క్రైమ్/లీగల్

డిగ్రీ విద్యార్థులు .. చైన్‌స్నాచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట), నవంబర్ 15: ఉన్నతచదువులు చదువుకుని సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సిన గ్రాడ్యుయేట్లు .. గొలుసుదొంగలుగా మారారు. జల్సాలకు అలవాటు పడి చివరకు తమ జీవితాలను అంధకారంలోకి నెట్టుకున్నారు. గుంటూరు నగరంలో గత కొంతకాలంగా ఒంటరిగా సంచరిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టుచేశారు అర్బన్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట ఐలాబజారుకు చెందిన చిరుమామిళ్ల సాయివంశీ, గుడిపూడి పవన్‌కుమార్, షేక్ దరియా అబూషాను, గుంటూరుకు చెందిన మానుల్లాబషి అనే నలుగురు స్నేహితులు. వీరు నలుగురు జల్సాలకు అలవాటుపడి విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో గుంటూరులోని ఎస్‌విఎన్ కాలనీ, అరండల్‌పేట, పాతగుంటూరు, పట్ట్భాపురం ప్రాంతాల్లో ఒంటరి మహిళలను లక్ష్యం చేసుకుని పలు చోరీలకు పాల్పడ్డారు. గుంటూరు అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు గురువారం నగరంపాలెంలో సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్ట్‌చేసి 8 లక్షల రూపాయల విలువైన బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అర్బన్ ఎస్‌పి మాట్లాడుతూ యువత ఈజీ మనీ కోసం తప్పుడుమార్గాలను ఎంచుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. విద్యార్థులు సరైన మార్గంలో నడిచి, జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని, వారి నడవడికలపై తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని విజయారావు సూచించారు. నిందితులను అరెస్ట్‌చేసిన సిబ్బంది, అధికారులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్‌పి లక్ష్మీనారాయణ, వెస్ట్ డిఎస్‌పి సౌమ్యలత, సీసీఎస్ అదనపు ఎస్‌పి శ్రీరాఘవ, సిఐలు సురేష్‌బాబుతో పాటు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.