క్రైమ్/లీగల్

గోదాముల్లో దాచిన 1,645 టన్నుల బియ్యం సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 14: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్న నిందితులను నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ భాస్కర్‌భూషణ్ శనివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. గత నెల 29న నెల్లూరు పౌర సరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి కృష్ణపట్నం పోర్టులోని సీఎఫ్‌ఎస్ గోదాములో వివిధ రకాల ప్లాస్టిక్ బ్యాగుల్లో నిల్వ ఉంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 1,645 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఈ సంఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ హరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడలోని మోయ్ కమోడిటీస్ ఇండియా లిమిటెడ్ అనే అంతర్జాతీయ ఎగుమతి కంపెనీ ఆఫ్రికాలోని టోగో దేశానికి చెందిన ఒక బయ్యర్‌కు కృష్ణపట్నం పోర్టు నుండి లామా పోర్ట్‌కు తక్కువ ధరకు భారతదేశ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సదరు మోయ్ కంపెనీ విజయవాడకు చెందిన ఎస్‌ఎంఆర్ ట్రేడర్స్ యజమాని షేక్ సయ్యద్‌తో కలిసి కొందరు రైస్ మిల్లర్లతో చేతులు కలిపి ఆఫ్రికాలో ఆహార కొరత ఉన్నందున ఇండియాలో దొరికే రేషన్ బియ్యానికి గ్రేడ్ ఏ ఇండియన్ రైస్‌గా బిల్లులు తయారు చేసి వాటిని ఆఫ్రికా బయ్యర్‌కు సరఫరా చేసి ఎక్కువ లాభాలు గడించవచ్చని ప్లాన్ చేశారు. దీనికి అనుగుణంగా పేదలకు పంచే రేషన్ బియ్యాన్ని డీలర్ల వద్ద నుండి తక్కువకు కొనుగోలు చేసి, దీన్ని రైతుల వద్ద నుండి అధిక ధరకు కొనుగోలు చేసినట్లుగా బిల్లులు, ఇన్‌వాయిస్‌లు సృష్టించారు. తర్వాత బియ్యాన్ని, బియ్యం నూకలతో కలిపి విదేశీ దిగుమతిదారులకు చెందిన బ్రాండ్ బియ్యం గోతాల్లో నింపి ఎస్‌ఎంఆర్ ట్రేడర్స్ బిల్లుల ద్వారా కృష్ణపట్నంలోని సీబర్డ్ గోదాములో నిల్వ చేయడం ప్రారంభించారు. గోదాము అధికారులతో కలిసి కస్టమ్ క్లియరెన్స్ చేయించి అనంతరం బియ్యాన్ని కంటైనర్‌ల ద్వారా ఆఫ్రికాకు చేరవేస్తుంటారు. ఈ విధంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 1,645 టన్నుల బియ్యాన్ని అధికారులు గుర్తించారు. దీనిలో ఎవరెవరి ప్రమేయముందో తెలుసుకోవాలని కోరుతూ కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌లో అదే రోజు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నెల్లూరు జిల్లా చెముడుగుంటలోని శ్రీరాజ్యలక్ష్మి రైస్ మిల్లు యజమాని కుంకాల రవి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన శ్రీబాలాజీ ట్రేడర్స్ రైస్‌మిల్లు యజమాని బత్తుల వెంకటేశ్వర్లు, కాకినాడకు చెందిన మోయ్ కమోడిటిస్ ఇండియా లిమిటెడ్ ఆపరేషనల్ మేనేజర్ మంచాల వీరవెంకట సత్యశివప్రసాద్, విజయవాడ ఎస్‌ఎంఆర్ ట్రేడర్స్ యజమాని షేక్ సయ్యద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ముద్దాయిలు బియ్యాన్ని తరలించిన రెండు లారీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన కృష్ణపట్నం పోర్టు సీఐ ఖాజావలి, ఎస్సైలు శివకృష్ణారెడ్డి, అంజిరెడ్డిని ఎస్పీ అభినందించి రివార్డులు అందచేశారు.

*చిత్రం... మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ భాస్కరభూషణ్