క్రైమ్/లీగల్

ముజఫర్‌పుర్ ఘటన హేయం, దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ముజఫర్‌పుర్ అనాథాశ్రమంలో బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు హేయమని, సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధమైన సంఘటనలని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ ముజఫర్‌పుర్ ఘటనలపై కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. ఈ నివేదికలో అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని కోర్టు పేర్కొంది. అనాథాశ్రమంలోని బాలికలపై అత్యాచారాల ఘటనను ఉపేక్షించే ప్రసక్తిలేదని కోర్టు పేర్కొంది. సీబీఐ సమర్పించిన స్టేటస్ నివేదికలోని అంశాలు ప్రమాదకరమైనవని జస్టిస్ మదన్ బీ లోకూర్ ఆధ్వర్యంలోని ధర్మాసనం పేర్కొంది. పసిపిల్లలపై ఈ ఆకృత్యాలు ఏమిటి ? ఇటువంటి వాటిని సహించే ప్రసక్తిలేదు. ప్రధాన నిందితుడు బ్రజేష్ టాకూర్‌పై వచ్చిన అభియోగాలు చాలా తీవ్రమైనవని వ్యాఖ్యానించింది. మాజీ మంత్రి మంజూవర్మ భర్త చంద్రశేఖర వర్మ ఆచూకీపై స్టేటస్ నివేదిక ఇవ్వాలని కోర్టు సీబీఐను ఆదేశించింది. మాజీ మంత్రి మంజువర్మ ఇంట్లో పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై నివేదిక ఇవ్వాలని గత నెలలో కోర్టు బిహార్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ఆమె భర్త, బాలికలపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన బ్రజేష్ ఠాకూర్‌తో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అనేక దఫాలు మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని నివేదికను సీల్డ్ కవర్‌లో పెట్టి ఇవ్వాలని కోర్టు సీబీఐను కోరింది.
ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. శరణాలయాన్ని నిర్వహించిన ఠాకూర్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, జైల్లో కూడా మొబైల్ ఫోన్‌ను సంపాదించి మాట్లాడాడని కోర్టు పేర్కొంది. ఈ నిందితుడిని బిహార్ జైల్లో ఉంచడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో ఠాకూర్‌ను ఇతర రాష్ట్రాల జైళ్లకు ఎందుకు బదిలీ చేయరాదో షోకాజ్ నోటీసును ఎందుకు ఇవ్వరాదో కోర్టు ప్రశ్నించింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తా ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న బృందంలోని అధికారులను మార్చరాదని కోర్టు సీబీఐను ఆదేశించింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న అపర్ణ భట్ మాట్లాడుతూ ఈ కేసులో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో తీసుకున్న కఠిన చర్యలేమిటి అని కోర్టు బిహార్ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్‌ను ప్రశ్నించింది.సీబీఐ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, జైలు నుంచి ఫోన్‌లో మాట్లాడిన నిందితుడు ఠాకూర్ దాదాపు 40 మంది వ్యక్తులతో సంభాషణలు జరిపినట్లు గుర్తించినట్లు తెలిపారు. బిహార్ జైలు నుంచి ఈ నిందితుడిని తరలించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను విచారించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో చార్జిషీటును సంబంధించిన కోర్టులో దాఖలు చేయాలని, ఆ తర్వాత ఈ కేసువిచారణను ఏ కోర్టుకు బదిలీ చేసే విషయమై నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది. ఈ ఏడాది ఈ శరణాలయం నుంచి కొంత మంది బాలికలను ఇతర శరణాలయాలకు తరలించడానికి దారితీసిన కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు.