క్రైమ్/లీగల్

బ్రిజేశ్ ఠాకూర్‌కు యావజ్జీవ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో గల ఒక షెల్టర్ హోమ్‌లో అనేక మంది బాలికలపై లైంగికంగా, భౌతికంగా దాడికి పాల్పడిన బ్రిజేశ్ ఠాకూర్‌కు ఢిల్లీలోని ఒక కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఠాకూర్ తుది శ్వాస విడిచేంత వరకు కారాగార శిక్షను అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఠాకూర్‌తో పాటు మరో 11 మంది ముద్దాయిలకు కూడ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ కులశేఖర్ తీర్పు ఇచ్చారు. కోర్టు జనవరి 20వ తేదీన ఠాకూర్ నేరానికి పాల్పడినట్టు నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది. బిహార్ పీపుల్స్ పార్టీ (బీపీపీ) టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బ్రిజేశ్ ఠాకూర్ అనేక నేరాలకు పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. ఠాకూర్ లైంగిక దాడుల నుంచి పిల్లల రక్షణ (పోస్కో) చట్టంలోని సెక్షన్ 6 కింద బలవంతంగా లైంగికదాడి, భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కింద రేప్, గ్యాంగ్‌రేప్ వంటి నేరాలకు పాల్పడ్డాడని కోర్టు నిర్ధారించింది. ఠాకూర్ ఐపీసీలోని సెక్షన్ 120-బీ (నేరపూరిత కుట్ర), 324 (ప్రమాదకరమయిన ఆయుధాలతో దాడి చేసి గాయపరచడం), 323 (స్వయంగా గాయపరచడం) గాయపరిచేందుకు ప్రోత్సహించడం, పోస్కో చట్టంలోని సెక్షన్ 21 (ఒక నేరాన్ని కమిషన్‌కు రిపోర్ట్ చేయడంలో విఫలమవడం), జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని సెక్షన్ 75 (పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించడం) వంటి నేరాలకు పాల్పడ్డాడని కోర్టు తన 1,546 పేజీల తీర్పులో పేర్కొంది.
ఠాకూర్‌కు మిగిలిన జీవితం అంతా కారాగారంలో గడిపేలా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని ఈ కేసును దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఫిబ్రవరి 4వ తేదీన కోర్టును కోరింది. అయిదుగురు ముద్దాయిలు- ఠాకూర్, దిలీప్ కుమార్ వర్మ, రవి రోశణ్, వికాస్ కుమార్, విజయ్ కుమార్ తివారి బాలికలపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి, రేప్ చేశారని, అందువల్ల వారికి జీవిత చరమాంకం వరకు కారాగర శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ జిందాల్ కోర్టును అభ్యర్థించారు. వర్మ, వికాస్, గుడ్డు పటేల్, కిషన్ కుమార్, రామానుజ్ ఠాకూర్ పోస్కో చట్టం కింద దౌర్జన్యంగా లైంగిక దాడికి పాల్పడటం, ఐపీసీ, పోస్కో చట్టం కింద నేరపూరిత కుట్ర, రేప్, గ్యాంగ్‌రేప్, గాయపరచడం, రేప్ చేయడానికి ప్రోత్సహించడం, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 75 కింద నేరాలకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. మరో ఇద్దరు ముద్దాయిలు- రమాశంకర్ సింగ్, అశ్వని నేరపూరిత కుట్ర, రేప్‌కు ప్రోత్సహించడం వంటి నేరాలకు పాల్పడ్డారని నిర్ధారించింది.
వీరితో పాటు మహిళా ముద్దాయిలు- శైష్ట ప్రవీణ్, ఇందు కుమారి, మీను దేవి, మంజు దేవి, చందాదేవి, నేహాకుమారి, హేమా మసిహ్, కిరణ్ కుమారిలు నేరపూరిత కుట్ర, రేప్‌కు ప్రోత్సహించడం, బాలల పట్ల క్రూరంగా వ్యవహరించడం, నేరాన్ని కమిషన్‌కు తెలపకపోవడం వంటి నేరాలకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. ఇదిలా ఉండగా, కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని కొంతమంది ముద్దాయిల తరపు న్యాయవాది ధీరజ్ కుమార్ తెలిపారు.