క్రైమ్/లీగల్

పడవ ప్రమాదానికి కారణమైన ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ పోలవరం, జూలై 21: పశువుల్లంక పడవ ప్రమాదానికి కారణమైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4.30 గంటల సమయంలో పశువుల్లంక మొండి రేవులో జరిగిన పడవ ప్రమాదానికి పడవ డ్రైవర్‌గా ఉన్న గుత్తాల రాజేష్, కోరుకొండ ఈశ్వరరావుతో పాటు పడవల యజమాని సలాది వెంకటేశ్వరరావులను ముమ్మిడివరం సీఐ కేటీటీవీ రమణరావు శుక్రవారం సాయంత్రం మురమళ్ళలో మాణిక్యాంబ గుడి ఎదుట సలాది కృష్ణ కిరాణా షాపు వద్ద అరెస్టు చేసినట్టు సీఐ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఐ పోలవరం మండలం పశువుల్లంక మొండి రేవు నుండి గోదావరి అవతల ఉన్న వలసలతిప్ప రేవుకు లోపల లంక గ్రామాల ప్రజలను దాటిస్తూ ఉంటారు. ఒక వారం పడవ డ్రైవర్ అయిన గుత్తాల రాజేష్, హెల్పర్ కోరుకొండ ఈశ్వరరావులు నడిపేవారు. మరో వారం బలుసుతిప్ప గ్రామానికి చెందిన డ్రైవర్ ప్రసాద్, హెల్పర్ పోతుల శ్రీను పడవ నడువుతూ ఉండేవారు. పడవ యజమాని ఒక్కొక్కరికి రోజువారీగా రూ. 500 జీతంగా ఇచ్చేవారన్నారు. పడవ యజమాని పర్యవేక్షణలో నడిపే వారన్నారు. ప్రమాదం జరిగిన రోజు పడవపై డ్రైవర్ రాజేష్, కోరుకొండ ఈశ్వరరావు, యజమాని ఈశ్వరరావులతో పాటు 30 మంది గ్రామస్థులు ఉన్నారు. ఆరోజు పడవలో 17 మంది పిల్లలు, 6 మోటార్‌సైకిళ్లు ఎక్కించుకొని పడవ బయలుదేరు సమయంలో బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన పంటుపై పనిచేస్తున్న వారు, పిల్లల తాలూకు తల్లిదండ్రులు గోదావరి ఉద్ధృతి ఎక్కువగా ఉందని చెప్పారు. పడవపై ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దని చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా పడవ యజమాని, డ్రైవర్, హెల్పర్లు నిర్లక్ష్యంగా పడవను నడిపారు. దీనితో గోదావరిలో నిర్మాణంలో ఉన్న మూడవ పిల్లర్‌ను ఢీకొట్టడంతో సుమారు 30 మంది, 6 మోటార్ సైకిళ్లు పడవ ప్రమాదంలో జారిపోయారు. ఈ ఘటన జరిగిన చోట పనిచేస్తున్న బ్రిడ్జి కార్మికులు పంటును ప్రమాద స్థలానికి చేర్చి 21 మందితో పాటు పడవ డ్రైవర్, హెల్పర్లను రక్షించినట్టు పోలీసులు తెలిపారు. మరో ఆరుగురు పిల్లలు, ఒక మహిళతో పాటు నాలుగు మోటార్ సైకిళ్లు గల్లంతయ్యాయి. గల్లంతైన వారికోసం పోలీసులు, రెవెన్యూ శాఖ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆధ్వర్యంలో ఎండిఆర్‌ఎఫ్, ఎఫ్‌యూఆర్‌ఎఫ్, ఫైర్, నేవీల సహాయంతో వారం రోజులుగా గోదావరిలోను, సముద్ర తీర ప్రాంతాల్లోను గాలింపు చర్యలు చేపట్టగా కే గంగవరం మండలం శేరిల్లంక గ్రామానికి చెందిన గెల్లా నాగమణి (35), పోలిశెట్టి వీరమనీషా (15), సుంకర శ్రీజ (15), తిరుకోటి ప్రియ (13) మృతదేహాలు లభించాయన్నారు. మిగిలిన విద్యార్థినులు శేరిల్లంకకు చెందిన తిరుకోటి రమ్య, పోలిశెట్టి అనూష, సుచిత్రల ఆచూకీ లభ్యం కాలేదని సీఐ రమణరావు తెలిపారు.
ప్రమాదానికి గురైన పడవ రెక్క విరిగిపోయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో నడపడం, పడవ సామర్ధ్యానికి మించి గ్రామస్థులను ఎక్కించుకొని పడవ ప్రమాదానికి కారణమైన ఓనర్ సలాది వెంకటేశ్వరరావు, డ్రైవర్ గుత్తాల రాజేష్, హెల్పర్ కోరుకొండ ఈశ్వరరావులను జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సూచనవ మేరకు అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో అరెస్టుచేసి శనివారం ముమ్మిడివరం మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ రమణారావు తెలిపారు. ఆయనతో పాటు ఐ పోలవరం ఎస్సై దుర్గాశేఖర్‌రెడ్డి ఉన్నారు.