క్రైమ్/లీగల్

కోట్లకు పడగెత్తిన ఏపీ టూరిజం అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్టేట్ ఆఫీసర్ రాచూరి శివరావు (55) ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారం మేరకు ఏసీబీ సెంట్రల్ వింగ్ అధికారులు సదరు అధికారితోపాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన ఇళ్లపై ఏకకాలంలో నిర్వహించిన ఈదాడుల్లో కోట్లాది రూపాయలు అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఎస్టేట్ ఆఫీసర్ శివరావు గతంలో విజయవాడ అర్బన్ తహశీల్దారుగా సుదీర్ఘకాలంపాటు పని చేశారు. ఆ తర్వాత తహశీల్దారు క్యాడర్‌లో డిప్యుటేషన్‌పై విజయవాడ అటోనగర్‌లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఏస్టేట్ ఆఫీసర్‌గా ప్రస్తుతం పని చేస్తున్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన శివరావు విజయవాడలోని టిక్కల్ రోడ్డు స్మితాటవర్స్‌లో నివాసముంటున్నారు. ఈయన ఏపీపీఎస్‌సీ గ్రూపు-4 ద్వారా ప్రభుత్వ సర్వీసులకు ఎంపికై 1987 ఫిబ్రవరి 19న రెవెన్యూ శాఖలో టైపిస్టుగా చేరారు. ఆతర్వాత పదోన్నతిపై డెప్యూటీ తహశీల్దారుగా కృష్ణాజిల్లా పెనమలూరులో 2003 నుంచి 2006 వరకు పనిచేశారు. ఆతర్వాత 2006 నుంచి 2008 వరకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో విధులు నిర్వహించారు. తహశీల్దారుగా పదోన్నతి పొంది 2012 నుంచి విజయవాడ అర్బన్ తహశీల్దారుగా ఆరేళ్లపాటు సుదీర్ఘకాలం పనిచేసి 2018 ఏప్రిల్ నుంచి బదిలీపై టూరిజం శాఖలో అడుగుపెట్టారు. ఎస్టేట్ ఆఫీసర్ శివరాంతోపాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులకు చెందిన 5చోట్ల ఏకకాలంలో దాడిచేసి సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించారు. విజయవాడలో రెండు ఫ్లాట్లు, అదేవిధంగా అతని అత్త దార్ల చిట్టెమ్మ పేరుతో విజయవాడ, రామవరప్పాడు, గుంటూరు జిల్లా నంబూరు గ్రామం, కృష్ణాజిల్లా చిట్టి గూడూరు గ్రామం, కంచికచర్ల వద్ద మాగులూరు గ్రామం తదితర చోట్ల విలువైన ఎనిమిది ప్లాట్లు గుర్తించారు. అదేవిధంగా కృష్ణాజిల్లా కంకిపాడు గ్రామంలో 2009లో నిర్మించిన 96.8 చదరపు గజాల గదికి సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అతని బావమరిది దార్ల విజయ్‌కుమార్ పేరుతో కృష్ణాజిల్లా తెంపల్లిలో 0.96 ఎకరాల భూమితోపాటు కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, విజయవాడ భవానీరోడ్డు తదితర చోట్ల రెండు విలువైన భవంతులు, అదేవిధంగా కృష్ణాజిల్లా బండారు గూడెం, కంచికచర్ల వద్ద రెండు ప్లాట్లు గుర్తించారు. అదేవిధంగా శివరాం దగ్గరి బంధువైన రెబ్బ అన్నపూర్ణమ్మ పేరుతో బినామీ ఆస్తులు గుర్తించారు. ఈమె పేరుతో కంకిపాడు గొడవర్రు వద్ద వేర్వేరుగా రెండు విలువైన ప్లాట్లు గుర్తించారు. మరో బినామీ రెబ్బ సుబ్బారావు పేరుతో కంచికచర్ల వద్ద 667 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని గుర్తించారు. అదేవిధంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో 0.88 సెంట్లు స్థలాన్ని శివరాం దగ్గరి బంధువైన కోటా శ్రీనివాసరావు పేరుతో బినామీగా పెట్టినట్లు సోదాల్లో ఇందుకు సంబంధించిన పత్రాలు అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉండగా స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన స్థలాన్ని కాచేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుల స్థలంలో 75సెంట్లు బంధువుల పేరుతో బదలాయించినట్లు గుర్తించారు.