు తెలిసిన వారు కనిపిస్తారేమో అని మహబూబాబాద్‌లోనే ఉండిపోయింది. అయినా ఫలితం లేకపోవడంతో రాత్రి 8 గంటలకు గతంలో పరిచయం ఉన్న అమనగల్‌కు చెందిన ఆంగోతు చందుకు ఫోన్‌చేసి డబ్బులు అడిగింది. చందు ఇదే ఆసరాగా చేసుకొని అక్షరను అమనగల్‌కు రమ్మని పిలిచాడు. ప్రయాణికులను తీసుకువెళ్లే ఆటోలో అక్షర అమనగల్ వెళ్లింది. మాటల్లో పెట్టి డబ్బులు ఇస్తానని నమ్మించి అమనగల్‌కు ముందు మహబూబాబాద్ వెళ్లే రోడ్డుమార్గంలో కొంతదూరం తీసుకొని వచ్చి రోడ్డుపక్కన ఉన్న మామిడితోటలతోకి బలవంతంగా చందు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఆంగోతు చందు మిత్రులు ఇస్లావత్ వెంకట్, కేలోదు నెహ్రూ, దారావత్ ప్రభు, బాదావత్ శంకర్, లకావత్ శ్రీకాంత్, గుగులోతు హుస్సేన్, ఇస్లావత్ రఘు, ఇస్లావత్ కిషన్ ఉన్నారు. వారంతా కలసి రాత్రికి 9.30 గంటల ప్రాంతం నుండి 11 గంటల వరకు అక్షరపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
రోడ్డుపైకి అరుపులు వినిపించడంతో..
అమనగల్ నుండి మహబూబాబాద్‌కు వెళ్తున్న హరి అనే వ్యక్తి మామిడితోట నుండి రోడ్డుపైకి అరుపులు వినిపించడంతో తన బైక్‌ను ఆపి తోటలోకి లైట్‌వేసి పరిశీలించాడు. తొమ్మిది మంది ఒక అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడుతున్న విషయాన్ని గమనించి మోటారు బైక్‌లైట్‌ను వారివైపు వేశాడు. ఇది గమనించిన వారు అమ్మాయిని విడిచిపెట్టి పారిపోయారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న హరి వెంటనే ఆ విషయాన్ని అమ్మాయి తండ్రికి ఫోన్ ద్వారా వివరించాడు. బాధితురాలి తండ్రి అమనగల్‌కు వచ్చి అక్షరతో మహబూబాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో తొమ్మిదిమంది నేరస్థులను గుర్తించి వారిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపాడు. మరో నేరస్థుడు ఇస్లావత్ కిషన్ పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు.
నిందితుల నుండి రెండు సెల్‌ఫోన్‌లు, రెండుబైక్‌లు స్వాధీనం చేసుకున్నామని, వీరిపై నిర్భయ కేసులో, దిశ కేసులో ఇనె్వస్టిగేషన్ చేసిన తరహాలోనే విచారణ జరిపి శిక్షపడేవిధంగా అన్ని సాక్ష్యాలు సేకరించి త్వరలోనే కోర్టులో చార్జ్‌షీట్ వేస్తామని అన్నారు. దర్యాప్తు వేగవంతం చేసి నేరస్థులను పట్టుకోవడంలో సఫలమైన మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం, అతనికి సహకరించిన రూరల్ ఎస్సై రమేష్‌బాబు, కురవి ఎస్సై శంకర్‌రావులను, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎస్సైలు రమేష్‌బాబు, శంకర్‌రావులతో పాటు సిబ్బందికి నగదు బహుమతిని ఎస్పీ కోటిరెడ్డి అందజేశారు. ఈ విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, డీఎస్పీ నరేష్‌కుమార్, రూరల్ సీఐ వెంకటరత్నం పాల్గొన్నారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి