క్రైమ్/లీగల్

అవినీతి ఆరోపణల్లో నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఫిబ్రవరి 20: స్థానిక మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదు రోజుల్లోనే అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్రావుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల మేరకు ఈతనిఖీలు జరిగాయి. బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు నర్సీపట్నం చేరుకున్న ఏసీబీ అధికారుల బృందం కమిషనర్ ఉంటున్న లాడ్జీకి వెళ్ళి తనిఖీలు చేసారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ పాస్ పుస్తకాలు, రికార్డులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. లాడ్జీలో ఎప్పటి నుండి ఉంటున్నదీ, అడ్వాన్స్‌గా ఎంత ఇచ్చారనే వివరాలను లాడ్జి యాజమాని నుండి వాగ్మూలం తీసుకున్నారు. అదే సమయంలో కమిషనర్‌కు టిఫిన్ తీసుకొస్తున్న మధు అనే వ్యక్తి నుండి కూడా వివరాలు సేకరించారు. అనంతరం కమిషనర్‌ను మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి రికార్డులు తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 1988లో పురపాలక శాఖలో హెల్త్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరిన ఆయన శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా పదోన్నతిపై భీమిలి, విజయనగరం మున్సిపాలిటీల్లో పని చేసారు. 2008లో గ్రేడ్ 3 కమిషనర్‌గా పదోన్నతి పొందిన శంకర్రావు బొబ్బిలి మున్సిపాలిటీ కమిషనర్‌గా వ్యవహరించారు. బొబ్బిలిలో విధులు నిర్వహిస్తూ నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈనెల 15న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గణేష్ విలేఖరులతో మాట్లాడుతూ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు కమిషనర్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 13 చోట్ల డీఎస్పీల ఆధ్వర్యంలో ఏక కాలంలో సోదాలు జరుగుతున్నాయన్నారు. శంకర్రావు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గోపీనాథపురం, అత్తవారి గ్రామమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పలాస, ప్రస్తుతం నివాసం ఉంటున్న విశాఖలోని మధురవాడ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయన్నారు. కమిషనర్ బంధువులు, స్నేహితులు ఇళ్ళలో కూడా సోదాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. నర్సీపట్నంలో నిర్వహించిన తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇతర రికార్డులు లభించాయని సీఐ తెలిపారు. అనంతరం కమిషనర్ శంకర్రావును కస్టడీలోకి తీసుకుని విశాఖపట్నం తరలించారు.
చిత్రం.. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకర్రావు