క్రైమ్/లీగల్

న్యూడెమోక్రసీ రాయల వర్గం డివిజన్ కార్యదర్శి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 8: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాత దళం బయ్యా రం మండలం అల్లిగూడెం శివారులోని మూలపోచారం గుట్టల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన మెరుపుదాడిలో ఆ దళానికి చెందిన మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి బండారి అయిలయ్య అలియాస్ వీరన్న, అతని అంగరక్షకుడు బానోత్ రాము అలియాస్ బీముడు పోలీసులకు చిక్కారు. మరో ఎనిమిది మంది దళ సభ్యులు తప్పించుకొని పారిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు అరెస్ట్ చేసిన అయిలయ్య, బీముడులను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా దాడిలో ఇద్దరినీ అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి ఆయుధాలు, కరపత్రాలు, సెల్‌ఫోన్‌లు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చరిత్ర అంతా నేరమయమే...
ఎస్పీ కోటిరెడ్డి కథనం మేరకు.. బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన బండారు ఐలయ్య అలియాస్ వీరన్న 1986 సంవత్సరంలో బయ్యారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడని ఆ సమయంలో పీడీయస్‌యు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇంటర్ పూర్తయిన అనంతరం 1987లో సూరత్ వెళ్లాడని, 1990 వరకు అక్కడే ఉండి బయ్యారం వచ్చి 1991లో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు మూడు సంవత్సరాలు ఇర్సులాపురంలోనే ఉంటూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ లీగల్ కార్యక్రమాల్లో భాగం పంచుకునేవాడు. 1994లో ప్రజాప్రతిఘటన దళ నాయకుడు దాసరి శంకర్ న్యూడెమోక్రసీ కార్యకర్తలపై జరిపిన దాడి లో బండారు అయిలయ్య తప్పించుకోగా సంద మం గయ్య, సందు సత్యనారాయణ చనిపోయారు. ఈ ఘటనతో బండారు అయిలయ్య తన కుటుంబాన్ని గందంపల్లికి మార్చుకొని అప్పటి నుండి సీపీఐ ఎంఎల్ పార్టీ లీగల్ సభ్యునిగా పనిచేస్తున్నాడు.
1997లో రామగుండాలలో మూతి భిక్షం, సజ్జ వీరబ్రహ్మం, రఘు అనే ముగ్గురిని ప్రజాప్రతిఘటన నాయుకుడు శంకర్ కాల్చి చంపాడు. దానికి ప్రతీకారంగా అదేవారంలో ఈదులాపురం గ్రామస్థులు ఏనుగుల మల్లయ్య, బండారి మల్లయ్యలను సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మధు దళం కాల్చి చంపింది. ఆ సంఘటనలో బండారు అయిలయ్య కూడా లీగల్ ఆర్గనైజర్‌గా పాల్గొన్నాడు. పోలీసులు అయిలయ్యను అరెస్ట్ చేయడంతో దాదాపు మూడు నెలల పాటు వరంగల్ జైల్లోనే ఉన్నాడు. ఆతర్వాత బెయిల్‌పై వచ్చి తిరిగి లీగల్ ఆర్గనైజర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో పివైఎల్ జిల్లా అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశాడు. 2000 సంవత్సరంలో పోతురాజు గోపిని చంపిన కేసులో, ఆ తర్వాత కొత్తపేటలో రవీందర్‌రెడ్డి అనే న్యాయవాదిని చంపిన కేసు లో కూడా బండారు అయిలయ్య నేరస్థుడు. 2006 గ్రామపంచాయితీ ఎన్నికల్లో కొన్ని కేసుల్లో నేరస్థుడుగా ఉన్నాడు. 2014 సంవత్సరంలో న్యూడెమోక్రసీ రెండుగా చీలిపోగా బండారు అయిలయ్య రాయలవర్గం మధు దళంలో సభ్యునిగా చేరారు. కొంతకాలానికి నరేష్ దళం వెంట బయ్యారానికి వచ్చాడు. సుమారు మూడు నెలల క్రితం మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శిగా ఎదిగాడు.
పట్టుపడిందిలా...
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాయల వర్గం దళం గురువారం పలువురు వ్యాపారులను, రోడ్డు కాంట్రాక్టర్‌లను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి బయ్యారం మండలం అల్లిగూడెం మూలపోచారం గుట్టల్లో సమావేశం అయ్యారు. సమావేశ సమాచారాన్ని అత్యంత విశ్వసనీయంగా తెలుసుకున్న బయ్యారం సీఐ రమేష్, ఎస్సై రవీందర్, ట్రాఫిక్ ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బంది కూం బింగ్ నిర్వహిస్తూ ఆ గుట్టపైకి వెళ్లారు. గుట్టపై ఉన్న సాయుధ నక్సలైట్లు బండారు అయిలయ్య అలియాస్ వీరన్న, అతని అంగరక్షకుడు బానోతు రాము అలియాస్ బీముడులను పట్టుకున్నారు.
వారి వద్ద నుండి 9ఎంఎం స్టేన్ కార్బన్, 9ఎంఎం రివాల్వర్, 28 బుల్లెట్లు, రూ. 33వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా దళ సభ్యులు నారాయణ అలియాస్‌నరేష్, చిరంజీవి అలియాస్ విజయ్, లలిత, ముత్తయ్య అలియాస్ మనోజ్ అలియాస్ పుల్లన్న, ఆనంద్, రాకేష్, కృష్ణ, మహేష్ అలియాస్ శ్రీధర్‌లు తప్పించుకొని పారిపోయినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసుల చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ఈ కేసులో ధైర్యసాహసాలు ప్రదర్శించి సాయుధ నక్సలైట్లను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

చిత్రాలు..వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి
* అరెస్ట్ అయిన డివిజన్ కార్యదర్శి వీరన్న, అతని అంగరక్షకుడు బీముడు