క్రైమ్/లీగల్

ప్రియురాలి కోసం ఆమె భర్తకు విషప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురం, మే 1: తన ప్రియురాలిని దక్కించుకోవడం కోసం ఆమె భర్తను హతమార్చడానికి ఓ వ్యక్తి పన్నిన కుట్రకు ఇద్దరు బలైన సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలో జరిగింది. సీఐ వెంకటేశ్వర రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిండ్ర మండలం అగరం దళితవాడకు చెందిన తాపీ మేస్ర్తి గోపీకి 17 సంవత్సరాల క్రితం తన మేనత్తకూతురు పరిమళతో వివాహమైంది. వీరిద్దరికీ 15,12 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు ఒకరు 10, ఒకరు 7వ తరగతులు చదువుతున్నారు. అయితే గోపీ, పరిమళ వివాహం జరగకముందే పరిమళకు అదేగ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వేలాయుధంతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో గోపీ, పరిమళల మధ్య తరచూ ఘర్షణ చోటుచేసుకుంటూ వచ్చాయి. ఇందులో భాగంగా నెలక్రితం పరిమళ భర్తను వీడి తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని తన పుట్టిల్లు సత్యవేడుకు వెళ్లింది. దీంతో వేలాయుధం గోపీని ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా గోపీకి సన్నిహితంగా ఉండే వ్యవసాయ కూలీ మేఘవర్ణంను పావుగా వాడుకోవాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఒక కూల్‌డ్రింక్ తీసుకొని అందులో విషాన్ని కలిపి గోపీకి ఇమ్మని మేఘవర్ణంకు సూచించాడు.
అయితే కూల్‌డ్రింక్‌లో విషం కలిపిన విషయం తెలియని మేఘవర్ణం కూల్‌డ్రింక్ బాటిల్‌ను తీసుకెళ్లి ఇంటిలో ఉన్న గోపీకి ఇచ్చాడు. గోపీ కూల్‌డ్రింక్ సగభాగం సేవించి మేఘవర్ణంకు ఇచ్చాడు. మేఘవర్ణం కూల్‌డ్రింక్ బాటిల్‌ను తన ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పెట్టాడు. కొంత సమయానికి మేఘవర్ణం భార్య మాధవి (28) కూల్‌డ్రింక్‌ను సేవించింది. కొంత భాగాన్ని తన భర్తకు ఇచ్చింది. కొంత సమయం వ్యవధిలో గోపీ తన ఇంటిలో మృతి చెందాడు. అదే సమయంలో మేఘవర్ణం భార్య కూడా మృతి చెందింది. మేఘవర్ణం అపస్మారకస్థితికి గురయ్యాడు. ఏం జరిగిందో తెలియని ఇరుగుపొరుగువారు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మాధవి, గోపీ మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మేఘవర్ణం పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు మేఘవర్ణంను విచారించారు. ఈ సందర్భంగా కూల్‌డ్రింక్ తాగడంతో ఇలా జరిగిందని, ఆ కూల్‌డ్రింక్‌బాటిల్ వేలాయుధం తనకిచ్చి గోపీకి ఇవ్వమన్నాడని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వేలాయుధం కోసం గాలింపులు చేపడుతున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వేలాయుధం తన ప్రియురాలు కోసం అడ్డు తొలగించుకోవాలని గోపీని చంపటానికి ప్రయత్నిస్తే ఆ కుట్రలో మేఘవర్ణం భార్యకూడా మృతి చెందింది. దీంతో మేఘవర్ణంకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మేఘవర్ణంకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొత్తం మీద ఒకరిని అడ్డు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో మరోమహిళ బలికావడం పలువురిని కంటతడి పెట్టించింది.