క్రైమ్/లీగల్

దేశ రాజధానిలో మరో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పసిపిల్లలపై అత్యాచారం జరిపితే ఉరిశిక్ష తప్పదని ఇటీవలే కఠిన చట్టం తెచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఈ తాజా ఉదంతంతో తేటతెల్లమవుతోంది. రెండో తరగతి చదువుతున్న ఓ బాలికపై పాఠశాల ప్రాంగణంలోనే పట్టపగలు మూడు పదులు దాటిన ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేయగా స్కూలు యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. వివరాల్లోకి వెళితే... బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఓ బాలికను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న రామ్ ఆష్రే (37) స్కూల్ ఆవరణలోని పంప్‌రూమ్‌లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఎవరికీ చెప్పొద్దంటూ ఆ బాలికను తీవ్రంగా బెదిరించాడు. అక్కడినుంచి ఇంటికి వెళ్లిన బాలికకు రక్తస్రావం అయిన విషయాన్ని గమనించిన తల్లి ఆరా తీసింది. వివరంగా చెప్పలేకపోతున్న కుమార్తెను డాక్టర్ వద్దకు తీసుకువెళ్లడంతో అసలు విషయం బయటపడింది. పాపపై లైంగిక దాడి జరిగిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికనుంచి వివరాలు సేకరించి నిందితుడు ఆష్రేను అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌డీఎంసీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఆష్రే పర్మినెంట్ ఉద్యోగి అనీ, ఐపీసీతో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడ్ని బాలిక గుర్తించిందని డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకున్న పంప్‌రూమ్ వద్ద సీసీ కెమెరాలు లేవని పేర్కొన్నారు.
నలుగురు సస్పెన్షన్
మరోపక్క ఎన్‌డీఎంసీ నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. నిందితుడు రామ్ ఆష్రేతో పాటు ప్రధానోపాధ్యాయురాలు సంతోష్ రావత్, అసిస్టెంట్ ఇంజినీర్ తులసీరామ్, అసిస్టెంట్ టీచర్ శిఖాలను తక్షణం విధులనుంచి తప్పిస్తూ ఎన్‌డీఎంసీ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. పాఠశాలలో బాలికల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ మహిళా కమిషన్ (డిసిడబ్ల్యు) స్కూలు యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం పూర్తి నివేదిక అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కాగా, ఈ ఘటనతో ఎన్‌డీఎంసీ పాఠశాలలో చదువుతున్న బాలికల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పాఠశాల పనివేళల్లోనే బాలికలకు రక్షణ లేకపోతే ఎలా అంటూ వారంతా నిరసన చేపట్టారు. ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఆడపిల్లలను పాఠశాలకు ధైర్యంగా ఎలా పంపించగలమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రోజుకు ఇద్దరు చిన్నారులపై అత్యాచారం
ఢిల్లీ పోలీసుల గణాంకాల ప్రకారం దేశ రాజధానిలో రోజుకు ఇద్దరి కంటే ఎక్కువమంది బాలికలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఈ ఏడాది తొలి నాలుగు నెలల కాలంలో ఏప్రిల్ 30 వరకు 282మంది బాలికలపై అత్యాచారం జరిగిందని, ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 278 అత్యాచారాలు జరిగాయి.