క్రైమ్/లీగల్

తిరుమలలో హుక్కా తాగిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 24: తిరుమలలోని శేషాద్రినగర్ కాటేజీ రూమ్ నెంబరు 215లో ఢిల్లీ, పంజాబ్‌కు చెందిన పది మంది భక్తులు హుక్కా తాగుతుండగా తిరుమల టూ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరుమలకు నిషిద్ధ వస్తువులు వెళ్లకుండా టీటీడీ యాజమాన్యం ప్రతి నెల లక్షల రూపాయలు చెల్లించి నిఘా వ్యవస్థ రూపొందించిన విషయం పాఠకులకు విధితమే. అయితే ఢిల్లీ, పంజాబ్‌కు చెందిన భక్తులు హుక్కా సేవించడానికి ఉపయోగించే పరికరాలను, ముడిపదార్ధాలను తీసుకువెళ్లినా గుర్తించలేకపోవడం చూస్తే నిఘా వ్యవస్థను ప్రశ్నించినట్లయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్‌కు చెందిన పది మంది భక్తులు శ్రీవారి దర్శనార్ధం ఒక బృందంగా తిరుమలకు వచ్చారు. శేషాద్రినగర్ వసతి ప్రాంతంలో 215 గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వెంట తెచ్చుకున్న భంగి ఆకును సేవించారు. అందుకు సంబంధించిన వాసన విపరీతంగా రావడంతో అక్కడ పనిచేసే సిబ్బంది ఆ గది వద్దకు వెళ్లి వారిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా హుక్కా సేవించే పాత్రతో పాటు కొంత గంజాయి కూడా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి తిరుమలలో ఇలాంటి మత్తుపదార్ధాలు సేవించకూడదన్న అవగాహన ఆ భక్తులకు తెలియదని విచారణలో తేలింది. అయినప్పటికీ నిషేధిత గంజాయిని తిరుమలలో సేవించినందుకు భక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా తిరుమలకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిఘా అధికారులు ప్రగల్భాలు పలుకుతున్న క్రమంలో ఢిల్లీ, పంజాబ్‌కు చెందిన భక్తులు ఈ గంజాయిని, దానికి సంబంధించిన పాత్రను ఎలా తీసుకెళ్లారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల అలిపిరి వద్ద, జీఎన్‌సి టోల్ గేట్ వద్ద తనిఖీ నిమిత్తం నిర్దేశించిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరోమారు తేటతెల్లమైంది.